అసలుసిసలు తెలుగు పండుగ, ఆంధ్రులను ప్రకృతితో మమేకం చేసే పర్వదినం ఉగాది. వేపపువ్వుకు కూడా ఒక ప్రయోజనాన్ని కల్పించిన, ఆ వగరు రుచిని నాలుకలమీదకు చేర్చే పండుగ బహుశా ప్రపంచంలోనే ఉగాది ఒక్కటి. కొత్తబట్టలు, నగలు కంటె రానున్న పన్నెండు నెలలూ ఎలా ఉండబోతున్నాయో తెలుసుకునేందుకు అనుచానంగా పంచాంగశ్రవణం మీద ఉత్సుకత చూపే “తెలుగులు” అంతకంటే ఉత్సాహంగా కవిసమ్మేళనాలూ జరుపుకుంటారు. కవిపుంగవులూ భావిని అంతా సస్యశ్యామలమూ, సతతహరితమే అని అనునయ గీతాలు పాడుతారు ఈ దినాన. ఏనాట కలిసిందో గాని సాహితీవేత్తలకూ, ఉగాదికి సావాసం, ఆంధ్రులు అంతర్జాతీయపౌరులయినా ఆ సత్సాంగత్యం నిత్యనూతనంగా సాగుతూనే ఉంది.
ఉగాది వస్తుంది అనగానే సాహితీకృషీవలురు పలువురు ముద్రణారంగాన్ని ముఖ్యంగా పత్రికాప్రపంచాన్ని సుసంపన్నం చేస్తారు. కధలు, కవితలు, వ్యాసాలు, నవలలు, అనువాదాలు, విమర్శలు, పద్యాల తోరణాలతో పండగరోజు తెలుగుభాషామతల్లిని శోభాయమానంగా అలంకరిస్తారు. పత్రికారంగం కూడా అన్నిసాహితీప్రక్రియల్లో పోటీలు నిర్వహించి, కొన్ని వందలరూపాయల నుంచి, అక్షరాలా లక్షరూపాయలవరకూ నగదు పురస్కారాలను విజేతలకు అందజేస్తుంది. అచ్చుపత్రికలు, పోర్టల్సు, వెబ్ పత్రికలు రానున్న ఉగాదికి అన్ని సాహితీవిభాగాల్లోనూ పోటీలు ఇప్పటికే ప్రకటించాయి. గోరంత విత్తు కొండంత చెట్టయినట్లు సరదాగా మొదలయిన తెలుగు బ్లాగులు క్రమంగా సమాంతర సమాచార, సాహితీవేదికలుగా రూపాంతరం చెందిన విషయం సభ్యసమాజం సగౌరవంగా గుర్తించి, బ్లాగరుల వైపు ఆసక్తిగా, ఆశగా చూస్తుంది.. ఈ ఉగాది రచనల పోటీల్లో విజేతలుగా నిలిచే అర్హత మన బ్లాగర్లలో చాలా మందికి ఉంది. ఆలస్యం అమృతం విషం అన్నట్లు మన వారు కలాలు తీసుకుని కార్యరంగంలోకి దుమకటమే ఆలస్యం.
నిరంతర వార్తా స్రవంతి
Monday, February 25, 2008
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment