నిరంతర వార్తా స్రవంతి

Tuesday, April 8, 2008

చిరు పార్టీకి మద్దతు : బ్రహ్మనందం

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వస్తే తాను మద్దతు ఇస్తానని ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం చెప్పారు. ఆయన మంగళవారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తాను ఈ స్థాయిలో ఉండడానికి శ్రీవారి కృపే కారణమని ఆయన అన్నారు. ఎవరు సినిమాల్లోకి వచ్చినా, రాజకీయాల్లోకి వచ్చిన శ్రీవారి కృప వల్లనే సాధ్యమని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. చెన్నైలోని శ్రీకళాసుధ తెలుగు అసోసియేషన్ పదో సంవత్సర ఉగాది పురస్కారాల సందర్భంగా హాస్యనటుడు బ్రహ్మానందాన్ని ఘనంగా సన్మానించింది. ఆదివారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో చెన్నై నగర మేయర్ సుబ్రమణియన్ చేతుల మీదుగా బ్రహ్మానందానికి లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును బహూకరించారు. ఈ కార్యక్రమం అనంతరం ఆయన తిరుమలకు వచ్చారు.

బ్రహ్మానందంతో పాటు నటుడు విశాల్, నటి తమన్నా, స్నేహ, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్‌లను సైతం ఘనంగా సన్మానించారు. తెలుగువారు ఉగాదిని ఇంత ఘనంగా జరుపుకోవడం చాలా ఆనందాన్ని కలిగిస్తోందని కార్యక్రమంలో పాల్గొన్న మేయర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి పంపిన ఉగాది సందేశాన్ని చదివి వినిపించారు. తాను ఇటీవల గిన్నీస్ రికార్డులో స్థానం సంపాదించడానికి ప్రేక్షకుల దీవెనలే కారణమని బ్రహ్మానందం అన్నారు. గిన్నీస్ రికార్డ్ సాధించిన తర్వాత తనకు అనేక సార్లు సన్మానాలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. తాను ఈ సన్మాన కార్యక్రమాల సందర్భంగా ప్రేక్షకులు పొందే ఆనందాన్ని చూడడానికే తాను ఈ సన్మానాలను స్వీకరిస్తున్నానని అన్నారు. నటుడు విశాల్ మాట్లాడుతూ తాను కేవలం సన్మానాన్ని పొందడానికి రాలేదని బ్రహ్మానందాన్ని స్వయంగా చూడాలనే వచ్చానని అన్నారు.

No comments: