నిరంతర వార్తా స్రవంతి

Thursday, April 3, 2008

కొందరికే "జల్సా"

Pavan Kalyan




సినిమా: జల్సా
రేటింగ్: 2/5
విడుదల తేదీ: 2-4-08
బేనర్: గీతా ఆర్ట్స్
నటీనటులు :పవన్ కళ్యాణ్,ఇలియానా,కమిలినీ ముఖర్జీ,పార్వతీ మిల్టన్,ముఖేష్ ఋషి,ప్రకాష్ రాజ్,ఉత్తేజ్,అలీ,శివాజీ,సునీల్,బ్రహ్మానందం తదితరులు.
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
నిర్మాత: అల్లు అరవింద్
కథ,స్కీన్ ప్లే,మాటలు,దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్


జనజీవన స్రవంతి లో కలిసిపోయి తిరిగి జీవితం ప్రారంభించిన నక్సలైట్ ప్రేమలో పడితే వచ్చే పరిణామాల చుట్టూ తిరిగే కథగా వచ్చిన చిత్రం జల్సా.ఇందులో పవన్ కళ్యాణ్ యూత్ ని ఆకట్టుకునే మేనరిజమ్స్,డాన్సులతో ప్రెష్ గా కనిపిస్తూ అభిమానులను అలరిస్తారు.కాని టైటిల్ కి తగినట్లుగా పూర్తి స్ధాయి జోష్ గా ఉండక పోవటంతో ఒక వర్గం కొంత నిరాశకి గురవుతోంది.అందులోనూ సామాజిక సమస్యని వినోదంతో చెప్పాలన్న ఆలోచన మంచిదే గాని కామెడీగా ప్రతీ అంశాన్ని చెప్పటంతో పండాల్సిన ఎమోషన్స్ మిస్సయ్యాయి .

సంజయ్ సాహూ( పవన్ )కరీంనగర్ జిల్లాలోని ఓ పేద రైతు కొడుకు.తండ్రి ఆత్మహత్య,అన్న హఠాత్ మరణం అతని జీవితాన్ని అతలాకుతలం చేస్తాయి.తప్పని పరిస్థితుల్లో అడవుల్లోకి పారిపోయి నక్సలైట్ గా మారతాడు.అక్కడికి కూంబింగ్ ఆపరేషన్ కోసం వస్తాడు పోలీస్ ఆఫీసర్ ప్రకాష్ రాజ్. తర్వాత జరిగిన పరిణామాలతో సంజయ్ జనజీవన స్రవంతి లో కలిసిపోయి హైదరాబాద్ వచ్చి తిరిగి జీవితం ప్రారంభిస్తాడు.అప్పుడు భాగమతి(ఇలియానా) పరిచయం అవుతుంది. తర్వాత అది ప్రేమగా మారుతుంది.జీవితం మళ్ళీ చిగురించి జల్సా చేసుకుందామనుకున్న దశలో ఆమె తండ్రి ప్రకాష్ రాజ్ అని తెలుస్తుంది.అప్పుడు ఏంజరుగుతుందనేది మిగతా కథ.

కెరీర్ ప్రారంభం నుండి రొమాంటిక్ కామిడీలతో హిట్లు కొడుతున్నరచయిత,దర్శకుడు త్రివిక్రమ్.ఖుషీ తో రొమాంటిక్ కామిడీలకు కరెక్టుగా సరిపోయే హీరో అనిపించుకున్న హీరో పవన్ కళ్యాణ్ తో చేసిన చిత్రం కావటంతో అంతటా మంచి హైప్ ఏర్పడింది.కాని కథలో ట్విస్టులు ఎక్కువ అవటం,చెప్పే విషయం లో స్పష్టత కొరవడటం కథనాన్ని నీరుగార్చాయి. డైలాగులు కూడా ఊహించిన రేంజిలో పేలకపోవటం మరో మైనస్.శివాజి,ముఖేష్ రుషి పాత్రలు రొటీన్ గా సాగాయి.మహేష్ బాబు వాయిస్ ఓవర్ ప్రయోగం బాగున్నప్పటికి కథకి కలిసి రాలేదు.

దేవిశ్రీప్రసాద్ సంగీతం,శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాగున్నాయి.దర్శకత్వం పరంగా త్రివిక్రమ్ మరింత పరిణతి సాధించినట్టు ఫ్లాష్ బ్యాక్ సీన్ల లో కనిపిస్తుంది.మరింత కామెడీ,రొమాంటిక్ టచ్ ఉంటే మరింత రాణించేది. ఇవన్నీ ప్రక్కన పెడితే పవన్ కళ్యాణ్ ఎనర్జిటిక్ నటన హైలైట్.సామాజిక సమస్యను తెరకెక్కించాలన్న అల్లు అరవింద్ ప్రయత్నం అభినందించతగ్గది.

No comments: