నిరంతర వార్తా స్రవంతి

Tuesday, April 8, 2008

ప్రజలే మాకు అంగరక్షకులు: నాయని

ప్రజలే తమకు అంగరక్షకులని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) మాజీ శాసనసభ్యుడు నాయని నర్సింహారెడ్డి అన్నారు. ఇటీవల రాజీనామాలు చేసిన తమ పార్టీ శాసనసభ్యులకు ప్రభుత్వం అంగరక్షకులను ఉపసంహరించుకోవడంపై ఆయన సోమవారంనాడు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ఉగాది పర్వదినం సందర్భంగా పార్టీ కార్యాలయంలో తెలంగాణ భవన్ లో రుద్రయాగం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పంచామృతాభిషేకం చేశారు. ముఖ్యమంత్రి రోజు రోజుకూ విచక్షణ కోల్పోతున్నారని నాయని నర్సింహారెడ్డి అన్నారు. మాజీ శాసనసభ్యులందరికీ అంగరక్షకులు కొనసాగుతుండగా తమకే అంగరక్షకులను తొలగించారని ఆయన అన్నారు.

తమను ప్రజలు నెత్తిన పెట్టుకుని కాపాడుకుంటారని, తాము ప్రజల కాళ్లకు పూజలు చేస్తామని ఆయన అన్నారు. తమపై ముఖ్యమంత్రి కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటున్నారని ఆయన విమర్శించారు. తాము రాజీనామాలు చేస్తున్నామని చెప్పి శాసనసభ్యులకు భూములు ఇస్తూ జారీ చేయాల్సిన జీవోను రెండు నెలలు ఆపారని ఆయన చెప్పారు. ఆ భూముల కోసం తాము కోర్టుకు వెళ్తామని ఆయన చెప్పారు. తెలంగాణకు వ్యతిరేకంగా తెలుగుదేశం, కాంగ్రెస్ కుట్ర చేస్తున్నాయని ఆయన విమర్శించారు.

No comments: