


విజయవాడ, గుంటూరు నగరాల్లో రాజకీయ నాయకులు "జల్సా" సినిమాను తమ ఓటర్లకు చూపించేందుకు థియేటర్లను బుక చేసుకున్నట్టు తెలుస్తోంది. చిరంజీవి కుటుంబ అభిమానులనే కాకుండా కాపు వర్గానికి చెందిన యువతను ఆకర్షించేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు పోటీ పడ్డారు. చిరంజీవి రాజకీయాల్లోకి రావడం ఖాయం కాబట్టి వచ్చే ఎన్నికల్లో గెలుస్తామా లేదా అన్న అనుమానం పట్టుకున్న కాంగ్రెస్ , టిడిపి ప్రజా ప్రతినిధులు "జల్సా" సినిమా మీద మహా జల్సాగా ఖర్చు చేస్తున్నారు. చిరంజీవి పార్టీ పెట్టినా ఆ వర్గానికి చెందిన యువత తమ పక్షం వైపే ఉంటారన్న అభిప్రాయం కలిగించడానికి "ఉచిత జల్సా" స్కీం ను వీరు ప్రవేశపెట్టినట్టు తెలుస్తోంది.
కాపు వర్గం తమ వెంటే ఉందన్న బల ప్రదర్శన చేయడానికి కన్నా లక్ష్మీ నారాయణ వంటి కాపు నాయకులే కాకుండా కొందరు కమ్మ రాజకీయ నాయకులు కూడా ప్రయత్నించడం గమనార్హం. ఇక చిరంజీవి పార్టీ టికెట్ పొందాలనుకుంటున్న నాయకులైతే సూక్ష్మంలో మోక్షం అన్న రీతిలో థియేటర్లను అద్దెకు తీసుకుని "జల్సా" సినిమాను ప్రదర్శిస్తున్నారు. హైదరాబాద్ వంటి నగరాల్లో వెయ్యి రూపాయలు, పట్టణాల్లో 500 రూపాయలకు 'జల్సా" టికెట్లను బ్లాక్ లో అమ్ముతున్నారు. ఉచితంగా "జల్సా" టికెట్లు లభించడంతో పవన్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతోంది.
విజయవాడలో కాపు వర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ అన్నపూర్ణ, లీలామహల్ థియేటర్లను, కమ్మ వర్గానికి చెందిన ఎమ్మెల్యే దేవినేని నెహ్రూ ప్రియదర్శిని, జయరాం థియేటర్లను గుప్పిట్లో పెట్టుకుని చిరంజీవి కుటుంబ అభిమానులకు ఉచితంగా "జల్సా" సినిమాను చూపిస్తున్నట్టు తెలియవచ్చింది. "ఖుషీ" తర్వాత ఏడేళ్ళకు పవన్ కల్యాణ్ కు ఇదే పెద్ద హిట్ చిత్రమవుతుందని అభిమానులు భావించడంతో "జల్సా" సిన్మాకు క్రేజ్ పెరిగింది. గుంటూరు పట్టణలో అయితే "జల్సా' విడుదలైన అన్ని థియేటర్లనూ వారం రోజుల పాటు అక్కడి రాజకీయ నాయకులు హస్తగతం చేసుకున్నట్టు సమాచారం.
No comments:
Post a Comment