విష్ణు సహస్ర నామ స్తోత్రము మహాభారతం లోని అనుశాసనిక పర్వం లో 149వ అధ్యాయంలో ఉన్నది. కురుక్షేత్ర యుద్ధానంతరం అంపశయ్య మీద పండుకొని ఉన్న భీష్ముడు ఈ స్తోత్రాన్ని యుధిష్ఠురు నకు ఉపదేశిస్తాడు. ఈ స్తోత్ర పారాయణం సకల వాంఛితార్థ ఫలదాయకమని ఆ విధమైన విశ్వాసం ఉన్నవారి నమ్మకం. స్తోత్రం ఉత్తర పీఠిక (ఫలశ్రుతి)లో ఈ శ్లోకం "ధర్మార్థులకు ధర్మము, అర్థార్థులకు అర్థము, కామార్థులకు కామము, ప్రజార్థులకు ప్రజను ప్రసాదించును" అని చెప్పబడినది.
స్తోత్ర ఆవిర్భావము
విష్ణు సహస్రనామ స్తోత్రము ఆవిర్భవించిన పరిస్థితులు ఆసక్తి కరమైనవి. కురుక్షేత్ర యుద్ధంలో జరిగిన జనక్షయం, కష్టాలవలన పాండవాగ్రజుడు యుధిష్ఠిరుడు కృంగిపోయి ఉన్నాడు. తన వంశోన్నతిని కోరిన భీష్ముడు అంపశయ్యపై మరణానికి సిద్ధంగా ఉన్నాడు. అనితర జ్ఞాననిలయమైన భీష్ముని ఆశ్రయించి ధర్మాన్ని, నీతిని తెలిసికొనమని యుధిష్ఠిరుని వేదవ్యాసుడు, శ్రీకృష్ణుడు ఆదేశించారు. భీష్ముడు కృష్ణునితో "ప్రభూ! జగద్గురువువైన నీయెదుట నేను ఉపదేశము చేయజాలినవాడను కాను. ఆపై క్షతగాత్రుడనైన నా బుద్ధి, శక్తి క్షీణించినవి. క్షమింపుడు" అనెను. అప్పుడు శ్రీకృష్ణుడు "భీష్మా! నా ప్రభావము చేత నీ క్లేశములన్నీ ఇపుడే తొలగిపోవును. సమస్త జ్ఞానము నీ బుద్ధికి స్ఫురించును. నీచేత నేను ధర్మోపదేశము చేయించుచున్నాను" అని అనుగ్రహించెను. అలా భీష్ముడు అంపశయ్యపైనుండే యుధిష్ఠిరునకు సమస్త జ్ఞాన, ధర్మములను ఉపదేశించెను.
అలా జ్ఞానబోధను గ్రహించే సమయంలో యుధిష్ఠిరుడు ఆరు ప్రశ్నలను అడిగాడు. ఆ ప్రశ్నల సారాంశము: "దుఃఖముతో కృంగి ఉన్న నాకు తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితమును ఇచ్చే ఉపాయమేది? ఎవరిని స్తుతించాలి?" దానికి భీష్ముడు చెప్పిన ఉపాయము: "భక్తితో, శ్రద్ధతో విష్ణువు వేయి నామాలను జపించు. అన్ని దుఃఖములు, కష్టములు, పాపములనుండి విముక్తి పొందడానికి ఇదే సులభమైన మార్గము". అలా భీష్ముడు ఉపదేశించినదే విష్ణు సహస్రనామ స్తోత్రము.
స్తోత్రవిభాగము
విష్ణు సహస్రనామ స్తోత్రపఠనానికి ముందుగా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రాన్ని పఠించడం చాలామంది పాటించే ఆనవాయితీ. చాలా స్తోత్రాలలో లాగానే విష్ణు సహస్రనామ స్తోత్రంలో వివిధ విభాగాలున్నాయి.
పూర్వ పీఠిక
ప్రార్థన
ప్రార్ధన శ్లోకములు, స్తోత్రము ఆవిర్భవించిన సందర్భ వివరణ ఈ పూర్వపీఠికలో ఉన్నాయి. ముందుగా వినాయకు నకు, విష్వక్సేను నకు, వ్యాసు నకు, ఆపై విష్ణువుకు ప్రణామములతో స్తోత్రము ఆరంభమౌతుంది.
స్తోత్ర కథ
అనేక పవిత్ర ధర్మములను విన్న తరువాత ధర్మరాజు భీష్ముని అడిగిన ఆరు ప్రశ్నలు:
- కిమ్ ఏకమ్ దైవతం లోకే - లోకంలో ఒక్కడే అయిన దేవుడు (పరమాత్ముడు) ఎవరు?
- కిమ్ వాపి ఏకమ్ పరాయణమ్ - జీవితానికి పరమపదమైన గమ్యము ఏది?
- స్తువంతః కమ్ ప్రాప్నుయుః మానవాః శుభమ్ - ఏ దేవుని స్తుతించుట వలన మానవులకు శుభములు లభించును?
- కమ్ అర్చంతః ప్రాప్నుయుః మానవాః శుభమ్ - ఏ దేవుని అర్చించుట వలన మానవునకు శుభములు లభించును?
- కో ధర్మః సర్వధర్మాణాం భవతః పరమో మతః - మీ అభిప్రాయము ప్రకారము సర్వధర్మములకు ఉత్కృష్టమైన ధర్మమేది?
- కిం జపన్ ముచ్యతే జంతుః జన్మ సంసార బంధనాత్ - ఏ దేవుని జపించుటవలన జన్మ సంసార బంధనములనుండి ముక్తి లభించును?
అందుకు భీష్ముడు చెప్పిన సమాధానం: జగత్ప్రభువును, దేవదేవుని, అనంతుని, పురుషోత్తముని వేయి నామములను నిశ్చలమైన భక్తితో స్తుతిసేయట వలనను, ఆరాధించుట వలనను, ధ్యానించుట వలనను, ప్రణామము చేయుట వలనను సర్వదుఃఖములనుండి విముక్తి పొందవచ్చును. ఆ బ్రహ్మణ్యుని, పుండరీకాక్షుని ఆరాధించుట ఉత్తమ ధర్మము. ఆ దేవదేవుడు పరమ మంగళ ప్రదుడు. సకల సృష్టి స్థితి లయ కారకుడు. ఈ వేయి గుణ కీర్తనకరములైన నామములను ఋషులు గానము చేసినారు.
సంకల్పము
తరువాత స్తోత్రములో సంకల్పము (ఎవరిని, ఎందుకు స్తుతిస్తున్నాము) చెప్పబడుతుంది. ఈ స్తోత్రమునకు
- ఋషి - వేదవ్యాసుడు
- ఛందస్సు - "అనుష్టుప్"
- మంత్రాధిష్టాన దైవము - శ్రీమన్నారాయణుడు
- బీజము - అమృతాం శూద్భవః భానుః
- శక్తి - దేవకీ నందనః స్రష్టా
- మంత్రము - ఉద్భవః క్షోభణః దేవః
- కీలకము - శంఖభృత్ నందకీ చక్రీ
- అస్త్రము - శార్ఙ్గధన్వా గదాధరః
- నేత్రము -రథాంగపాణి రక్షోభ్యః
- కవచము -త్రిసామా సామగః సామః
- యోని - ఆనందం పరబ్రహ్మ
- దిగ్బంధము - ఋతుః సుదర్శనః కాలః
- ధ్యానము చేయు దేవుడు - విశ్వరూపమని భావించే విష్ణువు
- చేసే పని - సహస్రనామ జపము
- కారణము - శ్రీమహావిష్ణువు ప్రీతి కొరకు
ధ్యానము
తరువాత పాలకడలిలో శంఖ చక్ర గదా పద్మములు ధరించిన వాడు, భూమియే పాదములుగా గలవాడు, సూర్యచంద్రములు నేత్రములైనవాడు, దిక్కులే చెవులైనవాడు, త్రిభువనములు శరీరముగా గలవాడు, శేషశాయి, విశ్వరూపుడు, శ్రీవత్సాంక కౌస్తుభ పీతాంబరధారి, నీలమేఘ వర్ణుడు అయిన రుక్మిణీ సత్యభామా సమేతుడు, ముకుందుడు, పరమాత్ముడు అయిన దేవునకు ధ్యానము చెప్పబడుతుంది.
"హరిః ఓం" అంటూ వేయి నామాల జపం మొదలవుతుంది.
వేయి నామములు
విశ్వం అనే నామంతో మొదలైన సహస్ర నామ జపం సర్వ ప్రహరణాయుధ అనే వెయ్యవ నామంతో ముగుస్తుంది. ఈ ప్రధాన స్తోత్ర భాగంలో 107 శ్లోకాలలో వేయి నామములు పొందుపరచబడి ఉన్నాయి. పరమాత్ముని వివిధ లక్షణ గుణ స్వభావ రూపములు వివిధనామములలో కీర్తించబడ్డాయి. అనంత గుణ సంపన్నుడైన భగవానుని వేయి ముఖ్యగుణములను కీర్తించే పుణ్యశబ్దాలుగా ఈ వేయి నామాలను సాంప్రదాయికులు విశ్వసిస్తారు.విష్ణు సహస్రనామాలను గురించి పెక్కుభాష్యాలు వెలువడినాయి. 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్యులు రచించిన భాష్యము వీటిలో ప్రథమము. అద్వైత సిద్ధాంతము ననుసరించే ఈ భాష్యంలో భగవంతుని పరబ్రహ్మ తత్వమునకు, షడ్గుణైశ్వర్యమునకు ఎక్కువ ప్రాదాన్యతనిచ్చి వ్యాఖ్యానించారు. 12వ శతాబ్దంలో పరాశర భట్టు రచించిన భాష్యము విశిష్టాద్వైతం సిద్ధాంతాలకు అనుగుణంగా సాగుతూ, భక్తుల పట్ల భగవానుని సౌలభ్యాన్నీ, సౌశీల్యాన్నీ, కరుణనూ మరింతగా విపులీకరించినది. తరువాత అనేకులు రచించిన వ్యాఖ్యలకు ఈ రెండు భాష్యాలే మార్గదర్శకాలు.
వివిధ భాష్యకర్తలు వ్యాఖ్యానించిన నామముల జాబితా పరిశీలించినట్లయితే వారు పేర్కొన్న నామములలో స్వల్ప భేదాలు కనిపిస్తాయి. ఉదాహరణకు శంకరాచార్యులు "స్థవిరోధ్రువః" అని ఒకే నామమును పరిగణించగా, పరాశరభట్టు "స్థవిరః", "ధ్రువః" అనే రెండు నామములుగా పరిగణించెను. పరాశరభట్టు "విధేయాత్మా" అని తీసుకొనగా శంకరాచార్యులు "అవిధేయాత్మా" అని తీసుకొనెను. కాని ఇటువంటి భేదాలు చాలా కొద్ది.
ఇంకా కొన్ని నామములు పునరావృతమైనట్లుగా ఉంటాయి. ఉదాహరణకు విష్ణుః (మూడు సార్లు); శ్రీమాన్, ప్రాణదః (ఒక్కొక్కటి నాలుగు సార్లు); కేశవః, పద్మనాభః, వసుః, సత్యః, వాసుదేవః, వీరః, ప్రాణః, వీరహా, అజః, మాధవః (ఒక్కొక్కటి మూడు సార్లు); పురుషః, ఈశ్వరః, అచ్యుతః, అనిరుద్ధః, అనిలః, శ్రీనివాసః, యజ్ఞః, మహీధరః, కృష్ణః, అనంతః, అక్షోభ్యః, వసుప్రదః, చక్రీ (ఒక్కొక్కటి రెండేసి సార్లు) - ఇలా చెప్పబడ్డాయి. మొత్తం 90 నామాలు ఒకటికంటె ఎక్కువసార్లు వస్తాయి. కాని భాష్యకారులు ఒకే నామానికి వివిధ సందర్భాలలో వివిధ అర్ధాలు వివరించి, పునరుక్తి దోషం లేదని నిరూపించారు.
ఇంకా భగవద్గీతకు, విష్ణు సహస్రనామ స్తోత్రానికి అవినాభావ సంబంధము ఉన్నది. (రెండూ మహాభారతం లోనివే). ప్రత్యేకించి గీతలోని 10వ అధ్యాయము (విభూతి యోగము)లో భగవంతుని వర్ణించే విభూతులు అన్నీ విష్ణు సహస్ర నామంలో వస్తాయి. (ఉదాహరణ - ఆదిత్యః, విష్ణుః, రవిః, మరీచిః, వేదః, సిద్ధః, కపిలః, యమః, కాలః, అనంతః, రామః, ఋతుః, స్మృతిః, మేధా, క్షమః, వ్యవసాయః, వాసుదేవః, వ్యాసః). 11 వ అధ్యాయము (విశ్వరూప సందర్శన యోగము)లలో భగవంతుని వర్ణించే పదాలు అన్నీ విష్ణు సహస్ర నామంలో దాదాపుగా వస్తాయి. (ఉదాహరణ: తత్పరః, అవ్యయః, పురుషః, ధర్మః, సనాతనః, హృషీకేశః, కృష్ణః, సనాతనః, చతుర్భుజః, విశ్వమూర్తిః, అప్రమేయః, ఆదిదేవః). ఇంకా గీత 2వ అధ్యాయములోని స్థితప్రజ్ఞ లక్షణాలు, 12వ అధ్యాయములోని భక్త లక్షణాలు, 13వ అధ్యాయములోని భగవద్గుణములు, 14వ అధ్యాయములోని త్రిగుణాతీతుని లక్షణాలు, 16వ అధ్యాయములోని దేవతాగణగుణాలు అన్నీ వేర్వేరు నామాలుగా సహస్రనామ స్తోత్రంలో చెప్పబడ్డాయి.
శంకరాచార్యులు "గేయం - గీతా - నామ సహస్రం" అని రెండు పవిత్ర గ్రంధాలకూ ఎంతో ప్రాముఖ్యతను తెలియజెప్పారు.
ఉత్తర పీఠిక
ఫలశ్రుతి
ఈ స్తోత్రం వలన కలిగే ప్రయోజనాలు ఫలశ్రుతిలో చెప్పబడ్డాయి. క్లుప్తంగా ఇదీ ఫలశ్రుతి:
ఈ దివ్య కేశవ కీర్తనను వినేవారికి, చదివే వారికి ఏవిధమైన అశుభములు కలుగవు. బ్రాహ్మణులకు వేదవిద్య, గోవులు లభించును. క్షత్రియులకు విజయము, వైశ్యులకు ధనము, శూద్రులకు సుఖము లభించును. ధర్మము కోరువారికి ధర్మము, ధనము కోరువారికి ధనము అబ్బును. కోరికలీడేరును. రాజ్యము లభించును. భక్తితో వాసుదేవుని నామములను శుచిగా కీర్తించేవారికి కీర్తి, శ్రేయస్సు, ప్రాధాన్యత లభించును. వారి రోగములు హరించును. వారికి బలము, తేజము వర్ధిల్లును.
పురుషోత్తముని స్తుతి చేసేవారిలో వ్యాధిగ్రస్తులు ఆరోగ్యవంతులవుతారు. బంధితులకు స్వేచ్ఛ లభించును. భయమునుండి విముక్తి కలుగును. ఆపదలు తొలగిపోవును. అట్టి భక్తుల కష్టములు కడతేరును. వాసుదేవుని భక్తులకు పాపములు తొలగును. వారికి అశుభములు, జన్మ మృత్యు జరా వ్యాధి భయములు ఉండవు. సుఖము, శాంతి, సిరి, ధైర్యము, కీర్తి, సస్మృతి లభించును. పుణ్యాత్ములగుదురు.
సకల చరాచర జీవములు, గ్రహ నక్షత్రాదులు, దేవతలు వాసుదేవుని ఆజ్ఞానుబద్ధులు. జనార్దనుడే సకల వేద జ్ఞాన విద్యా స్వరూపుడు. ముల్లోకాలలో వ్యాపించిన విష్ణువు ఒకడే. వ్యాసునిచే కీర్తింపబడిన ఈ స్తవమును పఠించిన, విన్న యెడల శ్రేయస్సు, సుఖము లభించును. అవ్యయుడైన విశ్వేశ్వరుని భజించినవారికి పరాభవమెన్నడును జరుగదు.
ఈ స్తోత్రంతో కలిపి చదివే ఈ స్పష్టమైన ఫలశ్రుతి మహాభారత పాఠంలో అంతర్గత విభాగం. దీనికి జనాదరణ కలిగించడానికి ఎవరో తరువాత అతికించినది కాదు. భాష్యకారులు తమ వ్యాఖ్యలలో ఫలశ్రుతిని కూడా వివరించారు.
ఉపదేశాలు
- అర్జునుడు "పద్మనాభా! జనార్దనా! అనురక్తులైన భక్తులను కాపాడు" అని కోరగా కృష్ణుని సమాధానం - "నా వేయి నామములు స్తుతించగోరే వారు ఒకే ఒక నామము స్తుతించినా గాని నన్ను పొందగలరు"
- వ్యాసుడు చెప్పినది - "ముల్లోకములు వాసుదేవుని వలన నిలచియున్నాయి. అన్ని భూతములలోను వాసుదేవుడు అంతర్యామి. వాసుదేవునకు నమోస్తుతులు"
- పార్వతి కోరినది - "ప్రభో! ఈశ్వరా! విష్ణు సహస్ర నామమును పండితులు నిత్యం క్లుప్తంగా ఎలా పఠిస్తారు? సెలవీయండి" అందుకు ఈశ్వరుడు ఇలా చెప్పాడు - "శ్రీరామ రామ రామ యని రామనామమును ధ్యానించనగును. రామ నామము వేయి నామములకు సమానము"
- శ్రీరామ రామ రామేతి రమేరామే మనోరమే
- సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే
- బ్రహ్మ చెప్పినది - "అనంతుడు, వేలాది రూపములు, పాదములు, కనులు, శిరస్సులు, భుజములు, నామములు గల పురుషునకు నమోస్తు. సహస్రకోటి యుగాలు ధరించిన వానికి నమస్కారములు"
- సంజయుడు చెప్పినది - "యోగీశ్వరుడైన కృష్ణుడు, ధనుర్ధారి అయిన అర్జునుడు ఉన్నచోట ఐశ్వర్యము, విజయము నిశ్చయంగా ఉంటాయి."
- శ్రీ భగవానుడు చెప్పినది - "ఇతర చింతనలు లేక నన్నే నమ్మి ఉపాసన చేసేవారి యోగక్షేమాలు నేనే వహిస్తాను. ప్రతియుగం లోను దుష్ట శిక్షణకు, సాధురక్షణకు నేను అవతరిస్తాను"
- నారాయణ నామ స్మరణ ప్రభావము - "దుఃఖితులైనవారు, భయగ్రస్తులు, వ్యాధిపీడితులు కేవలము నారాయణ శబ్దమును సంకీర్తించినయెడల దుఃఖమునుండి విముక్తులై సుఖమును పొందుతారు."
సమర్పణ
శరీరముచేత గాని, వాక్కుచేత గాని, ఇంద్రియాలచేత గాని, బుద్ధిచేత గాని, స్వభావంచేత గాని చేసే కర్మలనన్నింటినీ శ్రీమన్నారాయణునకే సమర్పిస్తున్నాను. భగవంతుడా! నా స్తోత్రంలోని అక్షర, పద, మాత్రా లోపములను క్షమించు. నారాయణా! నీకు నమస్కారము.
అన్న ప్రణతులతో ఈ పుణ్యశ్లోకము ముగుస్తుంది.
సాంప్రదాయాలు, వ్యాఖ్యలు
హిందూమత సాంప్రదాయంలో శివుడు, శక్తి, వినాయకుడు, లక్ష్మి - ఇలా చాలా దేవతల సహస్రనామ స్తోత్రాలు ఉన్నాయి. ఎవరి సాంప్రదాయాలను బట్టి వారు ఆయా దేవతలను అర్చిస్తారు. కాని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము, శ్రీ లలితా సహస్రనామ స్తోత్రము బాగా ప్రాచుర్యాన్ని పొందిన స్తుతులు.
విష్ణు సహస్రనామము పారాయణ విస్తృతంగా చేయడానికి కొన్ని కారణాలు -
- ఈ పారాయణకు కుల, మత పట్టింపులు లేవు. (బ్రాహ్మణులకు, వైశ్యులకు, క్షత్రియులకు, శూద్రులకు వచ్చే ప్రయోజనాలు ఫలశృతిలో స్పష్టంగా ఉన్నాయి)
- పారాయణకు పెద్దగా శక్తి సామర్థ్యాలు, ఖర్చు అవసరం లేదు. శ్రద్ధ ఉంటే చాలును.
- ఫలశృతిలో చెప్పిన విషయాలు విశ్వాసాన్ని పెంచుతున్నాయి.
- పేరుమోసిన పండితులు ఈ స్తోత్రానికి వ్యాఖ్యలు రచించి, ప్రజల విశ్వాసాన్ని ఇనుమడింపజేశారు.
- విష్ణు సహస్ర నామ స్తోత్ర పారాయణం గృహస్తులకు అనుకూలమైన పూజా విధానం.
స్మార్తుల వ్యాఖ్యలు
శైవుల శ్రీరుద్రం ప్రార్థనలో విష్ణువు శివుని స్వరూపమని చెప్పబడింది. విష్ణు సహస్రనామ స్తోత్రంలో కొన్ని నామాలు (114-రుద్రః, 27-శివః, 600-శివః) శివుని స్తుతించేవిగా ఉన్నాయి. శివకేశవులకు భేదము లేదని శంకరాచార్యులు వ్యాఖ్యానించారు. ఇంకా శివుడనగా మంగళకరుడనీ, అదే నామము విష్ణువుకూ వర్తిస్తుందనీ మరికొన్ని వ్యాఖ్యలు. ముఖ్యంగా అద్వైత వాదం నిర్గుణ నిరాకార శుద్ధ సత్వ పరబ్రహ్మమును గురించి చెబుతుంది గనుక శంకరాచార్యుల భాష్యము ఆ కోణంలోనే ఉంది.
వైష్ణవ వ్యాఖ్యలు
పరాశర భట్టు, ఇతర వ్యాఖ్యాన కర్తలు శివునితో ప్రమేయము లేకుండా విష్ణువు పరంగానే అన్ని నామాలనూ వ్యాఖ్యానించారు. శ్రీ వైష్ణవులకు, అనగా రామానుజాచార్యులు విశిష్టాద్వైతమును అనుసరించే వారికి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము పరమ పావన స్తోత్రాలలో ఒకటి. శ్రీలక్ష్మీవల్లభుని కరుణ ప్రాప్తికి సులభమార్గము ఈ స్తోత్రము. ఇంకా శ్రీవైష్ణవులు పంచాయుధములు ధరించిన, వైకుంఠనివాసుడైన, శ్రీదేవీ భూదేవీ సమేతుడైన నారాయణుని రూపమునకు (సాకార భగవంతునకు) తమ అర్చనా సాంప్రదాయములలో విశేష ప్రాముఖ్యతనిస్తారు. వారి వ్యాఖ్యలు కుడా ఈ దృక్కోణంలోనే ఉన్నాయి.
పారాయణము, అర్చన
అన్ని శ్లోకాలను (పూర్వపీఠిక, స్తోత్రము, ఉత్తరపీఠిక) క్రమంలో చదవడాన్ని పారాయణం అంటారు. పెద్దగా ఈ పారాయణానికి ప్రత్యేకించి విధివిధానాలు లేవు. అంగన్యాస, కరన్యాసాలు పారాయణానికి ముందు చేయడం ఒక ఆచారం. చాలామంది విష్ణు సహస్ర నామ పారాయణానికి ముందుగాని, తరువాతగాని లక్ష్మ్యష్టోత్తర నామాన్ని పారాయణం చేస్తారు. భక్తి ముఖ్యమనీ, సామాన్యమైన పూజకు పాటించే నియమాలు పాటించడం భావ్యమనీ చెబుతారు.
ఇక వేయి నామాలనూ ఒక్కొక్కటిగా నమస్కారపూర్వకంగా చెప్పుతూ, పుష్పాదికాలతో పూజించడానిని అర్చన అంటారు. ప్రతి నామానికి ముందు ప్రణవం (ఓం), చివర చతుర్ధీ విభక్తితో "నమః" చేర్చి అర్చనలో చెబుతారు. ఉదాహరణకు పారాయణ శ్లోకం
- రామో విరామో వరతో మార్గో నేయో నయో నయః
- వీరః శక్తిమతాం శ్రేష్టో ధర్మో ధర్మవిదుత్తమః
అర్చనలో చదివేది
- ఓం రామాయ నమః
- ఓం విరామాయ నమః
- ఓం విరతాయ నమః
- ఓం మార్గాయ నమః
- ఓం నేయాయ నమః
- ఓం అనయాయ నమః
- ఓం వీరాయ నమః
- ఓం శక్తిమతాం శ్రేష్ఠాయ నమః
- ఓం ధర్మాయ నమః
- ఓం ధర్మవిదుత్తమాయ నమః
మహాత్ముల, పండితుల అభిప్రాయాలు
శ్రీవైష్ణవ సాహిత్యం గురించి విస్తారంగా అధ్యయనం చేసిన ఎన్.కృష్ణమాచారి తమ విష్ణు సహస్రనామ స్తోత్ర వివరణ ఆరంభంలో ఈ స్తోత్రం ప్రాముఖ్యత గురించి ఆరు విషయాలు చెప్పాడు:
- ఇది మహాభారత సారము.
- నారదాది మహాభాగవతులు, ఆళ్వారులు, త్యాగరాజాది వాగ్గేయకారులు తమ భక్తికావ్యాలలో మరల మరల విష్ణువు వేయి నామాలను ప్రస్తావించారు.
- విష్ణువు అంశావతారము, వేదవిదుడు అని చెప్పబడే వేదవ్యాసుడు దీనిని మనకు అందించాడు.
- ఇది ధర్మములలోకెల్ల ఉత్తమము, సులభము, సకల కర్మబంధ విముక్తి సాధకము అని భీష్ముడు చెప్పాడు.
- ఈ స్తోత్రపారాయణం దుఃఖములనుహరిస్తుందనీ, శాంతి సంపదలను కలుగజేస్తుందనీ విస్తృతమైన విశ్వాసం.
- భగవద్గీత, నారాయణీయము వంటి గ్రంథాలలో చెప్పిన విషయాలు ఇందుకు అనుగుణంగా ఉన్నాయి.
ఆది శంకరులు ఇది గానము చేయవలసిన స్తోత్రమని భజగోవిందం స్తోత్రంలో చెప్పాడు.
ఆన్ని పాపాలనూ హరించే అసమాన ప్రార్థన అని పరాశర భట్టు చెప్పాడు.
ఇది మహాభారత సారమనీ, ఒకోనామానికి నూరు అర్థాలున్నాయనీ మధ్వాచార్యుడు అన్నాడు.
భాగవతం దశమ స్కందము, విష్ణు సహస్రనామము పుణ్య క్షేత్రాలలో పఠించవలసిన, వినవలసిన గ్రంథాలని స్వామి నారాయణ్ తమ శిక్షాపత్రి లో అన్నారు.
షిరిడి సాయిబాబా అన్న మాటలు మరింత ఆసక్తికరమైనవి. "బాబా తమ గద్దె దిగి రామదాసి పారాయణ చేయు స్థలమునకు వచ్చి విష్ణు సహస్రనామము పుస్తకమును తీసికొనెను. తమ స్థలమునకు తిరిగి వచ్చి ఇట్లనెను - శ్యామా! ఈ గ్రంథము మిగుల విలువైనది. ఫలప్రదమైనది. కనుక నీకిది బహూకరించుచున్నాను. నీవు దీనిని చదువుము. ఒకప్పుడు నేను మిగుల బాధపడితిని. నా హృదయము కొట్టుకొనెను. నా జీవితమపాయములోనుండెను. అట్టి సందిగ్ధ స్థితియందు నేను ఈ పుస్తకమును నా హృదయమునకు హత్తుకొంటిని. శ్యామా! అది నాకు గొప్ప మేలు చేసెను. అల్లాయే స్వయముగా వచ్చి బాగుచేసెనని యనుకొంటిని.
No comments:
Post a Comment