నిరంతర వార్తా స్రవంతి

Tuesday, May 20, 2008

వైఎస్ కు పదవీ గండం!

ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి పదవికి ఇప్పట్లో ఏదైనా ప్రమాదముందా? ఈ నెల 29 న జరుగనున్న ఉప ఎన్నికల్లో టీఅర్ ఎస్ గనుక తన స్ధానాలను తాను దక్కించుకుంటే రాజశేఖరరెడ్డి పదవికి రోజులు దగ్గర పడినట్టే. కాంగ్రెస్ హైకమాండ్ వద్ద వైఎస్ పై ఇప్పటికే అనేక ఆరోపణల చిట్టా పేరుకుని ఉంది. అయితే రాజశేఖరరెడ్డి ప్రజాకర్షణ గల నాయకుడని హై కమాండ్ వద్ద సమాచారం ఉండడంతో ఆయన పై ఏ చర్య తీసుకోవాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిన పరిస్ధితి దాపురించింది. రాజశేఖరరెడ్డి ప్రజాకర్షణకు, రానున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి ముడిపెట్టకపోయినా, వైఎస్ కు ఇది పరీక్షా కాలమే.

వైఎస్ కు గతంలో కాంగ్రెస్ అధిష్టానవర్గం వద్ద ఆడింది ఆట, పాడింది పాటగా ఉండేది. ఇప్పుడా పరిస్ధితి లేదు. చిరంజీవి పార్టీ పెట్టడం ఖాయం కావడం, తెలుగుదేశం పార్టీ కొద్దిగా బలపడడం వంటి పరిణామాల నేపధ్యంలో వైఎస్ మీద హై కమాండ్ వత్తిడి తీవ్రతరమవుతోంది. కేంద్ర్ కేబినెట్ మంత్రి జైపాల్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం వద్ద మంచి పలుకుబడి ఉంది. అయితే ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి జైపాల్ ఆసక్తి చూపకపోవడంతో వైఎస్ కు ప్రత్యామ్నాయ శక్తి దాదాపు లేకుండా పోయింది.

అంతమాత్రం చేత వైఎస్ పదవి పదికాలాలపాటు నిలబడి ఉంటుందన్న గ్యారంటీ లేదు.ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కనీసం 6 స్ధానాల్లో అయినా విజయం సాధించకపోతే అధిష్టానవర్గం వైఎస్ ను నిలదీసి ప్రశ్నించడం ఖాయం. చిరంజీవి రాజకీయపార్టీ గురించి ఆసక్తిగా ఆరా తీస్తు న్న కాంగ్రెస్ అధిష్టానవర్గం ఆ విషయంలో వైఎస్ అభిప్రాయాలకు పెద్ద విలువ ఇవ్వడం లేదని, దగ్గుబాటి పురంధేశ్వరి వంటి వారి నుంచి సమాచారం రాబడుతున్నట్టు తెలుస్తోంది.

No comments: