కొడవటిగంటి రోహిణీప్రసాద్
అక్షరం అంటే నశించనిది అని అర్థం. ఒకసారి ఏదైనా రాసి ఉంచితే అది శాశ్వతంగా నిలిచిపోతుందని ప్రాచీనులు భావించారు. రాతి మీద చెక్కినవైతే నిజంగా శిలాక్షరాలే. ఈ రోజుల్లో రాయడం, చదవడం అవసరమా, కాదా అనే ప్రశ్నే తలెత్తదు. ప్రస్తుతం మన జీవితాలు గడిచే పద్ధతిని బట్టి అక్షరాస్యత ఎంతో సహజమైనదిగా అనిపించడంలో ఆశ్చర్యం లేదు. ఒకప్పటి సమాజం ఇలా ఉండేది కాదు. తమ అవసరాలను బట్టి మనుషులు సృష్టించుకున్న “అసహజమైన” వ్యవస్థల్లో లిపికూడా ఒక అంశం. తొలినాటి లిపులు ప్రపంచంలో కొన్ని ప్రదేశాల్లో మాత్రమే ఆవిర్భవించాయి.
రంగుదారాలూ, ముడుల భాష
ఆధునికయుగంలో నిరక్షరాస్యత వెనకబాటుతనానికి ముఖ్యలక్షణం. “చదువురాని మొద్దు” ఎందుకూ కొరగానట్టే. అయితే అక్షరాలూ, లిపులూ అన్నీ ఎప్పుడో ఒకప్పుడు ప్రాథమికస్థాయిలో మొదలైన కొత్త పద్ధతులే. వ్యవసాయం, తొలి గ్రామాల్లో స్థిర జీవితం వగైరాలన్నీ మొదలైన తరవాత జనాభా పెరగడంతో బాటుగా వారి అవసరాలు కూడా పెరగసాగాయి. పరస్పర సంభాషణకు పనికొచ్చిన భాషలు నోటిమాటలుగా మొదలై, చాలా శతాబ్దాల పాటు సామాన్య ప్రజలమధ్య మౌఖిక స్థాయిలోనే కొనసాగాయి. శబ్దాలనూ, అవి సూచిస్తున్న సమాచారాన్నీ ఏదో ఒక రూపంలో నమోదు చెయ్యవలసిన అవసరం కొంతకాలం తరవాతగాని తలెత్తలేదు. ఎందుకంటే మననం చేసుకున్న విషయాలను గుర్తుంచుకోవటానికి మంచి జ్ఞాపకశక్తి ఉండాలి. అది అందరికీ సాధ్యం కాదు. ఒకరు రాసిపెట్టిన సంగతులను ఇతరులు ఎంతకాలం తరవాతనైనా చదివి అర్థం చేసుకోవచ్చు. ఎన్నో తరాలుగా ఒకే చోట, ఒకే రకమైన జీవితాలు గడపసాగిన మానవజాతికి ఇలా లిఖితరూపంలో భద్రపరచిన సమాచారం విలువైనదిగా పరిణమించింది. ఈ సంగతులను సులభశైలిలో వివరిస్తూ సుమారు 50 ఎళ్ళ క్రితం తిరుమల రామచంద్రగారు “మన లిపి పుట్టుపూర్వోత్తరాలు” అనే అద్భుతమైన పుస్తకం రాశారు.
రంగు పూసల సందేశాలు
ఎటొచ్చీ సమాచారవ్యాప్తికి అక్షరాలే ఉపయోగించక్కర్లేదు. అక్షరాలనూ, లిపినీ ఉపయోగించకుండానే రంగుదారాలూ, పూసలూ, ఈకలూ మొదలైనవాటితో ఆదిమతెగలు దూరప్రాంతాలకు సందేశాలు పంపుకునేవారు. దూరానున్నవారికి వినిపించే విధంగా డప్పుల మోతలూ, కనిపించే విధంగా గాలిలోకి ఎత్తుగా లేచే పొగలూ మొదలైనవి కూడా ఉపయోగించేవారు. ఆ తరవాత రాళ్ళ మీదా, ఇతర వస్తువుల మీదా బొమ్మలు చెక్కడం మొదలయింది.
గుర్తుంచుకోవలసిన సమాచారాన్ని రాసిపెట్టుకోవలసిన అవసరం బహుశా వ్యవసాయం కారణంగానే తొలిసారిగా కలిగి ఉంటుంది. పంట వివరాలనో, నాట్లకూ, కోతలకూ తగిన సమయాలనో నమోదు చెయ్యడానికి ప్రాథమిక రూపంలో భవిష్యత్తులో పనికొచ్చే విధంగా సంకేతాలను ఏర్పాటు చేసుకుని ఉంటారు. ప్రపంచంలో అక్కడక్కడా రకరకాల లిపులు ఏర్పడ్డాయి. మెసపొటేమియా, ఈజిప్ట్, సింధునదీ ప్రాంతం, చైనా, మధ్య అమెరికా మొదలైన ప్రాంతాల్లో వేటికవిగా అక్షరసముదాయాలు పుట్టుకొచ్చాయి. అప్పట్లో రోజువారీ జీవితంలో కొంతమందికి అతి పరిమితంగానైనా రాయడం, చదవడం తప్పనిసరి అయి ఉండాలి.
మతసంబంధం కలిగిన తంతులకుకూడా లిపులు ఉపయోగపడి ఉంటాయి. సంఘంలో అతి కొద్దిమందికి మాత్రమే ఇటువంటివి రాయడం, చదవడం వచ్చిఉండేవి కనక చదువుకు ప్రతి సంస్కృతిలోనూ చాలా ప్రత్యేకత ఉండేది. అక్షరజ్ఞానానికి ప్రతీకలైన అధిష్ఠాన దేవతలుండేవారు. హిందువులకు సరస్వతీదేవిలాగానే ప్రాచీన మెసపొటేమియాలో మొదట ఎన్‌లిల్, తరవాత నబూ అనే దేవతలూ, ప్రాచీన ఈజిప్ట్‌లో ధ్వుతీ, అమెరికాలోని మాయా నాగరికతలో ఇట్జమ్నా మొదలైన దేవతలు ఆరాధించబడ్డారు. ప్రాచీన ఈజిప్ట్‌లో అక్షరాస్యత పూజారివర్గానికి పరిమితమై ఉండేది. భగవంతుడికీ, పాలకవర్గాలకూ సమీపంలో ఉండిన “వ్రాయసకాడు” సంఘంలో పరపతి కలిగి ఉండేవాడు. రాతపని చేసేవాడికి తక్కిన బరువు బాధ్యతలేవీ ఉండవనీ, అటువంటివారికి నిత్యమూ రాజుగారింటి భోజనం లభిస్తుందనీ, మంచి జీవితం, ఆరోగ్యం, సిరిసంపదలూ ఉంటాయనీ అభిప్రాయం ఉండేది. పూజలూ, తంతుల విశేషాలనూ, రాచవంశాల చరిత్రనేకాక కాలాన్ననుసరించి రుతువుల్లోనూ, వానలూ, వరదల్లోనూ కలిగే మార్పులనూ, వ్యవసాయానికి సంబంధించిన వివరాలనూ ఈ పూజారివర్గం నమోదుచేసి తమ “విద్యాధిత్యత”ను పామరుల ఎదుట చాటుకుంటూ ఉండేది. తక్కినవారెవరికీ సామాన్యంగా చదువుతో పనిపడేది కాదు. వారంతా ఈ పూజారులను అతీతశక్తులు కలవారని అనుకునేవారు.
రాత అనేది సామూహికవిజ్ఞానం। లిఖితరూపంలో పోగుచెయ్యడానికీ, గుర్తుంచుకోవలసిన విషయాలను ప్రజల్లో వ్యాప్తి చెయ్యడానికి పనికొచ్చిన సాధనం. ప్రపంచంలోని గొప్ప నాగరికతలెన్నో లిపులను జ్ఞాన వ్యాప్తికై సమర్థవంతంగా ఉపయోగించుకోగలిగాయి. చరిత్ర వివరాలనూ, సామాజిక, చట్టసంబంధిత నిబంధనలనూ, వైజ్ఞానిక, సాంకేతిక విషయాలనూ, యుద్ధ తంత్రాలనూ, లిపిబద్ధం చేసి, తరవాతి తరాలకు అందించిన అక్షరాస్య సమాజాలు అంతులేని పురోగతిని సాధించాయి. దీనివల్ల లిపి ఆవిర్భావం అనేది నాగరికతకు ప్రతీకగా అనుకుంటాం కాని అది నిజం కాదు. దక్షిణ అమెరికాలోని ఆండీస్ పర్వత ప్రాంతాల్లో విలసిల్లిన గొప్ప నాగరికతల్లో అక్షరాస్యత మచ్చుకైనా ఉండేది కాదు. అలాగే ఎంతో ప్రగతినీ, ఔన్నత్యాన్నీ గతంతో పోలిస్తే ప్రపంచంలో వేలాదిగా ఉండిన మాండలిక భాషలన్నీ అతి త్వరగా అంతరించి పోతున్నాయని భాషావేత్తలు ఆవేదన చెందుతున్నారు. వీటితో బాటు అరుదైన సాంస్కృతిక సమాచారం కూడా మరుగునపడిపోతోంది.
సాధించిన రోమన్ సామ్రాజ్యం చివరకు హూణులవంటి బర్బరులవల్ల నాశనమైపోయింది. ఇలాంటివి కొన్ని తప్ప తక్కిన సందర్భాల్లో నాగరికులు అనాగరికుల్ని ఓడించి లొంగదీసుకోవటానికి తమ వద్దనున్న ఇతర సాధనాలతో బాటు విద్యాధిక్యతను కూడా ఉపయోగించుకున్నారు.రాసే ప్రక్రియ మొదలయాక శబ్దాలకూ, వాటిని సూచించే సంకేతాలకూ నిర్దిష్టమైన సంబంధం ఏర్పడటానికి రకరకాల పద్ధతులు ఉపయోగపడ్డాయి. అలాగే లేఖన సామగ్రి తయారుకావటానికి కొంత సాంకేతిక ప్రగతి అవసరమైంది. ఎన్నో శతాబ్దాలుగా నోటి మాటలకే పరిమితమై ఉండిన భాషలన్నిటికీ, లిపులూ, నిబంధనలూ, ఆ తరవాత వ్యాకరణనియమాలూ రూపొందాయి. ఒకరు రాసిపెట్టిన విషయాలను తక్కినవారు చదివి అర్థం చేసుకునేందుకు వీలుగా భాషలకు రూపురేఖలు ఏర్పడ్డాయి.
అంతమాత్రాన ప్రతి భాషకూ ఒక లిపి తయారయిందని కాదు. మన దేశంలో తుళు, కొంకణీ మొదలైన మాండలిక భాషల్లాగే ప్రపంచంలోని కొన్ని మాండలికాలకు లిపి ఉండదు. ఈ భాషలు ఒక్కొక్క ప్రాంతానికే పరిమితమైనప్పటికీ ఇవి మాట్లాడేవారి సంఖ్య అంత తక్కువేమీ కాదు. వాటిలో ఉత్తమ సాహిత్యంకూడా తయారవుతుంది కాని ఏవో చారిత్రక కారణాలవల్ల వాటికి లిపులు ఏర్పడలేదు. గతంతో పోలిస్తే ప్రపంచంలో వేలాదిగా ఉండిన మాండలిక భాషలన్నీ అతి త్వరగా అంతరించి పోతున్నాయని భాషావేత్తలు ఆవేదన చెందుతున్నారు. వీటితో బాటు అరుదైన సాంస్కృతిక సమాచారం కూడా మరుగునపడిపోతోంది.
ప్రాంతీయ భాషాభేదాలే కాక దేశభాషలుకూడా ప్రపంచీకరణ కారణంగా అంతరించిపోయే ప్రమాదం కనబడుతోంది. కంప్యూటర్ల వెల్లువలో ఎన్నో భాషలకు ప్రాచుర్యం తగ్గుతోంది. తెలుగువంటి భాషలను చదివేవారూ, రాసేవారూ క్రమంగా తగ్గిపోతున్నారు. ఎప్పటికప్పుడు సరఫరా అవుతున్న సమాచారాన్ని తమ మాతృభాషలో చదివి, నేర్చుకునే అవకాశాలు తగ్గుతున్నాయి. అందరికీ అర్థమయే సాంకేతిక పరిభాష తయారు కావటం లేదు. ఇవన్నీ భాషకూ, సంస్కృతికీ సంబంధించిన పరిమితులు.
అలాగే ఒక్కొక్క భాషలోని ఉచ్చారణ ననుసరించి అక్షరాలు రూపొందడం జరుగుతుంది. ఉదాహరణకు తమిళంలో క చ ట త పలు తప్ప భారతీయ భాషలన్నిటిలోనూ సామాన్యంగా ఉండే తక్కిన అక్షరాలు లేకపోవడంతో “కాంతి” అన్న పదానికీ, “గాంధి” అన్న పదానికీ రాతలో తేడా కనబడదు. అలాగే సంస్కృతం, హిందీ, మరాఠీ మొదలైన లిపుల్లో దక్షిణ భాషల్లో ఉన్నట్టుగా ఎ, ఒ అనే అక్షరాలూ, గుణింతాలూ ఉండవు. మరొకవంక కొన్ని ఇంగ్లీషు పదాలను తెలుగులో రాయాలంటే యాక్టర్, బ్యాంక్, థ్యాంక్స్ అని వికృతంగా రాయవలసివస్తుంది.
గతంతో పోలిస్తే నేటి సమాజం సమాచార సాధనాల మీదనే పూర్తిగా ఆధారపడుతోంది. నాగరికతలో భాగాలైన భాషలూ, లిపులూ అన్నీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒకదానితో ఒకటి పోటీ పడే పరిస్థితి ఏర్పడుతోంది. తమ తమ భాషల, లిపి, సాహిత్యాల ఆవిర్భావాన్ని గుర్తించి, అర్థం చేసుకున్న జాతులు తమ గుర్తింపునూ, ఆత్మగౌరవాన్నీ మరింత బాగా కాపాడుకోగలవు.
ప్రాచీన సుమేరియన్ కీలలిపి
లిపిని సృష్టించడం సులువైన పని కాదు. నాగరికతలోని తక్కిన అంశాల్లాగే ఇది కూడా మెసపొటేమియాలో సుమేరియన్ నాగరికతలో మొదట తలెత్తినట్టుగా తెలియవస్తోంది. స్థిరజీవితం మొదలుపెట్టిన నాలుగైదు వేల ఏళ్ళ తరవాత మానవసమాజంలో క్రమంగా ఎన్నో మార్పులు కలిగాయి. మనోభావాలను ప్రకటించటానికీ, తంతులూ వగైరాలను నిర్వహించటానికీ బొమ్మలు గీయడం ఎప్పటినుంచో కొనసాగుతున్నప్పటికీ ఈనాడు మనం అభివర్ణించే సమాచారయుగం (ఇన్‌ఫర్మేషన్ ఏజ్) వంటిది మొదలవడానికి చాలాకాలం పట్టింది. మారుతున్న పరిస్థితుల్లో రాత అనేది తమకు పనికొస్తుందనీ, రాసే నిపుణులను పోషించే అవసరం ఉందనీ అప్పటివారికి అనిపించి ఉండాలి. ఇటువంటి పరిస్థితులు మన దేశంలోనూ, క్రీట్, ఇతియోపియా మొదలైన ప్రాంతాల్లోనూ కూడా ఏర్పడ్డాయి కాని లిపి అనేది ముందుగా సుమేరియన్ నాగరికతలోనూ, మెక్సికోలోనూ స్వతంత్ర రీతుల్లో తయారైందని పరిశోధకుల ఉద్దేశం.
నాగరికతలోని ఇతర విషయాలలాగే ఒకచోట తయారైన లిపి త్వరలోనే పొరుగు ప్రాంతాలకు వ్యాపించడంతో తక్కినవారికి ఎక్కడికక్కడ మళ్ళీ లిపులను సృష్టించుకోవలసిన అగత్యం లేకుండా పోయింది. వివిధ ప్రదేశాల్లో ఈ అనుకరణ మక్కీకి మక్కీ పద్ధతిలోనూ, ఇతరుల స్ఫూర్తితో తమకు అనువైన పద్ధతిలోనూ కూడా జరిగిన సందర్భాలున్నాయి. ఆధునిక యుగంలో టర్కీలోనూ, న్యూగినీ, అమెరికా వగైరాల ఆదిమ తెగల భాషలకు ఇంగ్లీష్ (రోమన్) లిపిని వాడడం జరిగింది. అలాగే రష్యాలోని కొన్ని తెగలు రష్యన్ (సిరిలిక్) లిపిని అనుసరించాయి. కొత్త లిపులని తయారుచేసుకోకుండా ప్రాచుర్యంలో ఉన్న అక్షరాలను వాడుకునే ఈ విధానం మక్కీకి మక్కీ పద్ధతి. ఇటువంటి అనుసరణలూ, అనుకరణలూ గతంలోనూ జరిగాయి. తొమ్మిదో శతాబ్దంలో గ్రీక్, హీబ్రూ లిపులను కొద్దిగా మార్చి రష్యన్ అక్షరాలను రూపొందించారు. అంతకు ముందు నాలుగో శతాబ్దంలో ఇంగ్లీష్‌తో సహా అనేక లిపులకు ఆధారమైన జర్మన్ అక్షరమాలను బిషప్ ఉల్ఫిలాస్ అనే వ్యక్తి ఎక్కువగా గ్రీక్ అక్షరాలనూ, కొన్ని రోమన్ అక్షరాలనూ కలిపి తయారు చేశాడు. క్రీ.పూ.1400 ప్రాంతాల క్రీట్‌లోని మినోవా నాగరికత తొలి గ్రీక్ అక్షరాలకు ఆధారం అయింది.
ప్రాచీన లిపులలో అప్పటివారు ఏం రాసేవారు? సుమేరియన్ వగైరా లిపుల్లో రాసినవన్నీ అసంపూర్తిగా, అస్తవ్యస్తంగా, చదవడానికి జటిలంగా ఉండేవి. మొదట్లో నమోదు చేసిన సమాచార మంతా టెలిగ్రాఫ్ భాషలాగా పేర్లకూ, అంకెలకూ, కొలతలకూ, లెక్కలకూ, కొన్ని విశేషణాలకూ మాత్రమే పరిమితమై ఉండేది. ఎంతో అవసరమనిపించిన విషయాలను మాత్రమే ఇలా కష్టపడి రాసేవారు. ఎందుకంటే నోటితో ఉచ్చరించే శబ్దాలన్నిటికీ ప్రతీకలైన అక్షరాలు తయారవడానికి ఎన్నో శతాబ్దాలు పట్టింది. ఒకవంక సమాజ జీవితంలో పరిణామాలు జరుగుతూ ఉంటే, మనుషుల మధ్య జరిగే వ్యవహారాలూ, వ్యాపారాలూ జటిలం అవుతూ వచ్చాయి. ఎందరో వ్యక్తులకు సంబంధించిన ఎన్నో విషయాలను లిఖితరూపంలో నమోదు చేస్తున్నప్పుడు అపోహలకూ, అపార్థాలకూ అవకాశాలు లేకుండా చూసుకోవలసివచ్చింది. ఈ రోజుల్లో అవసరాలనిబట్టి కొత్తరకాల కంప్యూటర్ భాషలు తయారవుతున్నట్టే ప్రాచీన యుగాల్లో నాగరికత పెరుగుతున్న కొద్దీ ఈ రకమైన ఒత్తిడివల్ల లిపులు మెరుగుపడక తప్పలేదు. మొదట్లో మత, న్యాయ, చట్టపరమైన వ్యవహారాలకు మాత్రమే పనికొచ్చిన అక్షరజ్ఞానమంతా దేవాలయాల్లోనూ, రాజప్రాసాదాల్లోనూ పనిచేసే చాలా కొద్దిమందికి మాత్రమే ఉండేది. క్రీ.పూ.3000 ప్రాంతంలో మొదలైన సుమేరియన్ లిపిని చదివితే అదంతా రాచ, దేవాలయ వ్యవస్థలకు సంబంధించిన అధికారుల రచనలుగా దర్శనమిస్తాయి. ప్రాచీన ఈజిప్ట్, క్రీట్, గ్రీస్, చైనా, ఉత్తర అమెరికా నాగరికతలన్నిటిలోనూ ఇదే కనిపిస్తుంది.
మధ్య అమెరికా ప్రాచీన లిపి
తొలి లిఖిత సాహిత్యానికి ప్రజాస్వామిక లక్షణాలేవీ ఉండేవి కావు. వృత్తిపరంగా రాయ, చదవ నేర్చినవారు ఒక్కొక్క చోటా 30, 40కి మించి ఉండేవారు కారు. సమాజంలో శ్రమవిభజన మొదలవడంతో అదనపు ఆహారోత్పత్తిని సాధించడం వీలైంది. కాయకష్టం చేసే వర్గం వేరవడంతో తిని, కూర్చోగలిగిన మరొక వర్గం ఏర్పడింది. ఇందులో కొందరు రకరకాల ప్రత్యేక వృత్తుల్లో నైపుణ్యం సంపాదించుకోగలిగారు. వాటిలో అక్షరాస్యత ఒకటి. వర్గాల మధ్య అంతరాలు ఏర్పడుతున్న కొద్దీ రాయడమనే నైపుణ్యానికి స్పష్టమైన వర్గ స్వభావం రూపొందసాగింది. ఏం రాయాలో, ఎందుకు రాయాలో తెలిశాక రాసే విధానం దానికి తగినట్టుగానే తయారైంది. రచనా పద్ధతి కూడా అందరికీ అర్థం కావలసిన అవసరం ఉండేది కాదు. అచ్చంగా పాలకవర్గాలకే పరిమితమైన ఆనాటి అక్షరజ్ఞానమంతా వారి వర్గప్రయోజనాలు కాపాడటానికీ, అలగాజనాన్ని పన్నులూ మొదలైనవాటితో అణిచిఉంచడానికీ ఉపయోగపడింది. పూజారులకూ, రాచవంశాలకూ ఎన్నో దైవిక శక్తులున్నట్టుగా ప్రజలను భ్రమ పెట్టటానికి పురాణాలు పనికొచ్చాయి. అక్షరాస్యత పెరిగిన వేల సంవత్సరాల తరవాత కూడా మత గ్రంథాల్లోనూ, పురాణాల్లో ఏముందో చదివి తెలుసుకోలేని పామరులకు విస్సన్న చెప్పిందే వేదమనేది మనకు తెలిసినదే. అందుచేత తొలి యుగాల్లో లిఖిత సమాచారాన్ని స్వప్రయోజనాలకు ఎలా వినియోగించుకునేవారో మనం సులువుగా ఊహించుకోవచ్చు.
అక్షరాస్యత కొద్దిమందికే పరిమితం కావడంతో ఏదైనా నాగరికత అంతరించినప్పుడల్లా విలువైన అక్షరజ్ఞానం మరుగున పడిపోతూ ఉండేది. సింధునది లోయలో అద్భుతమైన నగర నిర్మాణవ్యవస్థతో వర్ధిల్లిన నాగరికత ఆర్యభాషీయుల సంపర్కంతో క్రమేపీ నశించినట్టుగా పరిశోధకులు చెపుతారు. అక్కడి అవశేషాల్లో ముద్రికలమీద కనిపిస్తున్న లిపికీ, ఆ తరవాతి వేదకాలపు భాషకూ ఎటువంటి సంబంధమూ కనబడదు. క్రీ.పూ.1200 ప్రాంతంలో అతి ప్రాచీన గ్రీక్ నాగరికత కుప్పకూలిన తరవాత వారి లిపి కూడా అంతరించిపోయింది. మళ్ళీ నిరక్షరాస్యతే మిగిలింది. ఆ తరవాత మరొక 400 ఏళ్ళకు అదే ప్రాంతంలో మరొక గ్రీక్ నాగరికత తలెత్తడం, తమకు అనువైన పద్ధతిలో వారు మెరుగైన అక్షరమాలను రూపొందించుకోవడం జరిగాయి. గతంతో పోలిస్తే వారి జీవనశైలిలోనూ, జీవితావసరాల్లోనూ కలిగిన మార్పుల దృష్య్టా కొత్తపద్ధతిలో రాసే విధానం మరింత నిర్దుష్టంగా తయారైంది. అంతేకాదు; మారుతున్న ప్రజల జీవితావసరాలకు అనుగుణంగా రాసే విషయాల్లోకూడా మార్పు కలిగింది. నిజమైన సాహిత్యానికి నాంది ఇదే.
నిరంతర వార్తా స్రవంతి
Monday, February 25, 2008
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment