నిరంతర వార్తా స్రవంతి

Thursday, May 1, 2008

అజీజ్ రెడ్డి మృతదేహానికి ఎక్స్ రే

అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ అనుచరుడు వెంకటరెడ్డి అలియాస్ అజీజ్ రెడ్డి మృతదేహానికి ఎక్స్ రే తీస్తున్నారు. ఇందు కోసం అతని మృతదేహాన్ని మార్చురీ నుంచి ఆస్పత్రికి తరలించారు. పోలీసులతో హైదరాబాదులోని జూబిలీహిల్స్ లో జరిగిన ఎదురు కాల్పుల్లో అజీజ్ రెడ్డి బుధవారం రాత్రి మరణించిన విషయం తెలిసిందే. అతని మృతదేహానికి గురువారం ఉదయం పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం అతని మృతదేహాన్ని ఆస్పత్రి మార్చురీకి తరలించారు.

సంఘటనా స్థలం నుంచి పోలీసులు అమెరికా తయారీ 9 ఎంఎం రైఫిల్ ను స్వాధీనం చేసుకున్నారు. మూడు సెల్ ఫోన్లు, డ్రైవింగ్ లైసెన్స్ కూడా పోలీసుల చేతికి చిక్కాయి. గతంలో జైలు నుంచి విడుదలైన అజీజ్ రెడ్డి ముంబయికి పారిపోయాడు. ఇటీవలే హైదరాబాద్ వచ్చాడు. ఎర్రబండ్లపల్లికి చెందిన అజీజ్ రెడ్డి హైదరాబాదు వచ్చి ముషీరాబాద్ దాదాగా అవతారమెత్తాడు. ఆ తర్వాత తీవ్రవాదులతో చేతులు కలిపాడు. అతినిపై హత్య కేసులు, భూ సెటిల్ మెంట్ కేసులు, తదితర కేసులు ఉన్నాయి. సినీ నిర్మాత నిఖిల్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు అజీజ్ రెడ్డి ఆచూకీ దొరికినట్లు భావిస్తున్నారు. తనకు కోటి రూపాయలు ఇవ్వాలని అజీజ్ రెడ్డి డిమాండ్ చేసినట్లు నిఖిల్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాదులోనే ఉన్న అజీజ్ రెడ్డిని తమ కొడుకుగా భావించడం లేదని అతని తల్లిదండ్రులు గతంలోనే చెప్పారు. బంధువులు వస్తే అజీజ్ రెడ్డి మృతదేహాన్ని అప్పగిస్తామని పోలీసులు చెబుతున్నారు.

No comments: