నిరంతర వార్తా స్రవంతి

Tuesday, April 8, 2008

బాలకృష్ణ "పాండురంగడు"

తాను నటించిన పాండురంగడు చిత్రం అన్నమయ్య, శ్రీరామదాసు చిత్రాల కన్నా భిన్నమైందని హీరో బాలకృష్ణ అన్నారు. తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం సోమవారంనాడు ప్రసాద్ ల్యాబ్స్ లో పాండురంగడు చిత్రం ప్రెస్ మీట్ జరిగింది. రాఘవేంద్రరావు ఇంతకు ముందు అన్నమయ్య, శ్రీరామదాసు భక్తి చిత్రాలకు దర్శకత్వం వహించారని, అయితే తనతో నిర్మించిన పాండురంగడు వాటికన్నా భిన్నమైందని ఆయన అన్నారు. ఎన్టీఆర్ నటించిన పాండురంగ మాహత్మ్యం ఆధారంగా పాండురంగడు చిత్రాన్ని కృష్ణమోహన్ నిర్మాతంగా ఆర్కె పిల్మ్ అసోసియేట్స్ పతాకంపై నిర్మించారు. బాలకృష్ణ సరసన స్నేహ, టబు నటించారు. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేశారు.

హీరో బాలకృష్ణతో పాటు చిత్ర దర్శకుడు రాఘవేంద్ర రావు, దర్శకుడు కె. విశ్వనాథ్, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, రచయిత జెకె భారవి, సనా, సుహాసిని, అపూర్వ తదితరులు ఈ ప్రెస్ మీట్ కు హాజరయ్యారు. పాండురంగడు పాత్రను పోషించడం ఒక సవాల్ అని బాలకృష్ణ అన్నారు. తన తండ్రి నటించిన పాండురంగ మాహాత్మ్యం చిత్రంతో తాను నటించిన పాండురంగడు చిత్రానికి పోలికలున్నాయని, అయితే అదే సమయంలో దాన్ని కన్నా కొంత భిన్నంగానూ ఉందని ఆయన అన్నారు. పాండురంగడు చిత్రంలో సత్యభామ, రుక్మిణి, నారద పాత్రలున్నాయని, పాండురంగ మాహాత్మ్యంలో ఆ పాత్రలు లేవని ఆయన చెప్పారు. పాండురంగడు చిత్రాన్ని రాఘవేంద్రరావు ఎంతో అందంగా రూపొందించారని ఆయన ప్రశంసించారు. చిత్రం ఆడియో ఆవిష్కరణ ఈ నెల 27వ తేదీన మచిలీపట్నంలోని ముంగినపూడి తీరంలో గల పాండురంగ స్వామి ఆలయంలో జరుగుతుందని ఆయన చెప్పారు.

ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాధ్ ఈ చిత్రంలో బాలకృష్ణ తండ్రి పాత్రను పోషించారు. పాత సినిమాలో ఈ పాత్రను చిత్తూరు నాగయ్య పోషించారని, ఈ పాత్ర పోషణ అతి కష్టమైందని ఆయన చెప్పారు. చిత్రం అపూర్వ విజయం సాధిస్తుందని నిర్మాత కృష్ణమోహన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్కే పతాకంపై బాలయ్యతో గతంలో నిర్మించిన అపూర్వ సహోదరులు ఘన విజయం సాధించిందని ఆయన గుర్తు చేశారు.

No comments: