నిరంతర వార్తా స్రవంతి

Tuesday, May 20, 2008

తెరాసకు చిత్తశుద్ధిలేదు : వరంగల్ పర్యటనలో వైఎస్ విమర్స

సైదాబాద్ లోని సింగరేణి కాలనీలో అగ్నిప్రమాదం

హైదరబాద్ బల్కంపేట ఇంజినీరింగ్ కాలేజీలో అగ్నిప్రమాదం

ఆసెట్ ఫలితాల విడుదల

గుంటూరు మిర్చియార్డులో మళ్లీ అగ్ని ప్రమాదం

విజయవాడలో సి.పి.ఐ. ధర్నా

రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ప్రారంభం

గుంటూరు జిల్లాలో ఇసుక లారీ బోల్తా పడి ఇద్దరి మృతి

నిజామాబాద్ లో చంద్రబాబు పర్యటన

అనంతపురం హౌసింగ్ ఎ.ఇ. ఇంటిపై ఎ.సి.బి. దాడి

పాతబస్తీలో యాసిడ్ దాడి

హైదరబాద్: పాతబస్తీలో మోటారు సైకిల్ పై వెళుతున్న ఇద్దరు యువకులపై బుధవారంయాసిడ్ దాడి జరిగింది.

నల్గొండ జిల్లాలో బావిలో దూకి తల్లీ కూతుళ్ల ఆత్మహత్య

సిమ్రాన్ నెట్ కష్టాలు!

అసలే కెరీర్ సరిగా లేక కష్టాల్లో ఉన్న సిమ్రాన్ కి రీసెంట్ గా మరో తలనొప్పి ఎదురైంది. ఆమె ప్రస్తుతం చేస్తున్న టి.వి. సీరియల్ షూటింగ్ బ్రేక్ టైంలో ఒక వ్యక్తి వచ్చి ఆమెను క్యాజువల్ గా పలకరించాడుట. అభిమాని అనుకుని అభిమానంతో రెస్పాన్స్ ఇస్తే "అతను మీరు చాలా మంచి వారండి.. రోజూ ఇంటర్ నెట్ ఛాటింగ్ లో ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారండి "అని పొగిడాడట. కంగారుపడ్డ ఆమె మాట్లాడే లోగా " మీరు మాపాప యోగ క్షేమాలు అడగటం కూడా చాలా చాలా హ్యాపీగా ఉందండి " అని మరీ ఉత్సాహ పడ్డాడుట.

దాంతో బుర్ర తిరిగి పోయిన ఆమె కంగారుగా "మీరు పొరబడ్డారు...నేను సిమ్రాన్ ని అందిట". అతను చిరునవ్వు చెక్కుచెదరకుండా "అవును నేను మీ గురించే చెప్తున్నాను మీరు లేటెస్ట్ గా నెట్ లో పంపిన పర్శనల్ ఫొటోలు కూడా తెచ్చా ఆటోగ్రాఫ్ కోసం" అన్నాడుట. షాకయిన ఆమె వెంటనే కోపం తెచ్చుకుని అతనితో "నాకు అసలు నెట్ పరిచయమే లేదు... అందులోనూ ఫొటోలవి పంపేంత టెక్నికల్ నాలెడ్జ్ అసలు లేదు...మీరు ఇక వెళ్ళచ్చు" అందిట.ఈ సారి షాకవటం అతని వంతైందిట.

తర్వాత ఆమె ,భర్త దీపక్ తో కలిసి నెట్ ఓపెన్ చేసి చూస్తే అసలు విషయం బయిటపడింది. ఆమె పేరుతో వేరేవారెవరో నెట్ లో ఛాటింగ్ చేస్తున్నారట. ఈ విషయాన్ని ఆమె భర్త సీరియస్ గా తీసుకుని అమెరికా లో ఉన్న సాప్ట్ వేర్ ఇంజనీరు స్నేహితుడు ని సంప్రదించాడుట. దాంతో వాళ్ళు పూర్తి స్ధాయిలో ఎంక్వైరీ చేస్తే మౌంట్ రోడ్డులో రిజస్టర్ చేసిన ఓ IP address బయిట పడిందట. దాంతో దీన్ని సైబర్ క్రైమ్ గా బుక్ చేయాలని దంపతులిద్దరూ నిర్ణయానికొచ్చారట. అంతేగాక నెట్ లో తన పేరుతో ఛాటింగ్ చేస్తున్న వ్యక్తి తో సిమ్రాన్ కలిసిందిట. కాని అసలు విషయం కనిపెట్టిన అతను తప్పుకున్నాడుట. ఈ విషయాన్ని ఆమె నవ్వుతూ చెప్పినా సీరియస్ ప్లాబ్లెమ్ గానే దీన్ని పరిగణిస్తోంది సిమ్రాన్. అందుకే సొంతంగా వెబ్ సైట్ ఓపెన్ చేయాలని నిర్ణయానికి వచ్చిందిట. త్వరలో అది కార్యరూపం దాల్చనుందిట.

వైఎస్ కు పదవీ గండం!

ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి పదవికి ఇప్పట్లో ఏదైనా ప్రమాదముందా? ఈ నెల 29 న జరుగనున్న ఉప ఎన్నికల్లో టీఅర్ ఎస్ గనుక తన స్ధానాలను తాను దక్కించుకుంటే రాజశేఖరరెడ్డి పదవికి రోజులు దగ్గర పడినట్టే. కాంగ్రెస్ హైకమాండ్ వద్ద వైఎస్ పై ఇప్పటికే అనేక ఆరోపణల చిట్టా పేరుకుని ఉంది. అయితే రాజశేఖరరెడ్డి ప్రజాకర్షణ గల నాయకుడని హై కమాండ్ వద్ద సమాచారం ఉండడంతో ఆయన పై ఏ చర్య తీసుకోవాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిన పరిస్ధితి దాపురించింది. రాజశేఖరరెడ్డి ప్రజాకర్షణకు, రానున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి ముడిపెట్టకపోయినా, వైఎస్ కు ఇది పరీక్షా కాలమే.

వైఎస్ కు గతంలో కాంగ్రెస్ అధిష్టానవర్గం వద్ద ఆడింది ఆట, పాడింది పాటగా ఉండేది. ఇప్పుడా పరిస్ధితి లేదు. చిరంజీవి పార్టీ పెట్టడం ఖాయం కావడం, తెలుగుదేశం పార్టీ కొద్దిగా బలపడడం వంటి పరిణామాల నేపధ్యంలో వైఎస్ మీద హై కమాండ్ వత్తిడి తీవ్రతరమవుతోంది. కేంద్ర్ కేబినెట్ మంత్రి జైపాల్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం వద్ద మంచి పలుకుబడి ఉంది. అయితే ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి జైపాల్ ఆసక్తి చూపకపోవడంతో వైఎస్ కు ప్రత్యామ్నాయ శక్తి దాదాపు లేకుండా పోయింది.

అంతమాత్రం చేత వైఎస్ పదవి పదికాలాలపాటు నిలబడి ఉంటుందన్న గ్యారంటీ లేదు.ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కనీసం 6 స్ధానాల్లో అయినా విజయం సాధించకపోతే అధిష్టానవర్గం వైఎస్ ను నిలదీసి ప్రశ్నించడం ఖాయం. చిరంజీవి రాజకీయపార్టీ గురించి ఆసక్తిగా ఆరా తీస్తు న్న కాంగ్రెస్ అధిష్టానవర్గం ఆ విషయంలో వైఎస్ అభిప్రాయాలకు పెద్ద విలువ ఇవ్వడం లేదని, దగ్గుబాటి పురంధేశ్వరి వంటి వారి నుంచి సమాచారం రాబడుతున్నట్టు తెలుస్తోంది.

ఎన్నికల కోడ్ పై జాగ్రత్త: వైయస్

ఎన్నికల ప్రవర్తనా నియమావళి పట్ల జాగ్రత్త వహించాలని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి మంత్రులకు, కాంగ్రెస్ నాయకులకు సూచించారు. ఏ చిన్న పొరపాటు జరగకుండా ముందే అనుమతులు తీసుకోవాలని ఆయన మంగళవారం సూచించారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత లేదని ఆయన అన్నారు. పాజిటివ్ ఓటును పోలింగ్ బూత్ వరకు తీసుకు రావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

అభివృద్ధి తమను గెలిపిస్తుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నాలుగేళ్లలో ఏం జరిగిందో ప్రజలు గమనిస్తున్నారని, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో ప్రజల్లో వ్యతిరేకత చోటు చేసుకోలేదని ఆయన అన్నారు. ఇతర రాజకీయ పార్టీలు ప్రభుత్వ వ్యతిరేక ఓటు మీద ఆధారపడతాయని, ఇప్పుడది లేదని ఆయన అన్నారు.

చిరంజీవి పాద యాత్ర?

హీరో చిరంజీవి తన పార్టీ విషయంలో అంతులేని మౌనం వహించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. కొంత మంది అయితే చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని, ఆయన మనస్తత్వానికి రాజకీయాలు సరిపడవని వాదిస్తున్నారు.


కానీ చిరంజీవి చుట్టూ ఉండే ఆ నలుగురు, ఆ నలుగురికి సన్నిహితులైన ఆ పదహారు మంది చెబుతున్న విషయం ప్రకారం చిరంజీవి మొదట పాదయాత్రను ఆయన పుట్టిన రోజైన ఆగస్టు 22 న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు నుంచి తిరుపతి వరకు సాగిస్తారని అత్యంత విశ్వసనీయంగా తెలిసింది.


చిరంజీవి తన పాదయాత్రలో భాగంగా ఎటువంటి రాజకీయ ప్రసంగాలు చేయరు. కేవలం ప్రజలకు అభివాదం చేస్తూ ఆయన యాత్ర సాగిపోతుంది. ప్రజల నుంచి వచ్చే వినతి పత్రాలను మాత్రం ఆయన స్వీకరిస్తారు. ఆయన మౌనపాద యాత్రను టీవీ చానళ్ళు పోటీ పడి ఉచితంగా ప్రసారం చేస్తాయి కాబట్టి ప్రచారం ఖర్చును బాగా తగ్గించుకోవచ్చని చిరంజీవి శిబిరం అంచనా.

తొలి పాద యాత్ర తర్వాత చిరంజీవి పూర్తి స్ధాయిలో జిల్లా పర్యటనలు ప్రారంభిస్తారని తెలుస్తోంది. చిరంజీవి జిల్లా పర్యటనల కోసం రెండు హెలికాప్టర్లు ఇప్పటికే సిద్ధమయ్యాయి. రోడ్ షో నిర్వహించడానికి అత్యాధునిక రెండు చైతన్య రథాలను ముంబైలో తయారు చేయిస్తున్నారు. అవినీతి రహిత సమాజం చిరంజీవి పార్టీకి ప్రధాన ఎజెండా కాబోతోంది.

Saturday, May 10, 2008

ఆత్మగౌరవానికి కాంగ్రెస్ ముప్పు : చంద్రబాబు విమర్శ

అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) డైరెక్టర్ పి. వేణుగోపాల్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు విమర్శించారు.కాంగ్రెస్ అధికారంలో ఉన్న ప్రతిసారీ ఇలాగే తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తున్నారని ఆయన అన్నారు. మీ కోసం యాత్రలో భాగంగా ఆయన శుక్రవారంనాడు కరీంనగర్ జిల్లాలోని కమలాపూర్ నియోజకవర్గంలో పర్యటించారు.

గతంలో ప్రస్తుత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి జరిపిన పాదయాత్రకు, తన యాత్రకు మధ్య తేడా ఉందని ఆయన చెప్పారు. తన యాత్ర దేశ ఆర్థిక పరిస్థితిని మార్చేందుకు సాగుతోందని ఆయన చెప్పారు. కాంగ్రెస్,తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) దొంగాట ఆడుతున్నాయని ఆయన విమర్శించారు. ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలను ఆయన పరామర్శించారు. అక్కడి నుంచే ఆయన ఒక ప్రైవేట్ టీవీ చానెల్ జూనియర్ ఎన్టీఆర్ తో నిర్వహించిన లైవ్ షోలో కూడా ఆయన మాట్లాడారు. రైతుల ప్రభుత్వమని చెప్పి కాంగ్రెస్ కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని ఆయన విమర్శించారు. తాము చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల ఇప్పుడు రాష్ట్రంలో ఆదాయం పెరిగిందని ఆయన అన్నారు.

Thursday, May 1, 2008

'సాక్షి'పై తెరాస పరువు నష్టం దావా!

తనకు పరువు నష్టం కలిగించేలా వార్తను ప్రచురించినందుకు "సాక్షి" దిన పత్రిక మీద 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేయనున్నట్టు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు చెప్పారు. తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బతీసేందుకు "సాక్షి" కుట్ర పన్నిందని ఆయన ఆరోపించారు.

చంద్రశేఖరరావుకు "సాక్షి" వార్తా కథనాలు కొంతకాలంగా ఇబ్బంది కలిగిస్తున్నాయి. కాంగ్రెస్, టిడిపిలు అగ్రవర్ణాల కను సన్నల్లో నడూస్తున్నాయని ఆయన ఆరో పించారు. తెలంగాణ్ ఉద్యమాన్ని ఎవరూ ఆపలేరని ఆయన చెప్పారు.

రెండో పెళ్లి కోసం భార్యను చంపిన టెక్కీ?

రెండో పెళ్లి కోసం భార్యను హత్యచేసిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. హేమలత అనే తన భార్యను చంపి నగేష్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీరు రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. హేమలత బాత్రూంలో శవమై తేలింది. హిందూపురం సమీపంలోని ముదిరెడ్డిపల్లిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. హేమలత తల్లిదండ్రుల నుంచి నగేష్ 15 లక్షల వరకట్నం, ఇతర కట్నకానుకలు తీసుకున్నాడు.

అందిన వివరాల ప్రకారం - పెళ్లి చేసుకున్న తర్వాత థాయ్ లాండ్ తీసికెళ్లాడు. తిరిగి తమ స్వగ్రామానికి వచ్చారు. నగేష్ ఎప్పుడూ తమ కూతురిని వేధించేవాడని హేమలత కుటుంబ సభ్యులు చెబుతున్నారు. నగేష్ కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నాడు. హేమలతది ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు నగేశ్ కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. హేమలత కుటుంబ సభ్యులు ముదిరెడ్డిపల్లికి వచ్చి నగేష్ ఇంటిలో విధ్వంసానికి దిగారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు.

అజీజ్ రెడ్డి మృతదేహానికి ఎక్స్ రే

అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ అనుచరుడు వెంకటరెడ్డి అలియాస్ అజీజ్ రెడ్డి మృతదేహానికి ఎక్స్ రే తీస్తున్నారు. ఇందు కోసం అతని మృతదేహాన్ని మార్చురీ నుంచి ఆస్పత్రికి తరలించారు. పోలీసులతో హైదరాబాదులోని జూబిలీహిల్స్ లో జరిగిన ఎదురు కాల్పుల్లో అజీజ్ రెడ్డి బుధవారం రాత్రి మరణించిన విషయం తెలిసిందే. అతని మృతదేహానికి గురువారం ఉదయం పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం అతని మృతదేహాన్ని ఆస్పత్రి మార్చురీకి తరలించారు.

సంఘటనా స్థలం నుంచి పోలీసులు అమెరికా తయారీ 9 ఎంఎం రైఫిల్ ను స్వాధీనం చేసుకున్నారు. మూడు సెల్ ఫోన్లు, డ్రైవింగ్ లైసెన్స్ కూడా పోలీసుల చేతికి చిక్కాయి. గతంలో జైలు నుంచి విడుదలైన అజీజ్ రెడ్డి ముంబయికి పారిపోయాడు. ఇటీవలే హైదరాబాద్ వచ్చాడు. ఎర్రబండ్లపల్లికి చెందిన అజీజ్ రెడ్డి హైదరాబాదు వచ్చి ముషీరాబాద్ దాదాగా అవతారమెత్తాడు. ఆ తర్వాత తీవ్రవాదులతో చేతులు కలిపాడు. అతినిపై హత్య కేసులు, భూ సెటిల్ మెంట్ కేసులు, తదితర కేసులు ఉన్నాయి. సినీ నిర్మాత నిఖిల్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు అజీజ్ రెడ్డి ఆచూకీ దొరికినట్లు భావిస్తున్నారు. తనకు కోటి రూపాయలు ఇవ్వాలని అజీజ్ రెడ్డి డిమాండ్ చేసినట్లు నిఖిల్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాదులోనే ఉన్న అజీజ్ రెడ్డిని తమ కొడుకుగా భావించడం లేదని అతని తల్లిదండ్రులు గతంలోనే చెప్పారు. బంధువులు వస్తే అజీజ్ రెడ్డి మృతదేహాన్ని అప్పగిస్తామని పోలీసులు చెబుతున్నారు.

పరుగు : సమీక్ష

నటీనటులు: అల్లు అర్జున్, షీలా, ప్రకాష్ రాజ్, పూనం బజ్వా, సునీల్,
సుబ్బరాజు, జయసుధ, శ్రీనివాసరెడ్డి, చిత్రం శ్రీను, జీవా తదితరులు
సంగీతం: మణి శర్మ
పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, చంద్రబోస్, అనంత శ్రీరామ్
సంభాషణలు: బివిఎస్ రవి
సినిమాటోగ్రఫి: విజయ్ చక్రవర్తి
కథ, స్కీన్ ప్లే, దర్శకత్వం: భాస్కర్
నిర్మాత: రాజు

పెద్దలకి తెలిస్తే ఒప్పుకోరని ప్రేమించిన అమ్మాయిని లేవదీసుకు పోయే కుర్రాళ్ళదా తప్పు లేక వారి ప్రేమను గుర్తించని తల్లితండ్రులదా తప్పు అనే సమకాలీన సామాజిక సమస్యను చర్చిస్తూ సాగిన చిత్రం పరుగు.పండుగ వాతావరణాన్ని సృష్టిస్తూ ఈ రోజు ఉదయం ఆటతో రాష్ట్రమంతటా 234 ప్రింట్లతో రిలీజయింది. దేశముదురు తర్వాత అల్లు అర్జున్ అంతకు మించి ఎనర్జీతో నటించిన ఈ సినిమా స్క్రిప్టు లోపాలతో సెకండాఫ్ సాగి పరుగు తగ్గింది. ఓ పల్లెటూరు పెద్దాయన(ప్రకాష్ రాజ్) పెద్దకూతురు (పూనం బజ్వా) పెళ్ళి జరుగుతూంటూంది. కాస్సేపటికి ఆమె తన ప్రియుడు(ఆ ఊరిలో పొలం పనులు చేసుకుని బ్రతికే కుటుంబంలోని కుర్రాడు) తో జంప్. దాంతో హర్ట్ అయిన ఆమె తండ్రి కూతురు కోసం వేట ప్రారంభిస్తాడు. ఆ కుర్రాడి ప్రెండ్స్ ని తీసుకొచ్చి హౌస్ అరెస్టు చేస్తాడు. వాళ్ళలో కృష్ణ (అల్లు అర్జున్) అనే హుషారైన హైదరాబాద్ కుర్రాడుంటాడు. అతను ఈ హడావిడిలో పెద్దాయన మరో కూతురు మీనా(షీలా) తో ప్రేమలో పడతాడు. ఆమెని లేపుకు పోదామనుకుంటాడు. దానికి ఆ అమ్మాయి ఒప్పుకుందా? అసలే కోపంలో ఉన్న పెద్దాయన ఈ సారేం చేస్తాడు? అన్నది తెరపై చూడాల్సిందే. పాయింట్ ఈ మధ్య వచ్చిన 'జల్సా' ని గుర్తు చేస్తే కథనం 'ప్రేమిస్తే' ని ఫాలో అవుతుంది. నిజానికి 'పరుగు' కథ పాయింట్ చాలా బాగున్నా ట్రీట్ మెంట్ లోపంతో కుదేలయింది. పిల్లలు లేచిపోతే బాధ పడే పెద్దలు కథో లేక ప్రేమించినవాళ్ళని పెద్దవాళ్ళు అర్థం చేసుకోవాలి అనే కధో స్పష్టం కాకుండా కధనం నడుస్తుంది. బొమ్మరిల్లు లో మొదటి సీనులోనే సమస్య చూపి కథ లోకి వచ్చిన భాస్కర్ దీనిలో హీరోని ప్రి క్లైమాక్స్ దాకా సమస్య లోకి పడెయ్యడు. అదే ప్రధాన లోపం . అంతేగాక ప్రకాష్ రాజ్ పాత్ర సమస్య తరువాత సమస్యలో పడుతూ (పెద్ద కూతురు ఒకరితో వెళ్ళి పోయిందని తెరుకునే లోపే రెండో కూతురు అదే దారిలో నడవబోతోందని తెలియటం) సానుభూతి సంపాదించుకుంటూ హీరోని దాటి ఎదిగిపోయింది. అల్లు అర్జున్ పాత్ర ఎంతసేపు తన ప్రకాష్ రాజ్ కూతురుని తీసుకుని వెళ్ళి పోయిన స్నేహితుడుకి సాయం చేస్తూ నెగిటివ్ ఇంప్రెషన్ పొందుతాడు. అలాగే ఇంట్రవెల్ దగ్గరకు వచ్చేసరికి హీరోకి సమస్యలో పడబోతున్నానని అర్ధమవుతుంది గాని సమస్యలో భౌతికంగా పడడు. దాంతో సమస్యలో పడని హీరోని ఫాలో చేస్తున్న ప్రేక్షకులకు అసహనం కలుగుతుంది. ఇక హీరోయిన్ పాత్రలో సృష్టత కనపడదు. అక్క ప్రేమను సపోర్టు చేసిన ఆమె ఎప్పుడు డైలమాలో ఉన్నట్లు మాట్లాడుతుంది. రవి డైలాగులు కొన్నిచోట్లే పేలాయి. పల్లె లో చూపిన అపానవాయువు, మూత్ర విసర్జన సీన్లు చూడటానికి అసహ్యంగా ఉన్నాయి. పాటల ప్లేస్ మెంట్లు కరెక్టుగా పడలేదు. అలాగే కథకు సంభంధం లేని ఫైట్ సీను అనవసరమనిపిస్తుంది. అలాగే జయసుధ పాత్ర హీరోతో "ఆ అమ్మాయే నా కోడలు, తీసుకురా!" అని చెప్పటం తేజ సినిమాల పార్మెట్ ని అనుసరించి నవ్వులపాలైంది. ఇలా ఇన్ని స్కీన్ ప్లే లోపాలున్నా ఫస్టాఫ్ లో ఒకే ఇంటిలో సీన్లు ఫన్నీగా నడపటం భాస్కర్ కే సాధ్యం అనిపించాడు. అలాగే మణిరత్నం 'దిల్ సే' ని గుర్తు చేస్తూ హీరో లవ్ ఎట్ పస్ట్ సైట్ సీన్ పొగ మంచులో చూపటం చాలా బాగుంది. అలీ కామిడి ద్వారా సినిమా కాన్సెప్ట్ మొత్తం వివరించటం స్కిప్టు పరంగా మరో గ్రేట్.సెకాండాఫ్ లో వచ్చే ప్రకాష్ రాజ్ తాగి అల్లు అర్జున్ తో తన బాధ చెప్పుకోవటం సన్నివేశం తెలుగు సినిమాల్లో అరుదుగా మంచి ఎమోషనల్ సీను. "నమ్మవేమో, హృదయం "అంటూ సాగే పాటలు బాగున్నాయి. రీరికార్డింగ్ ఎప్పటి మణిశర్మ సినిమాల లాగే బాగుంది. ముఖ్యంగా కెమెరా కొన్ని సీన్లలో(పొగ మంచు వాతావరణం) అద్భుతాలు చూపించింది.దర్శకత్వం అద్భుతం కాకపోయినా చాలా మంది కన్నా మేలనిపిస్తుంది. యేదైమైన దాదాపు మూడు గంటలు నిడివి ఉన్న ఈ సినిమా అరగంట వరకు ట్రిమ్ చేయవచ్చు.పాటలకోసం,అల్లు అర్జున్ డాన్స్ ల కోసం ఈ సినిమా చూడచ్చు. ఫ్యామిలీలకు పడితే నిలబడుతుంది. యూత్ ని ఆకట్టుకోవటం కష్టమే.

తెరాసతో మాట్లాడేది లేదు : తేల్చిచెప్పిన డి.ఎస్.

హైదరాబాదులోని ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గం ఏకగ్రీవ ఎన్నిక కోసం తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుతో ఇక మాట్లాడేది లేదని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఖైరతాబాద్ ఉప ఎన్నిక విషయంలో చంద్రశేఖరరావు మాట తప్పారని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కెసిఆర్ తో రాయబారాలు నడిపేది లేదని ఆయన అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 14వ తేదీన పునరంకిత సభ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించేందుకు ఈ సభను నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ, ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి, మంత్రులు ఆ సభలో పాల్గొంటారని ఆయన చెప్పారు. ఉప ఎన్నికల కోసం ఆయన పార్టీ కార్యాలయం గాంధీభవన్ లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి మొదటి ఫోన్ కరీంనగర్ లోకసభ పార్టీ అభ్యర్థి టి. జీవన్ రెడ్డికి చేశారు.

విరామం వీడి...!

సాంకేతిక కారణాలరీత్యా ఏప్రిల్ 8 నుంచి బ్లాగ్ అప్డేట్లో ఏర్పడిన అంతరాయానికి విరామం చెబుతూ నేటి నుంచి మళ్లీ మీ ఆదరణకు వేచిచూస్తూ...
మీ బ్లాగ్.