నిరంతర వార్తా స్రవంతి

Thursday, March 13, 2008

తెల్లకాగితం... మనిషి జీవితం!

-కొల్లూరి సోమశంకర్


“బాబూ, అన్నం తిందూగాని రా”
అమ్మ పిలుస్తోంది. వంటిట్లోకి వెళ్ళాను. కంచంలో చూసాను. అది పేరుకే అన్నం. కానీ మేము తినేది ఉడికించిన నూకల ముద్ద. నెలాఖరు వచ్చేసరికి ఇంట్లో బియ్యం ఉండవు. కూరగాయలు కూడా రెండు వారాలకొకసారి కొంటాం. ఎక్కువగా ఆకుకూరలే తింటాం. రెండు రోజుల నుంచి అమ్మ ఆకుకూరలు కూడ కొనడం లేదు. నూకల జావలో ఉల్లిపాయ ముక్కలు నంచుకోడం.. లేదంటే నూకల ముద్దని పచ్చికారంతో తినడం. ఇదే మా భోజనం!

నాకేడుపొస్తోంది. ఓ పదిరోజుల నుంచి మా ఇంట్లో అందరం కలిసి తినడం లేదు. నాకు చెల్లికీ పెట్టాక, మమ్మల్ని పడుకోబెట్టి అప్పుడు తింటున్నారు అమ్మానాన్న…! నిజంగా తింటున్నారో లేదో నాకు తెలియదు. చెల్లి గబగబా తినేసి, గ్లాసుడు నీళ్ళు తాగేసింది. నేను కూడ అదే చేసాను. కారంగా ఉన్నా తప్ప లేదు.

స్కూలు తెరచి నెల రోజులవుతోంది. మేము ఇంకా పుస్తకాలు కొనుక్కోలేదు. టెక్స్ట్ బుక్స్ అయితే సెకండ్ హాండ్ వి కొంటాం. లేదంటే ఎవరైనా పై తరగతి కుర్రాడిని బతిమాలి తీసుకుంటాం. ఇప్పటికి ఒక్క లెక్కల పుస్తకం తప్ప, మిగిలినవన్నీ దొరికాయి. అయితే కొన్నింటికి ముందు పేజీలు, మరికొన్నింటికి వెనుక పేజీలు లేవు. టెక్స్ట్ బుక్స్ కొత్తగా కొనుక్కున వాళ్ళని అడిగి ఆ పేజీలు జిరాక్సు తీయించుకుందాంలే అని నాన్న అన్నాడు. ఇంక నోట్ బుక్స్ సంగతి చూడాలి.

నాకెప్పుడు కొత్త నోట్ బుక్స్ ఉండవు. నాన్న ట్రాన్స్ పోర్టు కంపెనీలో పని చేస్తాడు. వాళ్ళ ఆఫీసులో ప్రింటర్ కి కార్బన్ పెట్టి ఉపయోగిస్తారట. వాడి పాడేసిన ఆ కాగితాలను తెచ్చి పుస్తకంలా కుట్టి ఇచ్చాడు. ‘ప్రస్తుతానికి దీంట్లో రాసుకో. మెల్లిగా నోటుబుక్సు ఏర్పాటు చేస్తాను’ అని చెప్పాడు. నాన్న ఇంటికి వచ్చాక అడగాలి.

ఇంతలో యూనిఫాం సంగతి గుర్తొచ్చింది.
“అమ్మా… యూనిఫాం…”
“నాన్న వాళ్ళ ఫ్రెండు కొడుకు గిరి మీ స్కూల్లోనేగా చదివేది. ఆ అబ్బాయికి ఈ సారి కొత్త యూనిఫాం కుట్టిస్తున్నారట. పాత యూనిఫాంని నీకివ్వమని అడిగారు. వాళ్ళు ఒప్పుకున్నారట”
“అది కాదమ్మా… గిరన్నయ్య రెండేళ్ళు వాడాడు ఆ యూనిఫాంని….”
“అయితేనేం, ఎక్కడా కొంచెం కూడ చిరగలేదట. ప్రస్తుతానికి అది వాడుకో. పండగకి కొత్త యూనిఫాం తీసుకుందాం” అంటూ అమ్మ నన్ను బుజ్జగించింది.
ఇంతలో నాన్న రావడంతో, నన్ను పడుకోమని చెప్పి అమ్మ అక్కడ్నించి కదిలింది.

* * * * * *

ఓ వారం రోజులు గడిచాయి. లెక్కల టెక్స్ట్ బుక్ దొరకలేదు. యూనిఫాం మాత్రం వచ్చింది. అమ్మ దాన్ని శుభ్రంగా ఉతికిచ్చింది. నోట్ బుక్స్ కోసం నాన్న ఓ ఆలోచన చేసాడు. పరీక్షలు పాసయి, పై తరగతికి వెళ్ళిపోయిన పిల్లలు అమ్మేసిన నోట్సులలో మిగిలిపోయిన తెల్లని పేజీలన్నింటిని తిరిగి కొన్నాడు. వాటిని పుస్తకాలుగా కుట్టి అట్టలు వేసి ఇచ్చాడు. కొత్త పుస్తకాలు కొనుక్కోవాలన్న నా కోరిక తీరనే లేదు.
ఈ పూట స్కూలు ఆయిపోయి సాయంత్రం ఇంటికొచ్చాను. లెక్కల పుస్తకం ఎలా సంపాదించాలాని చూస్తున్నాను. అమ్మ తెలిసున్న వాళ్ళింట్లో అడిగిందట. అందరూ తమ చుట్టాల పిల్లలకి ఇచ్చేసామని చెప్పారుట. నాకేడుపొచ్చింది.
“అమ్మా, పుస్తకం తీసుకెళ్ళకపోతే మాస్టారు కొడతారేమో…” అన్నాను.
” ఏం కొట్టరులే. రేపు నేనొచ్చి చెబుతాను” అంది అమ్మ. కానీ నాకు భయం పోలేదు.
అప్పుడు అమ్మ నన్ను, చెల్లిని దగ్గరికి తీసుకుని, బోలెడు కథలు చెప్పింది. నాకు కాస్త ధైర్యం వచ్చింది. “మీకు ఓ పద్యం నేర్పుతాను” అంటూ అమ్మ ఈ పద్యం చెప్పింది.

ఆపదలందు ధైర్య గుణ, మంచిత సంపదలందుఁ దాల్మియున్,
భూప సభంతరాళమునఁ బుష్కల వాక్చతురత్వ, మాజి బా
హా పటు శక్తియున్, యశమునం దనురక్తియు, విద్య యందు వాం
ఛా పరివృద్ధియున్, బ్రకృతి సిద్ధ గుణంబులు సజ్జనాళికిన్

తర్వాత దాని అర్థం వివరించింది. ఇలా అమ్మ మాకు చాలా పద్యాలు నేర్పింది. వాటిల్లో నాకు చాలా వరకు కంఠతా వచ్చు.

* * * * * *

మర్నాడు లెక్కల పీరియడ్లో మాస్టారు పుస్తకం గురించి అడగనే అడిగారు. నేను భయం భయంగా అమ్మ వచ్చి మాట్లాడుతుందని చెప్పా. ఆయన నాకేసి ఉరిమి చూసి, ‘ ఏడిసావు లే పో’ అని అన్నారు. కాసేపటికి మా అమ్మ వచ్చింది. ఆయనతో మాట్లాడి, ఆయన చేతిలో ఉన్న కొత్త లెక్కల పుస్తకాన్ని తీసుకుని బయటకి వెళ్ళింది.

తర్వాత తెలుగు పీరియడ్. మాస్టారు పాఠం చెబుతుండగా ఓ నోటీసు వచ్చింది. అవతలెల్లుండి డి. ఇ. ఓ గారు బడికి ఇన్‌స్పెక్షన్ కి వస్తున్నారని, పిల్లలందరూ శుభ్రంగా ఉతికిన బట్టలు వేసుకుని, అన్ని పుస్తకాలు తీసుకుని స్కూలికి రావాలని సందేశం. తెలుగు మాస్టారు ఇవన్నీ మాకు చెప్పి, ” ఒరే పిల్లలూ, వచ్చే డి. ఇ. ఓ గారు మిమ్మల్ని ఏదైనా వ్యాసం రాయమని అడగొచ్చు. ఓ ఠావు తెల్లకాగితం తెచ్చుకోండి. గుండ్రటి దస్తూరితో చక్కగా రాయండి” అంటూ మమ్మల్ని హెచ్చరించారు. ఆ రోజు మిగతా మాస్టార్లందరూ కూడ ఇదే మాట చెప్పారు. ఏ పీరియడ్లోనైనా డి. ఇ. ఓ గారు రావచ్చని, కాబట్టి అప్పటివరకూ చెప్పిన పాఠాలన్నింటిని బాగా చదువుకుని రావాలని చెప్పారు. లెక్కల మాస్టారు నా టెక్స్ట్ బుక్ గురించి మళ్ళీ గుర్తు చేసారు.

ఇప్పుడు నా సమస్యలు రెండు. ఒకటి లెక్కల పుస్తకం, ఇంకోటి తెల్ల కాగితం…..
‘లెక్కల పుస్తకం సంగతి అమ్మ చూస్తానంది. ఠావు తెల్ల కాగితం నాన్నని అడగాలి’ అని అనుకుంటూ ఇల్లు చేరాను. రాత్రి నాన్న ఇంటికి వచ్చాక తెల్లకాగితం గురించి అడిగాను. గడువు చెప్పేసాను. ఆయన ‘చూద్దాంలే’ అని అన్నాడు. నేను హాయిగా నిద్రపోయాను. ఆ రాత్రి మధ్యలో మెలకువ వచ్చినప్పుడు చూస్తే, అమ్మ ఏదో రాస్తూ కూర్చుంది. తెల్లారింది. నేను స్కూలికి, నాన్న ఆఫీసుకి వెళ్ళిపోయాం. నేను సాయంత్రం ఇంటికి వచ్చేసరికి, అమ్మ ఇంకా రాస్తునే ఉంది. మమ్మల్ని చూసి, రాయడం ఆపి, పుస్తకాలు పక్కనబెట్టింది.
“కాళ్ళు చేతులు కడుక్కుని రండి, కాసిన్ని బఠానీలు తిని పాలు తాగుదురుగాని” అని అంది. అమ్మ కుడిచేతి వేలొకటి వాచిపోయి కనబడింది.
“ఏమైందమ్మా?” అని అడిగాను.
“ఏం లేదురా, చాలా సేపటినుంచి రాస్తున్నా కదా, అందుకే ఇలా అయ్యింది”
ఏం రాస్తోందో అని పరిగెత్తుకు వెళ్ళి గూట్లో పెట్టిన పుస్తకాన్ని చూసాను. నా లెక్కల టెక్స్ట్ బుక్ ని మక్కీకి మక్కీ తిరిగి నోట్సులో రాస్తోంది అమ్మ. దాదాపుగా అయిపోయింది. నేను అమ్మని చుట్టేసుకుని ఏడ్చేసాను.
“ఏడుపెందుకురా? డబ్బులు పెట్టి ఎలాగు పుస్తకం కొనలేకపోయాను. కనీసం చేత్తో అయినా రాసిద్దామని ఆనుకున్నాను….” అంటూ నన్ను ఓదార్చింది, తన కళ్ళ వెంట నీళ్ళు కారుతుండగా.
రాత్రి నాన్న వచ్చాక, తెల్ల కాగితం గురించి అడిగాను. ‘మర్చిపోయానురా, రేపు తెస్తాలే’ అని అన్నారు. నాకు నీరసం ముంచుకొచ్చింది. చెప్పిన గడువులోగా తెల్లకాగితాన్ని సంపాదించగలనో లేదో తెలియదు. ఇలాగే ఇంకో రోజు కూడ గడచిపోయింది. అమ్మ లెక్కల పుస్తకాన్ని పూర్తిగా రాసేసి, మాస్టారికి తిరిగిచ్చేసింది. అంత లావు పుస్తకాన్ని రెండు రోజులలో చేత్తో పూర్తిగా రాసేసినందుకు ఆయన ఆశ్చర్యపోయారు. అమ్మ ఆయనకి థాంక్స్ చెప్పి వెళ్ళిపోయింది.

మొత్తానికి నాన్న నాకీ పూట ఓ ఠావు తెల్లకాగితం తెచ్చిచ్చాడు. వాళ్ళ ఆఫీసునుంచి తెచ్చాడట. ఇలా కొత్త కాగితాన్ని ఆఫీసునుంచి తీసుకురావడం నాన్నకి అస్సలిష్టం లేదట! కానీ నా గోల భరించలేక తెచ్చానని అమ్మతో అంటుంటే విన్నాను.
ఏమైతేనేం, నేనిప్పుడు బడికి ధైర్యంగా వెళ్ళగలను.

* * * * * *

మర్నాడు ఉత్సాహంగా బడికి వెళ్ళాను. డి. ఇ. ఓ గారు వచ్చే రోజిది. ఆయన ఎప్పడొస్తారా అని అందరూ ఎదురుచూస్తున్నారు. తెలుగు పీరియడ్ మొదలైంది. మాస్టారు కంగారు పడిపోతున్నారు. పిల్లలందరినీ హెచ్చరిస్తున్నారు. ఉన్నట్లుండి ఆయనకేదో గుర్తొచ్చింది. “ఏమర్రా? తెల్ల కాగితం తెచ్చుకున్నారా?” అని అడిగారు.

నేను తప్ప మిగిలిన అందరూ ‘తెచ్చుకున్నాం సార్’ అంటూ అరిచారు. ” ఏరా నువ్వెందుకు తెచ్చుకోలేదు?” అని గద్దించారు మాస్టారు. నేను ఏదో చెప్పబోయేలోగా, నా దగ్గరికి వచ్చి, నా నడ్డి మీద ఒక దెబ్బ వేసారు. అప్పటి కాని ఆయన కోపం చల్లారలేదు.
తెల్ల కాగితం ఎందుకు తెచ్చుకోలేదని మళ్ళీ అడిగారు.

“తెచ్చుకున్నాను సార్! కాని ఇంటర్వెల్లో నాల్లో తరగతి చదువుతున్న శీను ఏడుస్తూ కనిపించాడు. ఎందుకేడుస్తున్నాడో అడిగాను. మీరు వాళ్ళ క్లాసులో కూడ చెప్పారట కదా సార్ - తెల్ల కాగితం తెచ్చుకోమని! ఎంత ప్రయత్నించినా వాడికి తెల్ల కాగితం దొరకలేదట. అందుకని నా తెల్లకాగితం వాడికిచ్చేసాను. నా దగ్గర కనీసం ఒక సైడు వాడిన కాయితాల పుస్తకం ఉంది. వాడికి అది కూడ లేదు సార్….” అని చెప్పాను.

మాస్టారు ఒక్క నిమిషం మౌనంగా ఉండిపోయారు. ఆయన ఏదో అనబోతుండగా హెడ్ మాస్టారు, డి. ఇ. ఓ గారు మా క్లాసులోకి వచ్చేసారు. పిల్లలందరూ ఆయనకి నమస్కరించి, తెల్ల కాగితాలు ముందేసుకుని ఆయన ఏదైనా చెబితే రాయడానికి సిద్ధమైపోయారు.
“పిల్లలూ, ఇది తెలుగు పీరియడ్ కదా, మీకెవరికైనా ‘ఏఱకుమీ కసుగాయలు’ అనే సుమతీ పద్యం వస్తే లేచి చెప్పండి. పద్యం చెప్పి అర్థం కూడ వివరించాలి…” అన్నారు డి. ఇ. ఓ గారు. నాకా పద్యం తెలుసు. అమ్మ ఎప్పుడో చెప్పింది. వెంటనే నేను లేచి ఆ పద్యం చదివి దాని అర్థం వివరించాను. వెంటనే ఆయన ‘శభాష్’ అని అన్నారు. హెడ్ మాస్టారు, తెలుగు మాస్టారు నాకేసి మెచ్చుకోలుగా చూసారు. కొన్ని క్షణాల తర్వాత డి. ఇ. ఓ గారు, హెడ్ మాస్టారు గారు మా గదిలోంచి వెళ్ళిపోడంతో వాన వెలసినట్లయ్యింది.

* * * * * *

ఇప్పుడు నా దగ్గర రెండు వందల పేజీల తెల్ల కాగితాల లాంగ్ నోట్ బుక్స్ ఆరు ఉన్నాయి. మా తెలుగు మాస్టారు నాకు వాటిని బహుమతిగా ఇచ్చారు.

Sunday, March 9, 2008

తెలంగాణపై వామపక్షాల వేరుదారులు!

ఉభయ కమ్యూనిస్టుల మధ్య తెలంగాణ చిచ్చు రగులుతోంది.తెలంగాణపై సిపిఐ, సిపియం మాటకు మాట అనుకుంటున్నాయి. మాటల యుద్ధం కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలంగా సిపిఐ నిర్ణయం తీసుకోవడంపై సిపియం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు మండిపోతున్నారు. తెలంగాణ విషయంలో తమ రెండు పార్టీల మధ్య విభేదం ఉందని ఆయన మరోసారి సోమవారంనాడు కూడా అన్నారు. తాము సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామని, తెలంగాణ విషయంలో తమ వైఖరిలో మార్పు లేదని ఆయన అంటున్నారు. పోలిట్ బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి తెలంగాణ విషయంలో కాస్తా మెతకగా మాట్లడుతున్నారు. తెలంగాణపై కాంగ్రెస్ తన వైఖరిని వెల్లడించకుండా సిపియం అడ్డుపడుతోందని చేస్తున్న విమర్శను ఆయన ఇటీవల తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ తన వైఖరిని ముందు ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. తాము తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు వ్యతిరేకమని చెబుతూనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు తాము అడ్డుపడబోమని సిపియం కేంద్ర కమిటీ చాలా కాలంగా సూచన చేస్తూ వస్తోంది. నిజానికి కాంగ్రెస్ కు తెలంగాణ ఏర్పాటు చేయడానికి సిపియం అడ్డు కాదనే విషయం స్పష్టంగానే బయట పడింది.రాష్ట్ర కార్యదర్శి రాఘవులు మాత్రం తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తామనే పద్ధతిలో వీరావేశంతో మాట్లాడుతున్నారు. సిపియం పార్లమెంటు సభ్యుడు పి. మధు మాటల తీరు మరింత శాసించే ధోరణిలో ఉంది. ఈ శాసించే ధోరణే సిపిఐకి మొదటి నుంచీ నచ్చడం లేదని చెప్పాలి. ఒక్క తెలంగాణ విషయంలోనే కాదు, మరిన్ని విషయాల్లోని సిపియంకు, తమకు మధ్య భిన్నాభిప్రాయాలున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్సి కె. నారాయణ తాజా సోమవారంనాడు అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని తాము తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నామని ఆయన చెబుతున్నారు. ప్రజల మనోభావాలను కాదని తమ తాము చెప్పేదే వినాలంటే మంచిది కాదని ఆయన సిపియం నాయకులకు హితవు చెబుతున్నారు.వచ్చే ఎన్నికల్లో వామపక్షాలు రెండు వేర్వేరు కూటముల్లో ఉండవచ్చునని తాజా పరిస్థితిని బట్టి అనిపిస్తోంది. చిరంజీవి రాజకీయాల్లోకి రావడం ఖాయమని ఇటు తెలంగాణ రాష్ట్ర సమితి, అటు సిపిఐ రెండు పార్టీలు భావిస్తున్నట్లే ఉన్నాయి. సిపిఐ, తెరాస వచ్చే ఎన్నికల్లో చిరంజీవి పార్టీతో పొత్తు పెట్టుకోవచ్చుననే మాట వినిపిస్తోంది. సిపియం మాత్రం తెలుగుదేశం పార్టీతో కలిసి సీట్ల సర్దుబాటు చేసుకోవచ్చునని భావిస్తున్నారు. ఏమైనా సిపియం పెద్దన్న పాత్రపై సిపిఐ తెలంగాణ అంశం ఆధారంగా ధిక్కార స్వరాన్ని ప్రకటించిందని భావించవచ్చు.

ఈనాడును అధిగమించలేదు దానికి వైఎస్సే "సాక్షి"

ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఏకైక తనయుడు జగన్మోహన్ రెడ్డి వ్యవస్ధాపించిన "సాక్షి" దినపత్రిక మార్చి 24 న పాఠకుల ముందుకు రానుంది. ఈనాడు పత్రిక సర్క్యులేషన్ పదిలక్షలు కాగా సాక్షి ప్రింట్ ఆర్డర్ 15 లక్షలు మించిపోయినట్టు తెలుస్తోంది.ఐదు లక్షల సర్క్యులేషన్ వద్ద రెండో స్ధానంలో ఉన్న ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి తమ సమీప ప్రత్యర్ధి సాక్షి అని తెలిసిపోయింది. ఎంతో అట్టహాసంతో ఐదేళ్ళ క్రితం తిరిగి ప్రారంభమైన ఆంధ్రజ్యోతి, ఈనాడును దాటిపోగలమన్న సంకేతాలను ఏజెంట్లకు ఇచ్చింది. ఆంధ్రజ్యోతి విజయవంతమైనా ఈనాడు సర్క్యులేషన్ లో సగం మాత్రమే పొందగలిగింది.సాక్షి ప్రింట్ ఆ ర్డర్ 15 లక్షలు ఉన్నప్పటికీ ఫైనల్ గా ఆ పత్రిక సర్క్యూలేషన్ ఏడు లక్షల వద్ద సెటిల్ అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయని ఈ పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. విపరీతమైన ఆర్ధిక బలం, అన్ని కలర్ పేజీలు ఈ పత్రిక ప్లస్ పాయింట్స్ కాగా , నేరుగా కాంగ్రెస్ పత్రిక కావడం, యాడ్ కాంపైన్ తుస్సుమనడం మైనస్ పాయింట్లు.కాంగ్రెస్ బ్రాండుతో ముందుకు వచ్చిన "సూర్య" దినపత్రిక లక్ష కాపీల సర్క్యులేషన్ తో గుంటపూలు పూస్తోంది. ఆ పత్రిక మీద యాజమాన్యం చేస్తున్న ఖర్చులో పది శాతం కూడా వెనక్కి రావడం లేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపధ్యంలో "సాక్షి" ఎంతవరకు విజయవంతమవుతుందో చూడాలి.

ఆత్మరక్షణలో "ఉండవల్లి"

రామోజీరావుతో ప్రత్యక్ష యుద్ధానికి దిగి ఆయనను ఏమీ చేయలేకపోయిన రాజమండ్రి కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్ ఇప్పుడు ఆత్మరక్షణలో పడ్డారు. అధికార మదం తలకెక్కితే ఎవరైనా పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తారనడానికి ఉండవల్లి అరుణ్ కుమార్ ఉదంతం తాజా ఉదాహరణ.మార్గదర్శి ఫైనాన్సియల్స్ వ్యవహారంరంలో ఒక ముంబయ్ ఫైనాన్స్ కంపెనీ సహకారంతో రామోజీరావు గట్టెక్కారు. రామోజీ సీన్ అయిపోయిందని ప్రచారం చేసిన ఉండవల్లి ఇప్పుడు ఆ విషయంలో మౌనంగా ఉండిపోవలసివచ్చింది. రామోజీరావుతో అనవసరంగా ఘర్షణకు దిగినందుకు కాంగ్రెస్ అధిష్టానవర్గం ఆయనకు మొట్టికాయ వేసినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి నుంచి ప్రత్యక్ష ఎన్నికలో ది గితే రామోజీరావు తమ మీడీయా బలంతో ఓడిస్తారన్న భయం ఇప్పుడు ఉండవల్లికి పట్టుకుంది. అందువల్ల పూర్తిగా పార్టీ సేవలో ఢిల్లీలో ఉండిపోతే ఎలా ఉంటుందని ఆయన అ అలోచిస్తున్నట్టు చెబుతున్నారు.

Friday, March 7, 2008

సత్యసాయిబబా వ్యాఖ్యలపై తెలంగాణలో రగడ!

భగవాన్ పుట్టపర్తి సాయిబాబా ఇప్పుడు మళ్ళీ వార్తల్లోకి వచ్చారు. ప్రాంతాల వారీగా రాష్ట్రం ముక్కలు కావడం మంచిది కాదని ఆయన సెలవు ఇవ్వడంతో తెలంగాణ వాదులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. తెలంగాణలో సత్య సాయి భక్తులు పెద్ద సంఖ్యలో ఉండడంతో బాబా వాక్కు ఇక్కడ సంచలనం సృష్టిస్తోంది.సత్య సాయిబాబా తన హద్దుల్లో తాను ఉండాలిగానీ రాజకీయాల్లో తలదూర్చరాదని టీఅర్ ఎస్ నాయకుడూ హరీష్ రావు వ్యాఖ్యానించడంతో తెలంగాణలోని సత్యసాయి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. సామాజిక సేవ చేస్తూ నిరాడంబరంగా జీవిస్తున్న బాబా మీద కమ్యూనిస్టులకు, మావోయిస్టులకు సదభిప్రాయమే ఉంది. ఈ నేపధ్యంలో సాక్షత్తు దైవ స్వరూపుడైన బాబా మీద హరీష్ రావు బురదజల్లడం వివాదాస్పదమైంది.కొన్ని వేలకోట్ల రూపాయలు విదేశీ, దేశీ భక్తుల నుంచి సేకరించిన సత్యసాయిబాబా రాయలసీమలో మంచి నీటి తో సహా అనేక సామాజిక సేవాకార్యక్రమాల ద్వారా మంచి పేరు తెచ్చుకున్నారు. తన ట్రస్టులో మాజీ ఐఎఎస్ , ఐపిఎస్ లను నియమించుకున్న బాబా సైంటిఫిక్ మేనేజ్ మెంట్ ను ప్రవేశపెట్టుకున్నారు. మంచి సేవాభావం గల ప్రముఖులు ట్రస్టులో ఉండడం వల్ల బాబా గారి పని సులభమైపోయింది. బాబా గారికి ఆ భగవంతుడు ఇచ్చిన దూరదృష్టి అది.ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా నిన్న సత్యసాయిబాబా ప్రకటిచడం వెనుక ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హస్తం ఉందని హరీష్ రావు విమర్శించడం చర్చనీయాంశమైంది. గతంలో ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ పుట్టపర్తి వెళ్ళినప్పటికీ,, బాబా ఆయన పట్ల సానుకూలంగా ప్రతిస్పందించలేదని వార్తలు వచ్చాయి. వైఎస్ కుటుంబం క్రిస్టియన్ మతం స్వీకరించడమే బాబా ముభావానికి కారణమని అప్పట్లో విశ్లేషణలు వెలువడ్డాయి. ఈ నేపధ్యంలో బాబా వైఎస్ వలలో పడ్డారని టీఅర్ ఎస్ నాయకులు విమర్శించడం ఎంతవరకు సమంజసం?

Thursday, March 6, 2008

జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ప్రభా ఠాకూర్

అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ప్రభా ఠాకూర్ నియమితులయ్యారు. ఈమేరకు ఎ.ఐ.సి.సి. గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభ ప్రస్తుతం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొనసాగుతున్న రీటా బహుగుణ జోషి నుంచి బాధ్యతలు స్వీకరిస్తారు. 1949సెప్టెంబర్ 10న రాజస్థాన్ రాష్ట్రంలోని ఆజ్మీర్ జిల్లా ఉదయ్ పూర్ ఖుర్ద్లో జన్మించిన ప్రభ హిందీ లిటరేచర్లో పిహెచ్.డి. పూర్తిచేశారు. రచయితగా ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది.

మళ్లీ కర్ణాటక రాజకీయాల్లోకి ఎస్.ఎం.కృష్ణ

కర్ణాటక రాజకీయాలలో మళ్లీ క్రియాశీలక పాత్ర పోషించే ఉద్దేశంతో ఎస్.ఎం.కృష్ణ మహారాష్ట్ర గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. అధిష్టానం ఆదేశాల మేరకు ఆయన తన రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ కు సమర్పించారు. ఈమేరకు రాష్ట్రపతి పాటిల్ కృష్ణ రాజీనామాను ఆమోదిస్తూ ఇన్ఛార్జి బాధ్యతలను గోవా గవర్నర్ జమీర్ కు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

తమిళనాడులో విజయకాంత్ టీవీ ఛానల్

తమిళనాడులో మరో టీవీ ఛానల్ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ప్రజలను ఆకర్షించడానికి టీవీ ఛానళ్ల ఏర్పాటే సరైన నిర్ణయమని రాజకీయ నాయకులు భావిస్తున్న తమిళనాడులో డి.ఎం.డి.కె.కు అనుకూలంగా ప్రచారం చేసుకోవడానికి వీలుగా సినీ నటుడు విజయకాంత్ టీవీ ఛానల్ ఏర్పాటుకు ముందుకువచ్చారు. కెప్టెన్ ఛానల్ తో పాటు పక్ష పత్రికను కూడా ప్రారంభించాలని భవిస్తున్నట్లు తమిళనాడు వర్గాల భోగట్టా! తమ టీవీ ఛానల్ లో 24గంటల పాటు ప్రసారమయ్యే వార్తలకు తోడు వినోద కార్యక్రమాలు కూడా ఉంటాయని విజయకాంత్ పార్టీ నాయకుడైన ఆయన బంధువు సుధీష్ తెలిపారు.

అంతిమపోరుకు మాదిగలు సిద్ధం

ఎస్సీల వర్గీకరణ కోసం మాదిగలంతా అంతిమపోరాటానికి సిద్ధంగా ఉన్నారని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నేత మంద కృష్ణ మాదిగ పేర్కొన్నారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయరాం మాదిగ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు నెల్లూరు వెళ్లిన కృష్ణ మాదిగ విలేఖరులతో ముచ్చటించారు. ఎస్సీల వర్గీకరణపై కేంద్రం ఏర్పాటుచేసిన ఉషామెహ్రా కమిషన్ నివేదికను ప్రస్తుత పార్లమెంటు సమావేశాలలో ప్రవేశపెట్టి ఆమోదించడంపై ఈనెల 25లోపు నిర్ణయం తీసుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎస్సీలను వర్గీకరిస్తే తమ పదవులకు రాజీనామాలు చేస్తామంటూ కొంతమంది ఎమ్మెల్యేలు బెదిరిస్తుండడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.

చిత్తూరు జిల్లాలో ఆరుగురు విద్యార్ధుల దుర్మరణం

చిత్తూరు జిల్లాలో గురువారం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాలలో ఆరుగురు విద్యార్ధులు ప్రాణాలు కోల్పోయారు. చంద్రగిరి మండలం పనపాకం గ్రామ పంచాయతీ పరిధిలోని చెరువులో ఈతలు వెళ్లిన ఎనిమిది మంది విద్యార్ధుల్లో నలుగురు మృత్యువాతపడ్డారు. గ్రామానికి కిలో మీటర్ దూరంలోని చెరువులో ఈతకొట్టేందుకు వెళ్ళిన వారిలో పదేళ్ల పవన్ కల్యాణ్, కిరణ్, ప్రసాద్, తొమ్మిదేళ్ల మనోజ్ కుమార్ ప్రాణాలు కోల్పోయారు. అదే విధంగా జిల్లాలోని శ్రీకాళహస్తి మండలం ఎ.ఎం.పుత్తూరు గ్రామానికి చెందిన పదకొండేళ్ల దీక్షు, కల్యాణరెడ్డి స్వర్ణముఖిలో ఈతకొట్టేందుకువెళ్లి ప్రాణాలుకోల్పోయారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

రైతులకు ప్రత్యేకించి రెగ్యులేటరీ కమిషన్: మంత్రి రఘువీరా

రైతుల కోసం ప్రత్యేకించి రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటుచేయనున్నట్లు రాష్త్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి చెప్పారు. గురువారం ఆయన అనంతపురంలో విలేఖరులతో మాట్లాడుతూ రైతులు, వినియోగదారుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం వ్యూహాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. అమెరికా, చైనా, ఇజ్రాయిల్ వంటి దేశాలలో అమలుచేస్తున్న ఆధునిక వ్యవసాయ విధానాలను మన రాష్ట్రంలో కూడా అమలుచేయడానికిగల సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సహాయం నేరుగా రైతులకే చేరుతోందని, ఇందులో ఎలాంటి అనుమానాలకూ తావులేదని స్పష్టంచేశారు. రైతులకు ఇస్తున్న అన్ని రకాల ఆర్ధిక సహాయాన్ని వారివారి బ్యాంకు ఖాతాల్లో జమచేసేలా ప్రణాళికలు సిద్ధంచేశామన్నారు.

గట్టెక్కిన "మంగతాయారు"

సెక్స్ బాంబ్ ముమైత్ ఖాన్ హీరోయిన్ గా రూపొందిన "మంగతాయారు టిఫిన్ సెంటర్ " కలెక్షన్లు ఎ సెంటర్లలో బలహీనంగా ఉన్నా, ముమైత్ అందాల ఆరబోతను ఆస్వాదించడానికి గ్రామీణ ప్రేక్షకులు ముందుకు వస్తున్నారు.మొత్తమ్మీద సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చినా నిర్మాత మాత్రం నష్టపోకపోవడం విశేషం. ఈ సినిమా టెలివిజన్ హక్కులను 90 లక్షలకు అమ్ముకున్నట్టు తెలుస్తోంది. హీరోయిన్ గా వళ్ళు దాచుకోకుండా నటించడమే కాకుండా, ఐటమ్ గాళ్ గా యువ ప్రేక్షకులకు కనువిందు చేస్తోంది.ఈ సినిమా కోటి 75 లక్షల లోబడ్జెట్ లో నిర్మాణం కావడం విశేషం. చిన్న సినిమాలను తీసి లాభ పడే విధమిదని నిర్మాత చెప్పకనే చెప్పారు.

జగన్ ముందుచూపు!

ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి కుమారుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ముందు చూపు బాగానే ఉంది. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆయన తన కార్యకలాపాలను సాగిస్తున్నట్లు అర్థమవుతోంది. కడపలో ఆయన ప్రతినెలా దర్బార్ నిర్వహిస్తున్నారు. ఈ దర్బార్ ద్వారా ప్రజాసమస్యలను పరిష్కరిస్తున్నారు. అడిగిన వారికి సాయం అందిస్తున్నారు. ఉద్యోగాలు ఇప్పించడం వంటి సాయాలతో పాటు ఇతర సమస్యలతో ముందుకు వచ్చిన వారికి తగిన సాయాలు ఆయన అందిస్తున్నారు. ఆయన దర్బార్ ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడానికి భారీగానే జనాలు వస్తున్నారు.జగన్ వ్యాపారాలు చాలా వరకు కర్ణాటక రాష్ట్రంలోని బెంగూళూర్ లో ఉన్నాయి. ఈ వ్యాపారాల ద్వారా వచ్చిన డబ్బును ప్రజలకు సాయంగా అందిస్తున్నారట. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి, తండ్రి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వైయస్ జగన్మోహన్ రెడ్డి కార్యకలాపాలు విస్తరించిన విషయం తెలియంది కాదు. అందుకు అనుగుణంగా ఆయనపై తెలుగుదేశం పార్టీ నాయకుల విమర్శలు కూడా పెరిగాయి. జగన్ ను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కూడా వదిలిపెట్టలేదు. వారి విమర్శలకు జగన్ తనదైన శైలిలో తిప్పికొట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.జగన్ సాక్షి పేరు మీద పెద్ద యెత్తున ఒక దినపత్రికను తేవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్న విషయం కూడా అందరికీ తెలిసిందే. ఈ పత్రికలో ఉద్యోగాలు కూడా నమ్మకమైనవారికే దక్కుతున్నాయనే మాట వినిపిస్తోంది. తెలుగుదేశం చేస్తున్న విమర్శలు, పత్రిక స్థాపన ప్రయత్నాలు జగన్ రాజకీయంగా పెరిగేందుకు తోడ్పడుతున్నాయని అంటున్నారు. నిజానికి జగన్ ఇది వరకే పార్లమెంటులో అడుగు పెట్టాల్సింది. జగన్ పార్లమెంటుకు వెళ్లడానికి వీలుగా లోక్ సభ సీటుకు రాజీనామా చేయడానికి చిన్నాన్న వైయస్ వివేకానంద రెడ్డి సిద్ధపడ్డారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానవర్గం అందుకు సిద్ధపడలేదు. దాంతో జగన్ ప్రయత్నం ఫలించలేదు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం ఖాయమనే చెప్పవచ్చు.

జయప్రదపై మరో అపప్రద!

సమాజ్ వాది పార్టీ లోక్ సభ సభ్యురాలు జయప్రద మరో వివాదంలో చిక్కుకున్నారు. ప్రాపర్టీ ట్యాక్స్ ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న జయ ప్రద లోక్ సభ సభ్యత్వం ప్రమాదంలో పడింది.ఈ కేసు పూర్వాపరాలు ఈ విధంగా ఉన్నాయి. జయప్రద ఆమె సోదరులకు చెన్నైలో 50 కోట్ల విలువైన రెండు సినిమా థియేటర్లు ఉన్నాయి. ఈ రెండు థియేటర్లపై 20 లక్షల ఆస్ధి పన్నును ఆమె చెన్నై మునిసిపల్ కార్పొరేషన్ కు చెల్లించవల్సి ఉంది. జయప్రద, ఆమె సోదరులు ఈ థియేటర్ విషయంలో తాము నష్టాల్లో ఉన్నామని ఆస్ధి పన్ను చెల్లించుకోలేమని అప్పీలు చేసుకున్నారు. ఆమె అప్పీలు దివాళాతో సమానమని, దివాళా తీసినవారు పార్లమెంటు సభ్యులుగా అనర్హులని చెన్నై మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు.తమ దివాళా ఉత్తర్వు రద్దు చేయవలసిందిగా జయప్రద తాజా గా దరఖాస్తు చేసుకున్నట్టు తెలిసింది. 20 లక్షల పన్ను ఎగగొట్టడానికి ఆమె ఆడిన నాటకం బెడీసి కొట్టడం చర్చనీయాంశమైంది.

హెలికాఫ్టర్ కొనుగోలుచేయనున్న చిరంజీవి?

హీరో చిరంజీవి తన సొంతానికి హెలికాప్టర్ కొనుగోలు చేయనున్నట్టు తెలిసింది. ఉగాది నాడు రాజకీయ పార్టీని ప్రకటించనున్న చిరంజీవికి రాష్ట్ర మంతటా సుడిగాలిలా పర్యటించడానికి హెలికాప్టర్ అవసరముందని చెబుతున్నారు.గతంలో ఎన్టీఆర్ "చైతన్యరథం" ఏర్పాటు చేసుకున్నారు. అదొక చిన్న డీజిల్ వ్యాన్. దానికి కుమారుడు హరికృష్ణే డ్రైవర్ . పాతికేళ్ళ కాలం గడిచిపోయింది. చిరంజీవి స్పీడుకు అటువంటి వ్యానులు పనికి రాకపోవచ్చు.హెలికాప్టర్ అండ ఉంటే చిరంజీవి ఎన్నికలకు నాలుగు నెలల ముందు పార్టీ పెట్టినా అధికారంలోకి రావడం తధ్యమంటున్నారు.

ఘనంగా శివరాత్రి మహోత్సవాలు

శివరాత్రి పర్వదినం సందర్భంగా గురువారం ఉదయం నుంచే రాష్ట్రంలోని ప్రముఖ శివాలయాలన్నీ భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రాలైన శ్రీశైలం, వేములవాడ, శ్రీకాళహస్తి తదితర పుణ్యక్షేత్రాల్లో బ్రహ్మోత్సవ శోభతో ఆలయ పురవీధులన్నీ శోభాయమానంగా దర్శనమిస్తున్నాయి. గత వారం రోజులుగా ఈ పుణ్యక్షేత్రాల్లో వాహన సేవలు, స్వామివారి నిత్య ఊరేగింపులు తదితర కార్యక్రమాలతో భక్త జనం పోటెత్తుతోంది. విజయవాడ దుర్గగుడి భక్త కోటితో పోటెత్తింది. భక్తుల రద్దీతో తొక్కిసలాట చోటుచేసుకుంది. పోలీసులు స్వల్పంగా లాఠీచార్జీ చేశారు. పంచారామ క్షేత్రాలు భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి.శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీశైలంలోని భ్రమారాంబికా సమేతుడైన శ్రీ మల్లికార్జున స్వామి వారిని బుధవారం పురవీధుల్లో విశేష అలంకరణలతో ఊరేగింపు నిర్వహించారు. అలాగే గురువారం శివరాత్రి సందర్భంగా స్వామివారికి కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. మరోవైపు దక్షిణ కాశిగా పేరొందిన శ్రీకాళహస్తి క్షేత్రంలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి సమేతుడైన స్వామివారికి హంస వాహన సేవ నిర్వహించారు. అలాగే మరో శైవ క్షేత్రమైన వేములవాడలోను శివారాత్రి సందర్భంగా శ్రీరాజరాజేశ్వర స్వామి వారికి విశేష పూజలు నిర్వహిస్తున్నారు. ఈ ఆలయానికి 5 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. అలాగే కాళేశ్వరాలయం కూడా భక్తులతో కిటకిటలాడుతోంది. మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు పెద్ద యెత్తున వస్తున్నారు.

చిరంజీవి ఆస్తులపై దాడులు తప్పవా?

చిరంజీవి రాజకీయపార్టీ పెట్టుకుంటే నష్టం తమకే ఎక్కువని భావిస్తున్న అధికార కాంగ్రెస్ పార్టీ చిరును ఎలాగైనా కట్టడి చేయడానికి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సామ, దాన, భేద, దండోపాయాలను ప్రయోగించాలనుకుంటోంది.నిన్న సినిమారంగ ప్రముఖులు మహేష్ బాబు, చార్మి, వివి వినాయక్, రాజమౌళి, దిల్ రాజు ఇళ్ళపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడి చేయడం వెనుకు అధికార కాంగ్రెస్ హస్తం ఉన్నట్టు తెలిసింది. శత్రువు మీద దాడి చేయాలనుకున్నప్పుడు నేరుగా టార్గెట్ చేయకుండా మొదట ఆ పరిసరాల్లో బాంబు వేసి భయపెట్టడం యుద్ధ తంత్రం. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అదే తంత్రాన్ని అనుసరిస్తున్నట్టుగా ఉంది.

ఆదిత్యుని సేవలో కొత్త కలెక్టర్

జిల్లా కలెక్టర్ నాగులాపల్లి శ్రీకాంత్ కుటుంబ సమేతంగా గురువారం అరసవల్లి శ్రీ సూర్యనారాయణస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు కలెక్టర్ దంపతులకు ప్రత్యేక పూజలు జరిపి పట్టువస్త్రాలు బహూకరించారు. జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శాఖలపై పట్టు సాధించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిన కలెక్టర్ తన ఆశయం త్వరగా నెరవేరడానికి దేవుని
ఆశీస్సులు కూడా అవసరమని భావించినట్టున్నారు.

Wednesday, March 5, 2008

ఇందిరమ్మ ఇళ్లపై అలసత్వం వద్దు: శ్రీకాంత్

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి అమలుచేస్తున్న ఇందిరమ్మ కార్యక్రమంపై సంబంధిత అధికారులు ఎలాంటి అలసత్వాన్ని ప్రదర్శించినా సహించేదిలేదని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ నాగులాపల్లి శ్రీకాంత్ పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా అధికారులు పనిచేసి మంచి ఫలితాలు సాధించేందుకు కృషిచేయాల్సి ఉందన్నారు. గత రెండు విడతల మాదిరిగానే మూడో విడత ఇందిరమ్మ కార్యక్రమాన్ని కూడా సమర్ధమంతంగా అమలుచేయాలని సూచించారు. ౩వ విడత ఇందిరమ్మ కార్యక్రమంపై ఎంపిక కమిటీ సభ్యులకు అవగాహన కలిగించేందుకు ఏర్పాటుచేసిన సదస్సులో కలెక్టర్ మాట్లాడుతూ ఈ విడత ప్రాధాన్యతలను వివరించారు.

జిల్లా యంత్రాంగంపై పట్టుకు శ్రీకాంత్ కృషి!

తనదైన శైలిలో జిల్లా యంత్రాంగంపై పట్టుసాధించేందుకు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ నాగులాపల్లి శ్రీకాంత్ ప్రయత్నిస్తున్నారు. ఉత్తరాంధ్రలో గతంలో వివిధ హోదాలలో పనిచేసిన ఆయన పొరుగున ఉన్న తూర్పు గోదావరి జిల్లా ప్రధాన కేంద్రమైన కాకినాడ వాస్తవ్యులని చాలా మందికి తెలియదు. గతంలో పాడేరు ఐ.టి.డి.ఎ. ప్రాజెక్ట్ అధికారిగా చేసిన ఆయన తర్వాత అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్ కందా వద్ద కీలక బాధ్యతలు నిర్వహించారు. తర్వాత ఆయన గోదావరి పుష్కరాల ప్రత్యేక అధికారిగా కూడా పనిచేసి తూర్పు గోదావరి పట్ల తన ప్రాంతీయ అభిమానాన్ని చాటుకున్నారు. కొద్ది రోజుల విరామం తర్వాత విశాఖపట్నం నగరపాలక సంస్థ కమిషనరుగా వచ్చిన శ్రీకాంత్ తన సత్తా ఏమిటో నిరూపించుకున్నారు. విశాఖ గ్రేటర్ స్వరూపానికి మారాక తొలి కమిషనరుగా పనిచేసిన ఘనత కూడా ఆయనకే దక్కింది. జి.వి.ఎం.సి. కమిషనరుగా శ్రీకాంత్ తన ప్రత్యేకతను చాటుకున్నట్టే ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా సారధిగా కూడా తానేమిటో రుజువుచేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టిన ఆయన గత పరిచయం ఉన్న అధికారులతో చర్చించారు.

Sunday, March 2, 2008

భూముల విక్రయాలపై విరుచుకుపడ్డ విపక్షాలు

ప్రభుత్వ భూముల విక్రయాలను నిరసిస్తూ విపక్షాలు ఆదివారం విశాఖపట్నం, హైదరాబాద్ నగరాల్లో ఆందోళన చేపట్టాయి.

Saturday, March 1, 2008

ఆంధ్రుల మధ్య వారధిగా తానా సేవలు

ఆంధ్రుల మధ్య వారధిగా తానా అవసరమైన వారికి సాయం, సేవలు కోరుకునే వారికి సహకారం, సహ సంస్థలతో భాగస్వామ్యంతో ముందుకు సాగే ప్రాతిపదికన ఉత్తర అమెరికాలోనూ, తమ మాతృభూమి ఆంధ్రలో అవసరమైన వారికి చేయూత అందించేలా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా సంస్థ ఏర్పాటైంది.ఉత్తర అమెరికాలో నివసించే తెలుగు సంతతి ప్రజలచే తెలుగు సంస్కృతి పరిరక్షణతో పాటు తెలుగు వారికి గుర్తింపు తీసుకువచ్చేలా లాభాపేక్ష రహితంగా ముప్పైయేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఈ సంఘం తానాగా ప్రాచుర్యం పొందింది.తెలుగు సాహిత్యం, విద్య, సామాజిక, ధర్మ నిరతి కార్యక్రమాల్లో ప్రవాసాంధ్రులు పాలు పంచుకునేలా ఈ సంఘం పలు వేదికలను నిర్వహిస్తోంది. సుమారు పదివేల మంది సభ్యులు కలిగిన ఈ సంఘం అమెరికాలోని అతి పెద్ద భారతీయ సంతతి సంఘాలలో ఒకటిగా గుర్తింపు పొందింది.తానా పత్రిక పేరిట ఈ సంఘంలో సభ్యులకోసం ఓ పక్షం పత్రికను కూడా ప్రచురిస్తోంది. తెలుగు మాట్లాడే వారు అధికంగా నివసిస్తున్న ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడంతో పాటు తుపాను, వరద భీభత్సం వంటి ప్రకృతి వైపరీత్య సమయాల్లో సహాయ చర్యలు చేపట్టేలా తానా ఫౌండేషన్‌ను ఈ సంఘం తరపున పూర్తి స్వయం ప్రతిపత్తితో ఏర్పాటు చేశారు.ప్రతి రెండేళ్లకోసారి జులై నాలుగో వారం చివర్లో నిర్వహించే ఉత్తర అమెరికా తెలుగు మహాసభలు, తానా యువజన మహా సభలు మంచి ప్రాచుర్యం పొందాయి. వీటికి ఆంధ్రనుంచి సైతం పెద్ద సంఖ్యలో ప్రముఖులు హాజరవుతున్నారు. ఆహార, ఆరోగ్య, నివాస సదుపాయాలు లేని వారికి సాయపడటం, తెలుగు విద్యార్థులు, ఏకాకిగా వస్తున్న తెలుగు సందర్శకులకు సాయం అందించడం, వృద్ధులు, వికలాంగులకోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం, తెలుగు సంస్కృతిని పరిరక్షించేలా యువతను ప్రోత్సహించడం చేస్తోంది.బాగా వెనుకబడిన, మారుమూల గ్రామాలకు సురక్షిత మంచినీరు, పారిశుద్ధ్య, రహదారి వసతులు కల్పించడం, వికలాంగులకు సాయం అందించడం, వారి వారి గ్రామాలకు సేవలు అందించేలా స్పాన్సర్లను ప్రోత్సహించడం, ఉత్తర అమెరికాలో చదివేలా పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించడం కూడా సంస్థ ముఖ్య కార్యకలాపాలుగా ఉన్నాయి.గ్రాడ్యుయేట్ స్కాలర్ షిప్పుల కింద ఆంధ్రలో నివసిస్తూ, త్వరలో అమెరికా రావాలనుకుంటున్న ఏడుగురు విద్యార్థులకు రెండు వేల డాలర్ల చొప్పున అందిస్తోంది. అలాగే యూత్ స్కాలర్ షిప్‌ల కింద ఉత్తర అమెరికాలో ఉన్నత కళాశాల విద్యను అభ్యసించగోరే ముగ్గురు విద్యార్థులకు 2వేల డాలర్ల చొప్పున అందించనుంది.ఈ సంఘంలో ప్రత్యక్షంగా తమకు లేక తమ కుటుంబానికి సభ్యత్వం కోరుకునే వారు జీవిత కాల రుసుంగా 125 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఏడాది కాలానికైతే 30 డాలర్లు చెల్లిస్తే సరిపోతుంది. అలా లేకుంటే దీనికి అనుబంధంగా ఉన్న స్థానిక సంఘాల ద్వారా సభ్యత్వం పొందవచ్చు.ఈ సంఘానికి సంబంధించిన వివరాల కోసం...ది ప్రెసిడెంట్, 17707, హిడన్ ట్రయల్ కోర్టు, స్ప్రింగ్, టెక్సాస్ 77378‌ను స్వయంగా కానీ లేక (713) 443 4047లో ఫోన్ ద్వారా కానీ president@tana.orgలో ఇమెయిల్ ద్వారా కానీ సంప్రదించ వచ్చు. ఇతర వివరాలను http://www.tana.org వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.

టూరిస్ట్ స్పాట్‌లలో జైపూర్‌కు ఏడో స్థానం

ఆసియాలోని అత్యంత ఆకర్షణీయమైన టూరిస్టు కేంద్రాలలో జైపూర్ ఏడో స్థానాన నిలిచింది. గులాబీ నగరంగా పిలిచే ఈ రాజస్థానీ రాజధాని అలనాటి రాజులు నిర్మించిన అందమైన ప్రాసాదాలతో అలంకారప్రాయమైన సంగతి తెలిసిందే.ఆ ప్రాభవాన్ని టూరిస్టులు బాగా గుర్తించారన్నందుకు ప్రతీకగా ఇటీవల కోండే నాస్ట్ ట్రావెలర్ మేగజైన్ నిర్వహించిన ఓ సర్వేలో ప్రముఖ నగరాలను సైతం వెనక్కు నెట్టి అది ఏడో స్థానాన్ని ఆక్రమించింది. ఈ జాబితాలో మరే ఇతర భారత నగరానికి చోటు దక్కకపోవడం గమనార్హం.ఈ సర్వే ప్రకారం...థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ 85.8శాతం ఓట్లతో అగ్రస్థానంలో నిలవగా, హాంకాంగ్ 80.4శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది. థాయ్‌లాండ్‌లోని మరో పురాతన నగరమైన చియాంగ్ మాయ్ 79.9శాతం ఓట్లతో మూడో స్థానంలోనూ, సింగపూర్ 78.8శాతం ఓట్లతో నాలుగో స్థానంలోనూ, జపాన్‌కు చెందిన క్యోటో 77.7శాతం ఓట్లతో ఐదో స్థానంలోనూ నిలిచాయి.అలాగే చైనాలోని రెండో అతిపెద్ద నగరమైన షాంఘై 76.5శాతం ఓట్లతో ఆరోస్థానంలో, జపాన్ రాజధాని టోక్యో 70.5 శాతం ఓట్లతో ఎనిమిదో స్థానంలోనూ, హనోయ్ 69.8శాతం ఓట్లతో తొమ్మిది, బీజింగ్ 67.3శాతం ఓట్లతో పదో స్థానాల్లోనూ నిలిచాయి.

పవన్ సిఎంపిఎఫ్‌కు అభిమానుల అంబులెన్స్

అన్నయ్య (చిరంజీవి) కుమార్తె శ్రీజ ప్రేమ వివాహం నేపథ్యంలో నటుడు పవన్ కల్యాణ్ స్థాపించిన కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ (సిఎంపిఎఫ్‌)కు ఆయన అభిమానులు ఓ అంబులెన్స్‌ను విరాళంగా అందించి తమ ప్రియతమ అభిమాన నటుడిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.అదే విధంగా పవన్ స్థాపించిన సిఎంపిఎఫ్‌కు సైతం ఆది నుంచి చక్కటి స్పందన లభిస్తోంది. నగదు రూపంలో విరాళాలిచ్చేందుకు దాతలు సైతం ముందుకొస్తున్నారు. ఇక అభిమానులైతే చెప్పనక్కరలేదు. తమ యధాశక్తి సగటు వ్యక్తి సంక్షేమానికి చేయాల్సిన మంచి పనులు చేస్తున్నారు.కర్నూలు జిల్లాలోని నంద్యాలకి చెందిన ముగ్గురు వ్యక్తులు తమ పరిసర గ్రామాల్లోని ప్రజల కోసం సిఎంపిఎఫ్‌కు అంబులెన్స్‌ను విరాళంగా అందించారు.

నేత్ర దానానికి కోల్‌కతా సెక్స్ వర్కర్ల ప్రమాణం

కోల్‌కతా సెక్స్ వర్కర్లు తమ కళ్లను దానం చేస్తామని ప్రమాణం చేశారు. శివుడికి భక్త కన్నప్ప కన్ను బహూకరించిన పురాణగాథ స్ఫూర్తితో తమ కళ్లను దానం చేయాలని సెక్స్‌వర్కర్లు నిర్ణయించారని దర్బార్ మహిళా సమన్వయ కమిటీ నాయకురాలు మహాశ్వేత ముఖర్జీ తెలిపారు.నేత్ర దానం ద్వారా మరో జీవితం లభిస్తుందన్న నమ్మకంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. మొత్తం 170మంది సెక్స్ వర్కర్లు తమ కళ్లను దానం చేస్తామని ప్రతిజ్ఞ చేయడానికి ఆసక్తి చూపారని మహాశ్వేత తెలిపారు.నేత్ర దానం చేయడం ద్వారా తమ కళ్లతో వేరొకరు ప్రపంచాన్ని చూస్తారని వారి ద్వారా తాము జీవితాన్ని కొనసాగిస్తామని ఓ సెక్స్ వర్కర్ చెప్పింది. చూపులేని వాళ్లు ఎన్ని కష్టాలు పడుతున్నారో మనం రోజూ చూస్తున్నామని అందుకే వారికి ఎంతో కొంత సాయం చేయాలని భావిస్తున్నట్టు ఆమె చెప్పారు.

హద్దులు దాటే డేటింగ్‌తో తస్మాత్ జాగ్రత్త

కాలానుగుణంగా వస్తున్న మార్పులకు తగ్గట్టు మనల్ని మనం మార్చుకోకుంటే సమాజంలో బాగా వెనుకబడిపోతామన్నది అంగీకరించదగ్గ విషయమే. అయినప్పటికీ దానికీ కొన్ని హద్దులు ఉంటాయని తెలుసుకోకుంటే మాత్రం ప్రమాదంలో పడకతప్పదు.పాశ్చాత్య దేశాలకు సరిపోతున్న కొన్ని సంప్రదాయాలు భారతీయ సంస్కృతి విలువల పరిరక్షణకు ఏమాత్రం తగదనే విషయాన్ని పిల్లలే కాక వారి తల్లి దండ్రులు కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం భారతీయ నగర ప్రాంతాల్లో ఈ సంస్కృతి రోజురోజుకూ విస్తరిస్తుండటం ప్రమాదకర సంకేతాల్నిఇస్తోంది.పెళ్లికి ముందు వధూవరులు ఒకరిపై ఒకరు పరస్పర అవగాహన తెచ్చుకునేందుకోస మని పాశ్చాత్య దేశాల్లో ప్రారంభమైన ఈ సంస్కృతి క్రమంగా అడ్డ దారులు తొక్కుతోంది. యువతీ, యువకులు ఒకే బైక్‌లో కలసి తిరగడం, సినిమాలు, షికార్లకు వెళ్లడం, ఒంటరిగా బస చేయడం వంటివన్నీ షరా మామూలై పోతున్నాయి.సినిమాల ప్రభావం కూడా దీనిపై కొంత ఉన్నప్పటికీ, సినిమాలలో చేసేవన్నీ నిజ జీవితానికి సరిపోవన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితి యువకుల కన్నా యువతులకే అధిక ప్రమాదకరమన్న విషయాన్ని కూడా తెలుసుకోవాలి.ఇప్పటివరకు కళాశాలల స్థాయిలో కొనసాగిన ఈ సంస్కృతి ప్రస్తుతం పాఠశాల స్థాయికి కూడా పాకిందంటే ఎంతటి స్థాయిలో అది విస్తరిస్తోందే అర్థం చేసుకోవచ్చు. కొందరికే ఈ డేటింగ్ సంస్కృతి పరిమితమైనప్పటికీ దీని ప్రభావం అందరిపైనా పడగలదు. ఈ కారణంగా చదువుకున్న అమ్మాయిలపై విశ్వాసం సన్నగిల్లే ప్రమాదముంది.ఇప్పటివరకు చదువుకున్న యువతులను పెళ్లాడేందుకు మొగ్గు చూపుతున్న యువకులు భవిష్యత్తులో ఈ డేటింగ్ సంప్రదాయానికి భయపడి నిరక్షరాస్యులే కావాలనుకునే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. వారి స్వీయానుభవాలు, చుట్టూ కన్పించే పరిస్థితులు వారిని ఈ పరిస్థితుల్లోకి నెట్టవచ్చు.ఈ డేటింగ్ కారణంగా చదువుకునే సమయాన్ని వృథా చేసుకోవడంతో పాటు జీవిత గమనాన్ని కూడా సరైన రీతిలో నడిపించలేని పరిస్థితి ఏర్పడగలదు.యువతీ, యువకుల మధ్య స్నేహం తప్పు కాదు కానీ స్నేహం పేరుతో హద్దు మీరే డేటింగ్ కార్యకలాపాలు సాగించడం మాత్రం మంచిది కాదు.తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో తమను ఉన్నత చదువులకు పంపుతున్నారన్న విషయాన్ని గుర్తెరిగితే ఇలాంటి అడ్డదారులు కన్పించవు. ఈ విషయంలో తల్లిదండ్రులు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కాకా ఎప్పటికపుడు తమ పిల్లల ప్రవర్తనను ఓ కంట కనిపెడుతూ ఉండాలి.

అది కూడా ఉంటేనే ఆరోగ్యం పదిలం

మనం చాలా తేలిగ్గా తీసుకునే సెక్స్ ఆరోగ్య ప్రదాయినిగా కూడా ఉంటుందన్న విషయాన్ని అంగీకరించాల్సిందేనంటున్నారు దానిపై ప్రత్యేకంగా అధ్యయనం జరిపిన బ్రిటన్ పరిశోధకులు.మనిషి ఎక్కువ కాలం జీవించాలంటే సెక్స్ అధికంగా ఉండాలనే విషయాన్ని వారు గణాంకాల సహితంగా చెబుతున్నారు. ఒంటరిగా నివసించే వారికన్నా జీవిత భాగస్వాములతో నివసించే వారే అధిక కాలం జీవించగలుగుతున్నారని చెబుతున్నారు.దురలవాట్లకు దూరంగా ఉండటం, బరువు తగ్గడం, ఆహారం పరిమితంగా తినడం, వ్యాయామం చేస్తూ రావడం, కట్టుబాట్లతో జీవించడం వంటి కఠిన నియమాలను పాటించడం కన్నా పెళ్లి చేసుకుని హాయిగా ఉంటే అధిక కాలం జీవించవచ్చునని వారు చెబుతున్నారు.వైవాహిక జీవితం వల్ల వారు మాత్రమే కాక వారి భార్యాపిల్లలు కూడా సుదీర్ఘ కాలం జీవించే అవకాశాలున్నాయని తమ అధ్యయనంలో తేలిందని ఆ బృందానికి నాయకత్వం వహించిన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ మైక్ మర్ఫీ తెలిపారు.ఆ బృందం అందించిన అధ్యయన వివరాలను ద టైమ్స్ పత్రిక ప్రచురించింది. విడాకులు పొందిన, జీవితభాగస్వామి చనిపోయిన, ఒంటరిగా జీవిస్తున్న, పెళ్లి కాకుండా కలిసి ఉంటున్న వారితో పోలిస్తే వివాహితులైన జంట ఎక్కువకాలం జీవిస్తుంది.వారి ఆర్యోగం చక్కగా ఉండటంతో పాటు వృద్ధాప్యంలో సైతం ఈ జంటకు మరింత గృహ సంరక్షణ అందుతుంది. వీరికి పుట్టిన పిల్లలు కూడా చక్కటి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. ఆర్థిక పరిస్థితి ఎలాగున్నా వారి పిల్లలు చదువులపై దృష్టిపెట్టే అవకాశం ఉంటుంది.భార్యలు చనిపోయిన పురుషులు, ఒంటరిగా జీవించే మహిళలు తీవ్రమైన, దీర్ఘకాలికమైన అనారోగ్యం బారిన పడేందుకు అధికంగా ఆస్కారం ఉందని తెలిపింది.ఒంటరిగా జీవించే 34 ఏళ్లలోపు పురుషుల్లో మరణాలు వారికంటే తక్కువ వయసులో వివాహం చేసుకున్న వారితో పోలిస్తే రెండున్నర రెట్లు అధికంగా ఉన్నట్టు తేలిందని చెప్పింది.ఎనిమిది పదులు దాటిన వృద్ధుల్లో వివాహితులతో పోలిస్తే భార్య చనిపోయిన లేదా విడిపోయిన వారి మరణాలు 33 శాతం ఎక్కువగా ఉందని తెలిపింది.భర్త చనిపోవడం లేక వైవాహిక జీవితానికి దూరంగా ఒంటరిగా నివసించే మహిళల్లోనూ వివాహితుల కంటే చాలా ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయని వెల్లడించింది.

ఇంటిలోనే ప్రాథమిక చికిత్స కోసం

ఎవరికి ఎపుడు ఏ తరహా ప్రమాదం జరుగుతుందో తెలియదు. పెద్ద ప్రమాదాలయితే వైద్యుల వద్దకు వెళతాం కానీ ఇంటిలో కత్తి లేక బ్లేడుతో అకస్మాత్తుగా కోసుకోవడం, నిప్పు చేతిపై పడి కాలిపోవడం వంటివి జరిగితే పెద్దగా పట్టించుకోం. అదే కొద్ది రోజులకు పెద్దవై మనల్ని పలు రకాలుగా బాధిస్తుంది.ఇలా జరిగే సమయంలో కాస్త పౌడర్ చల్లుకోవడం, పసుపు రాసుకోవడమో, తడి వస్త్రాన్ని చేతికి చుట్టుకోవడమో చేస్తాం కానీ ఇంటిలోనే ప్రాథమిక చికిత్స చేసుకునేలా ఓ ఫస్ట్ ఎయిడ్‌కిట్ ఉంటే ఎంతమంచిదో ఆలోచించండి.జాయింట్లు, పాదాలు, చేతులకు చుట్టుకునే క్రేప్‌బ్యాండేజీలు, కాటన్‌బ్యాండేజీలు (వివిధ సైజులు), కాటన్‌రోల్ (గాయాలను శుభ్రం చేసేందుకు), ప్లాస్టర్ రోల్ (చిన్న చిన్న దెబ్బలకోసం చుట్టేవి), రెండు కత్తెర్లు, హ్యాండ్‌వాష్ సొల్యూషన్, యాంటీ సెప్టిక్‌లోషన్ వంటివి తప్పనిసరిగా ఉండాలి.అలాగే కొన్ని మంచి పెయిన్‌కిల్లర్స్, ఓ చిన్నగ్లూకోజు ప్యాకెట్, అయోడెక్స్ వంటి బెణుకులకు తక్షణ ఉపశమనం ఇచ్చే బామ్‌, ఓ చిన్న స్పూన్, .థర్మామీటర్‌ మీ మెడికల్‌కిట్‌లో ఉంటే మీరు దేనికీ కంగారుపడాల్సిన అవసరంఉండదు.

తప్పులకు కూడా మనదే బాధ్యత

మంచి జరిగితే అంతా మా గొప్పలేనని చెప్పుకునే మనం తప్పు జరిగితే మాత్రం దాంతో తమకేమీ సంబంధం లేనట్టు తప్పించుకుంటుంటాం. సహజంగా ఆ తప్పులను ఇతరులపైకి నెట్టేసి, తమకేమీ తెలియనట్టు వ్యవహరిస్తుంటాం. అయితే ఏది జరిగినా పూర్తిగా తమదే బాధ్యత అని అంగీకరించిన నాడు మనలోని వ్యక్తిత్వం పరిపూర్ణం కాగలదన్న విషయాన్ని అందరూ ఒప్పుకుని తీరాల్సిందే. మనలోని అహం అందుకు కొంత అడ్డు తగులుతున్నప్పటికీ, వ్యక్తిత్వాన్ని నిరూపించుకునేందుకై దానిని సైతం అధిగమించాల్సి ఉంది. దీనికి ఓ కథను కూడా ఉదాహరణగా చెబుతున్నారు. పూర్వం విఠలాపురంలో రామలింగం నివసిస్తుండే వాడు. మహా పిసినారి అయిన అతను తన వద్దకు సాయం కోసం ఎవరొచ్చినా నిర్దయతో తిప్పిపంపే వాడు. అయితే అదే సమయంలో డబ్బు అంటే మహా పిచ్చి కలిగిన అతను అన్నిరకాల సంపాదన మార్గాల్ని వెతుకుతూ వచ్చాడు. అందులో భాగంగా తమ ఇంటి ముందు ఉన్న కొద్ది పాటి ఖాళీ స్థలంలో ఓ అందమైన పూల తోట వేశాడు. అతని అదృష్టం కొద్దీ ఆ తోట మంచి ఫలితాన్ని ఇవ్వడం ప్రారంభించింది. అయితే అనుకోకుండా ఓ రోజు అటువైపుగా వచ్చిన ఓ పశువు ఆ తోటలోకి అనుకోకుండా వెళ్లి కొన్ని మొక్కలను నాశనం చేసింది. వెంటనే కోపం కట్టలు తెంచుకున్న రామలింగయ్య దానిపై దాడి చేసి, కొట్టసాగాడు. అతని దెబ్బలు భరించలేక ఆ పశువు అక్కడే చనిపోగా, అతనికి గో హత్యా పాపం చుట్టుకుంది. అక్కడి నుంచి వరుసగా నష్టాలు రావడం ప్రారంభించడంతో చేసేది లేక దేవాలయాల చుట్టూ తిరగసాగాడు. ఓ రోజు పరమేశ్వరుడు అతని భక్తికి మెచ్చి కలలోకి వచ్చాడు. గో హత్యా పాపం నుంచి విముక్తి కోసం వంద పశువులను నెలరోజుల పాటు పోషించాలని సూచించాడు. అయితే మహా పిసిని గొట్టు అయిన రామలింగయ్యకు అదేదీ నచ్చలేదు. తానే తప్పు చేయకనే తనకెందుకు ఈ శిక్ష అని భగవంతుని కోరాడు. పశువును తాను చేతితో కూడా తాకలేదని, అసలు పాపమంతా దానికి దెబ్బతగిలేలా చేసిన కర్రదేనని వాదించాడు. దీనిని అతనికి సరైన పద్దతిలో వివరించాలనుకున్న పరమేశ్వరుడు అప్పటికి మౌనంగా ఊరుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత రామలింగయ్య ఇంటికి ఓ సాధ్వి వచ్చాడు. దోష నివారణ మార్గం అన్వేషిస్తున్న రామలింగయ్య ఆయనను సాదరంగా ఆహ్వానించాడు. ఇంటి ముందున్న పూదోటను చూడగానే ఆ సాధ్వి మొహంలో కొంత తేజస్సు కనిపించింది. ఎవరయ్యా ఇంత అందమైన తోటను ఏర్పాటు చేసింది అని రామలింగయ్యను ప్రశ్నించాడు. ఆయన వద్ద మెప్పు పొందాలనుకున్న రామలింగయ్య అంతా తన కృషేనని గొప్పగా చెప్పుకొచ్చాడు. ఇదే సమయమునుకున్న సాధ్వి ఇంత అందమైన తోట ఏర్పాటు పూర్తిగా నీ కృషి ఫలితమేనని చెప్పుకుంటున్న నీవు ఆ రోజు పశువుపై దాడికి మాత్రం కారణం కాదని ఎందుకు వాదిస్తున్నావు. సాధ్వి నుంచి ఈ ప్రశ్నను ఊహించని రామలింగయ్య తర్వాత తన వద్దకు స్వయంగా పరమేశ్వరుడే వచ్చి ఉపదేశించాడని తెలుసుకుని, తన పద్ధతులు మార్చుకున్నాడు. కాబట్టి గొప్పలు చెప్పుకుంటూ తప్పులను మాత్రమే ఇతరులపైకి నెట్టే పద్ధతి మానుకుంటే మనలోని వ్యక్తిత్వానికి పరిపూర్ణత చేకూరగలదు.

వినాయకుడి పదహారు రూపాలు

దేవతల మధ్య మొదటి పూజ వినాయకుడిదేనన్నది అందరికీ తెలిసిందే. అయితే ఆయన కూడా పదహారు వేర్వేరు రూపాల్లో దర్శనమిస్తున్నాడు. చూసేందుకు పెద్దగా తేడా తెలియనప్పటికీ, శ్రద్ధగా చూస్తే ఆయన వేర్వేరు రూపాలను తెలుసుకోవడం పెద్ద కష్టం కాబోదు.అరటి పండు, మావిడి పండు, పనస పండు, చెరకులను నాలుగు చేతులలో కలిగినట్టు కన్పించే రూపాన్ని బాలగణపతిగా తెలుసుకోవచ్చు. అలాగే ఎనిమిది చేతులు కలిగి ఓ చేతిలో తాడు, చెరకు, వరి కంకి, తదితరాలను కలిగి ప్రకాశవంతంగా వెలిగే రూపాన్ని తరుణ గణపతి అంటారు.టెంకాయ, మావిడి పండు, అరటి పండు, బెల్లంతో చేసిన పాయసం కలిగిన పాత్రను నాలుగు చేతులలో కలిగిన రూపాన్ని భక్త గణపతి అంటారు. శూలం, బాణం, ధనస్సు, చక్రాయుధం తదితర ఆయుధాలని ఎనిమిది చేతుల్లో కలిగిన రూపాన్ని వీర గణపతిగా తెలుసుకోవచ్చు.పచ్చ రంగు దేవిని తాకినట్టు కన్పించే రూపాన్ని శక్తి గణపతిగా చెప్పవచ్చు. పుస్తకం, రుద్రాక్ష దండ, కమండలం కలిగి నాలుగు ముఖాలతో కన్పించే రూపాన్ని ద్విజ గణపతిగా తెలుసుకోవచ్చు.మావిడి పళ్లు, పూల మొక్కలు చేతిలో కలిగి శ్రీ సమృద్ధి దేవితో కలసి దర్శనమిచ్చే రూపాన్ని సిద్ధి గణపతిగా చెప్పవచ్చు. దానిమ్మ పండు, వీణ, వరి కంకి, రుద్రాక్షమాలలతో ఆరు చేతులు కలిగి దర్శనమిచ్చే రూపాన్ని ఉచ్ఛిష్ట గణపతిగా తెలుసుకోవాలి.పన్నెం డు చేతులతో బంగారు వర్ణంలో కన్పిస్తూ ఆయుధాలతో దర్శనమిచ్చే రూపాన్ని విఘ్నరాజ గణపతిగా సంబోధిస్తారు. నాలుగు చేతులతో రత్నాలు పొదిగిన బంగారు బిందెను తొండెంతో పట్టుకున్నట్టు కన్పించే రూపాన్ని శ్రీప్ర గణపతిగా పిలుస్తారు.అలాగే పది చేతులు కలిగి సింహంపై ఆశీనుడై కన్పించే రూపాన్ని హే రంభ గణపతిగా తెలుసుకోవచ్చు. చిలక, దానిమ్మ, జంట బిందెలు, దారం, కత్తి తదితరాలతో సిద్ధి, బుద్ధిలతో దర్శనమిచ్చే రూపాన్ని లక్ష్మీ గణపతిగా సంబోధిస్తారు.పది చేతులు కలిగి, దానిమ్మ పండు, చెరకు, కలువ పుష్పం, వరి కంకి, ధనస్సులను చేతుల్లో ధరించి, వడిలో దేవిని కూర్చోబెట్టిన రీతిలో కన్పించే రూపాన్ని మహా గణపతిగా పిలుస్తారు. అలాగే మాషిక వాహనంపై ఆశీనుడై దారం, పలుగు, దంతం, మావిడి పళ్లను చేతిలో పెట్టుకుని కన్పించే రూపాన్ని విజయ గణపతిగా భావిస్తారు.ఐదు చేతులలో ఆయుధాలు కలిగినట్టు కన్పించే రూపాన్ని నిరుద్ధ గణపతిగా, ఎనిమిది చేతులు కలిగి నీలోత్పలం, వరి కంకి, కమలం, చెరకు, ధనస్సు, కథ, పొడవాటి దంతంలను ధరించినట్టు కన్పించే రూపాన్ని ఊర్ధ్వ గణపతిగా చెప్పవచ్చు.

భగవంతుని అనుగ్రహంలో హారతి ప్రత్యేకతలు

భగవంతుడి అనుగ్రహం కోసం ఎదురు చూస్తున్న భక్తులు ఆయనకు అందించే పదహారు రకాల ఉపచారాలలో హారతి అతి ముఖ్యమైంది. దీపారాధనగా కూడా పిలిచే ఈ హారతి లేకుండా ఏ పూజ కూడా పూర్తయినట్టు అన్పించదు. అయితే ఇందులోనూ ఎన్నో పద్ధతులున్నాయన్న విషయం చాలా మందికి తెలియదు.గుడిలో పూజారి దేవుడికి అందించే హారతిని పరిశీలిస్తే ఒక్కో సమయంలో ఒక్కో రీతిలో ఉండటాన్ని తెలుసుకోవచ్చు. సందర్భోచితంగా వారు ఆ హారతిని సంప్రదాయ బద్ధంగా అందిస్తారు. వీటిని పూర్తిగా కాకున్నా కొంతమేరకైనా మనం తెలుసుకోగలిగితే భగవంతుని ప్రసన్నానికి మరింత చేరువ కాగలం.నక్షత్ర దీప హారతి అందిస్తే నక్షత్రాలు దైవ ప్రార్థనతో కాంతివంతమవుతాయని అర్థం. తొమ్మిది జ్యోతులతో కూడిన హారతి నవశక్తులను సూచిస్తుంది. ఏడు జ్యోతులతో కూడిన హారతి సప్త మాతలను తెలుపుతుంది.ఐదు జ్యోతులతో కూడిన హారతి నివార్తి కళ, విద్యా కళ, ప్రతిష్ఠ కళ, శాంతి కళ, శాంతి అతీత కళలనే పంచ కళలను సూచిస్తుంది. మూడు జ్యోతులతో కూడిన హారతి సూర్య, చంద్ర, అగ్ని దేవులను, ఏక జ్యోతి హారతి సరస్వతీ దేవిని సూచిస్తాయి.హారతి ఇచ్చే సమయంలో చివరగా అందించే కుంభ హారతి సదాశివ తత్వాన్ని సూచిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. సాధారణంగా దీప హారతిని మూడు సార్లు తిప్పుతుంటారు.మొదటి పర్యాయం ప్రపంచ శాంతి కోసం, రెండో పర్యాయం గ్రామ ప్రజల శ్రేయస్సు కోసం, మూడో పర్యాయం పంచభూతాలతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి జరగాలని కోరుతూ ఈ హారతులిస్తుంటారు.

భారత్‌లో విలువైన పెట్టుబడులు

భారత్‌లో ప్రస్తుతం అత్యుత్తమ పెట్టుబడి అంటే ఓ స్థలాన్ని కొని పడేయటమేనని చెప్పవచ్చు। భారత్‌లో పుట్టి, పెరిగి విదేశాల్లో ఇంటర్నెట్ వెబ్‌సైట్, ఐటీ, మెడిసిన్, రిసెర్చ్ తదితర రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులు స్వదేశంలో ఉన్న తమ కుటుంబ సభ్యులకోసం ప్రతినెలా డబ్బు పంపిస్తున్నారు.తద్వారా ప్రభుత్వానికి సైతం మంచి రాబడి లభిస్తోంది. అయితే వాటిని సరైన రీతిలో పెట్టుబడిగా పెట్టే విషయంలో వారి కుటుంబసభ్యుల మధ్య అనుమానాలు నెలకొంటున్నాయి.ఇదివరలో ఆభరణాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై పెట్టుబడులు పెట్టేవారు. అయితే ప్రస్తుతం దానికి బదులు స్థలాల కొనుగోలుపై దృష్టి సారిస్తున్నారు. రోజురోజుకు భూమి విలువ భారీగా పెరుగుతుండటమే ఇందుకు కారణం.అయితే ఇలా పెట్టుబడులు పెట్టదలచుకునే వారికి ఉపయోగపడేలా పలు వెబ్‌సైట్లు ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వాటి గురించి ఓ సారి గుర్తు చేసుకునే ఉద్ధేశ్యంతోనే ఈ కింది వెబ్‌సైట్ వివరాలను అందిస్తున్నాం.
1. http://www.indiaproperties.com/2. http://www.indiahousing.com/3. http://www.indiahousing.com/real-estate-agents/4. http://www.zameen-zaidad.com/5. http://www.premisesindia.com/6. http://www.axiomestates.com/7. http://www.mumbaipropertyexchange.com/8. http://www.indianground.com/9. http://www.aakarshna.com/10. http://www.vakilhousing.com/

బీమా పాలసీలలో పలు రకరకాలు

బీమా పాలసీలు తీసుకునే ముందు వాటిలో తేడా గురించి చక్కగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎండోమెంట్, హోల్‌లైఫ్, మనీబ్యాక్, పెన్షన్, టెర్మ్, మార్కెట్ ప్లస్ పాలసీలు అంటూ అవి పలు రకాలుగా ఉన్నాయి.మన అవసరాల్ని గుర్తెరిగి అందుకు తగ్గట్టు పాలసీలు తీసుకుంటే భవిష్యత్తులో పొరబాటు చేశామేమోనన్న ఆందోళన కలగదు. ప్రస్తుతం ప్రధాన పాలసీల మధ్య ఉన్న తేడా తెలుసుకుందాం.టెర్మ్ పాలసీమరణం సందర్భంలో మాత్రమే పాలసీదారుని నామినీలకు సొమ్ము అందుతుంది. బీమాను ఆర్థిక రక్షణ కోసమేనని భావించే వారికి ఇది చక్కటి పాలసీ. అతి తక్కువ ప్రీమియంతో జీవిత బీమా సదుపాయం అందుకోవచ్చు.కుటుంబ యజమాని మరణించిన సమయంలో వారి కుటుంబానికి ఆసరా ఇచ్చే పాలసీగా దీనిని చెప్పవచ్చు.ఎండోమెంట్ పాలసీలుపాలసీ గడువు తీరిన తరువాత లేక పాలసీదారుడు మరణించిన సమయంలో వారి కుటుంబానికి నిర్ధారిత పరిహారం అందించే పాలసీగా దీనిని చెప్పవచ్చు. నిర్ధారిత కాలం తరువాత పాలసీపై లోన్ తీసుకునే అవకాశం పొందవచ్చు.నెల జీతం తీసుకునే ఉద్యోగులు, స్థిర ఆదాయం పొందే వ్యాపారులు, పెట్టుబడి పెట్టే వారు, చిన్న పిల్లలున్న వారికి ఇది అనువైన పాలసీ. బీమా సొమ్ముకు అదనంగా బోనస్ కూడా చెల్లిస్తున్నారు.మనీబ్యాక్ పాలసీనిర్ధారిత కాల వ్యవధిలో దశల వారీగా సొమ్ము అందించే పాలసీ ఇది. దురదృష్టవశాత్తూ పాలసీదారుడు గడువుకు ముందుగానే మరణిస్తే పాలసీ మొత్తంతో పాటూ అప్పటివరకూ జమ అయిన బోనస్‌ను కూడా పొందవచ్చు. నిర్ధారిత కాల వ్యవధిలో సొమ్ము కావాలనుకుంటున్న వారికి ఇది చక్కటి పాలసీ.పెన్షన్ పాలసీప్రావిడెంట్ ఫండ్ తరహాలో కొన్నాళ్లు లేదా ఏకమొత్తంలో సొమ్ము జమచేస్తే నిర్ధారిత వయసు తరువాత ప్రతినెలా పెన్షన్ అందించే పథకంగా ఈ పాలసీలను చెప్పవచ్చు.జీవిత బీమా రక్షణ లేకుండా కూడా ఈ పాలసీలు తీసుకోవచ్చు. ప్రీమియం ఆధారంగా నెలవారీ సొమ్ము అందుకోవచ్చు. ప్రీమియం సరిగ్గా చెల్లించేవారికి లాయల్టీ అడిషన్ రూపంలో మరి కొంత సొమ్ము అదనంగా అందగలదు.మార్కెట్ ప్లస్ఇటీవలి కాలంలో ఈ పాలసీకి మంచి డిమాండ్ కన్పిస్తోంది. స్టాక్ మార్కెట్ ఊపందుకుంటున్న నేపథ్యంలో ఈ పాలసీని చక్కటి పెట్టుబడి వనరుగా ఎంచుకోవచ్చు.

ఎంఎంటీఎస్ స్టేషన్లలోనూ రిజర్వేషన్ సదుపాయం

ఇకపై సికింద్రాబాద్‌ నగరంలోని 12ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్లలోనూ రిజర్వేషన్ ద్వారా టికెట్లు పొందే సదుపాయాన్ని రైల్వే యంత్రాంగం సిద్దం చేసింది.ఈ సదుపాయం ఈ నెల 15 నుంచి అమల్లోకి రానుంది.చందానగర్,హైటెక్ సిటీ,నేచర్ క్యూర్ ఆసుపత్రి,సంజీవయ్య పార్కు,జేమ్స్ స్ట్రీట్,ఖైరతాబాద్, నెక్లెస్‌రోడ్,లక్డీకాపూల్,సీతాఫల్‌మండి,ఆర్ట్స్‌కాలేజీ,జామే ఉస్మానియా,విద్యానగర్ ప్రాంతాల్లోని ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్లలో ఈ సదుపాయాన్ని ప్రారంభించనున్నారు. ఈ కేంద్రాలు ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తాయి.ప్రస్తుతం నగరంలోని 13 ప్రాంతాల్లో ఉన్న రిజర్వేషన్ కేంద్రాల్లో టిక్కెట్లు అందజేస్తున్నారు. తాజాగా ఎంపిక చేసిన ఎంఎంటీఎస్ స్టేషన్లలో కూడా ఈ సదుపాయం కల్పించనున్నారు. ఇక్కడ దేశవ్యాప్తంగా ఏ ప్రాంతానికైనా టిక్కెట్లు లభిస్తాయి.

జనన, మరణ ధ్రువపత్రాల జారీ ఇక వేగవంతం

హైదరాబాద్ మహానగరంగా (గ్రేటర్‌గా)విస్తరించిన నేపథ్యంలో ఇప్పటివరకు ఏఎంఓహెచ్‌ల పరిధిలో ఉన్న జనన మరణ ధ్రువపత్రాల జారీ అధికారాలను సర్కిళ్ల ఉప కమిషనర్ల (డిప్యూటీ కమిషనర్స్)కు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజా ఉత్తర్వులను జారీ చేసింది.జనన మరణాల ధ్రువీకరణ పత్రాలను జారీ చేసే అధికారం ఇప్పటివరకు సహాయ వైద్యారోగ్య అధికారులకు(ఎఎంవోహెచ్) మాత్రమే ఉంది. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉపకమిషనర్లకూ ఆ అధికారులు సంక్రమించాయి.గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు నేపథ్యంలో నగరాన్ని 18 సర్కిళ్లుగా విభజించారు. ఒక్కో సర్కిల్‌కు ఒక డిప్యూటీ కమిషనర్‌ను నియమించారు. అలాగే ఇన్నాళ్లు హైదరాబాద్ నగర అభివృద్ధి సంస్థ(హుడా) చేతుల్లో ఉన్న శివారు ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణ అనుమతులు ఇటీవలే గ్రేటర్‌కు ప్రభుత్వం బదలాయించిన సంగతి విదితమే.గ్రేటర్ హైదరాబాద్ అంతటికీ ఇకపై జనన మరణాల రిజిస్ట్రార్ ఒక్కరే ఉంటారు.ఇప్పటి వరకు రంగారెడ్డి,హైదరాబాద్ జిల్లాలకు వేర్వేరు రిజిస్ట్రార్లు ఉన్న సంగతి తెలిసిందే. శివారునున్న 12 మున్సిపాలిటీలు గ్రేటర్‌లో విలీనమైన నేపథ్యంలో ఆ ప్రాంతాలను కలుపుకొని మొత్తానికి ఇకపై ఒకే రిజిస్ట్రార్ ఉంటారు.

మహిళా మత్స్యకారుల కోసం 'మత్స్య మిత్ర'

రాష్ట్రంలోని మహిళా మత్స్యకారుల కోసం త్వరలో 'మత్స్యమిత్ర' పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్టు మంత్రి మండలి బుద్ధప్రసాద్ ప్రకటించారు. మహిళా మత్స్య సంఘాలకు ఈ పథకం కింద పావలా వడ్డీకి లక్ష రూపాయల చొప్పున రివాల్వింగ్ ఫండ్‌ను మంజూరు చేయనున్నట్టు చెప్పారు. అలాగే సముద్రంలో వేటాడే మత్స్యకారుల కోసం ముఖ్యమంత్రి రూ.75 కోట్లతో పలు సంక్షేమ పథకాలు అమలు చేయనున్నట్టు బుద్ధప్రసాద్ తెలిపారు.సముద్రంలో వేటాడే సంప్రదాయక మత్స్యకారులు అన్ని రకాల తెప్పలు, బోట్లను రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. యాంత్రిక బోట్లకు డీజిల్ ఆయిల్‌పై ఇస్తున్న రెండు కోట్ల 40 లక్షల రూపాయల సబ్సిడీకి అదనంగా ఈ ఏడాది మరో 98 లక్షలు ఇవ్వనున్నట్టు తెలిపారు.

వేమన శతకం- ఆరోభాగం

భోగంబుల కాశింపకరాగద్వేషంబు రంగుడదమలోవేగమె మోక్ష పదంబునురాగను నాతండు యోగిరాయుడు వేమా!సుఖ భోగాలు ఆశించకుండా, రాగ ద్వేషాదులను విడిచిపెట్టిన వానికి అతి త్వరగా మోక్ష ప్రాప్తి సిద్ధించును. అతడినే యోగీశ్వరుడని చెప్పుదురని తెలుసుకో.చనువారెల్లను జనులంజనిపోయిన వారి పుణ్య సత్కథలెల్లన్వినవలె గనవలె మనవలెనని మషులకు దెలుసగూడ దంత్యము వేమా!చనిపోయిన మహనీయుల చరిత్రలను శ్రద్ధగా విని, వారి మార్గమునే మోక్ష ప్రాప్తికి ప్రయత్నించాలి. తయ యంత్యములను గూర్చి ఎవ్వరికిని తెలుపరాదు.ఆశయనెడి త్రాళ్ళ నఖిల జనంబులుకట్టుపడుచు ముక్తిగానరైరిజ్ఞానఖడ్గమునను ఖండింప రాదొకోవిశ్వదాభిరామ వినురవేమా!ఆశలు, కోరికలతో బంధితులైన ప్రజలు మోక్షాన్ని పొందలేకపోతున్నారు. జ్ఞానమనే ఖడ్గంతో మాత్రమే ఈ కోర్కెలను, ఆశలను అణచివేయగలమని తెలుసుకో.అతిథి రాక చూచి యదలించి పడవైచికఠిన చితులగుచు గానలేరుకర్మమునకు ముందు ధర్మము గానరోవిశ్వదాభిరామ వినురవేమా!అతిథి ఇంటికి రాగానే అతనిని కోపంతో వెళ్లి పొమ్మని చెప్పిన కఠినాత్ములు ధర్మమును గుర్తించని వారే కాగలరు. ధర్మము చేసిననే కర్మములు నశించగలవని తెలుసుకో.తను వలచిన దావలచును తనువలవక యున్ననెనడు తావలవ డిలన్తనదు పటాటోపంబులు తనమాయలు పనికిరావు ధరలోన వేమా!తాను ఇతరులను ప్రేమిస్తే తనని వారు ప్రేమిస్తారు. తాను ప్రేమించకుంటే వారు కూడా ప్రేమించరు. మాయలు పన్ని మోసాలు చేస్తే ఎవ్వరు కూడా ప్రేమించరు.మాటలాడ వచ్చు మనసు నిల్వగలేదుతెలుపవచ్చు దన్ను తెలియలేదుసురియబట్టవచ్చు శూరుడు కాలేడువిశ్వదాభిరామ వినురవేమమాటలెన్నైనా చెప్పగలరు కానీ, ఆ ప్రకారం నడుచుకోలేరు. ఒకరికి చెప్పుటలో ఉన్నంత ఉత్సాహం తననుతాను గుర్తించడంలో ఉండదు. ఆయుధము పట్టిన ప్రతివాడు శూరుడు కాలేడని తెలుసుకో.తనకేనాడు సుభిక్షముతనకేనాడును భగంబు తనరవయునంచును తన దశకై యెల్లెడమనసందున జివుకుచుండు మహిలో వేమా!తనకెల్లప్పుడు సిరిసంపదలుండవలెననీ, భోగభాగ్యాలు ఉండాలని నరుడు ఆశలోనే మనసు నుంచి చివుకుచుండును. ఆశవల్ల మిగిలేది బాధేనని తెలుసుకో.ఎండిన మా నొకటడవినిమండిన నందగ్ని పుట్టి యూడ్చును చెట్లన్దండిగల వంశమెల్లనుచండాలుండొకడు పుట్టి చదుపును వేమా!అడవిలోని ఎండిన చెట్టు నుంచి పుట్టిన అగ్ని ఆ అడవి మొత్తాన్ని కాల్చును. అలాగే వంశములో ఓ నీచుడు పుడితే ఆ వంశం మొత్తాన్ని నాశనం చేయునని తెలుసుకో.నిజము తెలిసియున్న సుజినుడానిజమునెపలుకవలయుగాని పరులకొరకుచావకూడ దింక నోపదవ్యం పల్కవిశ్వదాభిరామ వినురవేమతనకు నిజము తెలిసిఉంటే నిజాన్నే చెప్పాలి తప్ప అసత్యాన్ని చెప్పరాదు. నిజాన్ని ఎంతమాత్రమూ దాచకూడదు.తామును జనులేమను కొనబూనుదురో దాని సరసి పొందిన జడనీ,రాని పధంబున నడిచినదాననె ధర్మాత్ముడండ్రు తన్నిట వేమా!జనులు తనను నిందింపని రీతిలో నడవడిక కలిగిన వ్యక్తి, తన ప్రవర్తనను ప్రజలు మెచ్చుకొనునట్లు ప్రవర్తించువాడే నిజమైన ధర్మాత్ముడుగా వెలుగొందుతాడని తెలుసుకో.

అపోలో హాస్పిటల్స్‌లో అపాక్స్ పెట్టుబడులు

తమ సంస్థలో అపాక్స్ పార్ట్నర్స్ రూ. 426.4 కోట్ల పెట్టుబడి పెట్టనుందని అపోలో హాస్పిటల్స్‌ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 20 బిలియన్ డాలర్ల పెట్టుబడిని అపాక్స్ పార్ట్నర్స్ పెట్టనుండగా, అందులో తాము కూడా వాటా దక్కించుకున్నామని వెల్లడించింది. భవిష్యత్తులో చేపట్టబోయే హాస్పిటల్స్ నిర్మాణ, విస్తరణ పథకాలకు ఈ పెట్టుబడిని వెచ్చించనున్నట్టు అపోలో హాస్పిటల్స్ తెలిపింది.ఈ ప్రతిపాదనకు అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్ల బోర్డు అంగీకారం తెలిపింది. పది రూపాయల ముఖ విలువ కలిగిన 70.47 లక్షల ఈక్విటీ షేర్లను ప్రాధాన్యత ప్రాతిపదికన విడుదల చేసేందుకు అంగీకరించింది. ఈ సందర్భంగా అపోలో హాస్పిటల్స్ గ్రూపునకు కొత్త వైస్‌ప్రెసిడెంట్‌గా గ్రాంట్ ఆర్ మడ్లేను నియమించారు.

వచ్చే ఐదేళ్లలో 20వేల ఉద్యోగాలుః భెల్ వెల్లడి

వచ్చే ఐదేళ్లలో తాము 20వేల మందికి కొత్తగా ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్టు భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ తెలిపింది. భారీగా విస్తరణ కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టు కొత్త ఉద్యోగ నియామకాలు ఉండగలవని సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ కె పురి తెలిపారు.రూ. 6,500 కోట్లతో 2012 నాటికి ఉత్పత్తి సామ ర్థ్యాన్ని 20,000 మెగావాట్లకు పెంచనున్నామన్నారు. ప్రస్తుతం కంపెనీలో 42,600 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇంజనీరింగ్ (మెకానికల్, ఎలక్ట్రికల్), ఇతర టెక్నికల్ ఉద్యోగాలతో పాటు అన్ని కేటగిరీ ఉద్యోగాల నియామకం చేపడతామని ఆయన పేర్కొన్నారు.ఈ ఏడాది చివరి నాటికి కంపెనీ మొదటిదశ విస్తరణ కార్యక్రమం పూర్తయి. ఉత్పత్తి సామర్థ్యం 10వేల మెగావాట్లకు చేరుకోనుందని తెలిపారు. అలాగే రెండో దశ తర్వాత 15వేల మెగావాట్లకు చేరుకోనుందని వెల్లడించారు. విద్యుత్‌కు డిమాండ్ పెరుగుతున్నందునే విస్తరణ కార్యకలాపాలను చేపడుతున్నామని తెలిపారు.

రాష్ట్రంలో మరో ఏడేళ్లలో లక్షలాదిగా ఉద్యోగాలు

ఐటి,ఐటిఇఎస్,టెక్స్‌టైల్స్,ఇంజనీరింగ్,కన్‌స్ట్రక్షన్,ఫార్మా,బయోటెక్ టూరిజం,హెల్త్ కేర్,ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్లలో కొత్తగా భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నట్టుగా భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) జరిపిన ఒక అధ్యయనంలో వెల్లడయింది.ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో 2015 నాటికి కొత్తగా 80 లక్షల ఉద్యోగాలు ఏర్పడే అవకాశముంది.'మ్యాపింగ్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ స్కిల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్' అనే అంశంపై ఈ అధ్యయనం నిర్వహించినట్టు సీఐఐ తెలిపింది. సాధారణ నైపుణ్యం,అత్యధిక నైపుణ్యం ఉన్న ఉద్యోగాలు కనీసం 45 లక్షలు, నైపుణ్యం పెద్దగా అవసరం లేని మామూలు ఉద్యోగాలు సుమారు 35 లక్షల మేర ఉంటాయని భావిస్తున్నట్టుగా ఈ అధ్యయనం వెల్లడించింది.అయితే అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే విద్యకు సంబంధించిన మౌలిక సదుపాయాలను పెంచడంతో పాటు శిక్షణ సౌకర్యాలను, వృత్తివిద్యా కోర్సులను పెద్ద ఎత్తున ప్రారంభించాల్సి ఉంటుంది.

చిరు అక్రమార్జనపై కాంగ్రెస్ కన్ను!

హీరో చిరంజీవి ఉగాది నాడు పార్టీ ప్రారంభించనున్న నేపధ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. చిరంజీవిని ఎలాగైనా అప్రదిష్ట పాలు చేయాలన్నది వారి వ్యూహంగా కన్పిస్తోంది.చిరంజీవి ప్రధానంగా బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా సమాజ సేవ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో ఆయనకు జూబిలీహిల్స్ లో విలువైన స్ధలాన్ని బ్లడ్ బ్యాంక్ కోసం ప్రభుత్వం నామ మాత్రపు ధరకు కేటాయించింది. ఇప్పుడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ మీద, ఐ బ్యాంక్ మీద కాంగ్రెస్ నాయకులు దుష్ప్రచారం చేయడానికి సిద్ధమవుతున్నారు. ఆ ప్రచారాన్ని తిప్పికొట్టడానికి చిరంజీవి అభిమానులు సిద్ధం కావలసి ఉంది. చిరంజీవి ట్రస్టు వాణిజ్యం చేయడంలేదని, ప్రజాసేవ చేస్తోందని వారు ప్రజలకు చెప్పాల్సిన అవసరముంది.

పాక్‌తో పోల్చితే భారత్‌కే ప్రాధాన్యం: అమెరికా

పాకిస్థాన్‌‌తో పోల్చితే భారత్‌‌తో సంబంధాలకే తాము అధిక ప్రాధాన్యం ఇస్తామని అమెరికా పేర్కొంది. భారత్ ప్రపంచ స్థాయి పలుకుబడితో మంచి శక్తివంతమైన దేశంగా అవతరిస్తున్న నేపధ్యంలో ఆ దేశంతో విస్తృత సంబంధాలు ఎంతో ముఖ్యమని భావిస్తున్నామని తెలిపింది.అమెరికా రక్షణ శాఖ ఉప సహాయ మంత్రి (దక్షిణ, ఆగ్నేయాసియా వ్యవహారాలు) జేమ్స్ క్లాడ్ వాషింగ్టన్ నుంచి టెలీ కాన్ఫరెన్స్‌లో విలేకరులతో మాట్లాడుతూ భారత్, అమెరికాలు వ్యూహాత్మక సామర్థ్యం దీర్ఘకాలిక ప్రయోజనాలకు ఎంతో ముఖ్యం కాగలవన్నారు.ఉగ్రవాది ఒసామాబిన్ లాడెన్‌కై గాలిస్తున్న పాక్‌‌ తీవ్రవాదంపై అంతర్జాతీయ పోరులో సాయం అందిస్తున్నప్పటికీ భారత్‌తో తాము దీర్ఘకాలిక సంబంధాలే ప్రయోజనకరంగా ఉండగలవని భావిస్తున్నామని ఆయన చెప్పారని అమెరికన్ ఫోర్సస్ ప్రెస్ సర్వీసెస్ తెలిపింది.

మెగా అభిమానులపై నిఘా!

చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ లపై నిఘా పెట్టిన రాష్ట్ర పోలీసులు చిరు అభిమానుల మీద కూడా మానసికంగా వత్తిడి తెస్తున్నారు। రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆయేషా అత్యాచారం, హత్య కేసులో అలసత్వం చూపిస్తున్న పోలీసులు చిరంజీవి అభిమానులను మాత్రం విడిచి పెట్టడం లేదు.విజయవాడకు సమీపంలోని ఇబ్రహీంపట్నంలో చిరంజీవి అభిమానులందరి మీద నిఘా పెట్టి, ఆయేషా హత్య కేసులో ఇంటరాగేషన్ చేస్తున్నట్టు సమాచారం. చిరంజీవి రాజకీయాల్లోకి వస్తే తమకు హాని జరుగుతుందన్న ఉద్దేశంతోనే చిరంజీవి అభిమానులను రాష్ట్ర ప్రభుత్వం పథకం ప్రకారం సతాయిస్తోందని తెలుసుకున్న నాగబాబు నేడు విజయవాడలో పర్యటిస్తున్నారు.చిరంజీవి అభిమానుల్లో ఆత్మ విశ్వాసం పెంచడమే నాగబాబు పర్యటన ఉద్దేశం. నాగబాబును ఇద్దరు మఫ్టీ పోలీసులు ఇప్పటికీ వెంటాడుతున్నారని చిరంజీవి అభిమానులు చెబుతున్నారు.

మోహన్‌బాబుతో బెల్లంకొండ సురేష్ చిత్రం

కలెక్షన్ కింగ్, డాక్టర్ ఎం మోహన్‌బాబు కథానాయకుడుగా ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ ఓ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఇందులో ప్రముఖ హీరోయిన్ సిమ్రన్ నాయికగా నటించే అవకాశమున్నట్టు విశ్వసనీయ సమాచారం.ఫ్యామిలీ చిత్రాలను అందరూ నచ్చేలా మెచ్చేలా తీయడంలో దిట్టయైన సీనియర్ దర్శకులు ముత్యాల సుబ్బయ్య ఈ చిత్రం దర్శకత్వ బాధ్యతలు చేపట్టే అవకాశమున్నట్టు ఫిలింనగర్‌లో బలంగా వినిపిస్తోంది. యమదొంగ చిత్రం తర్వాత మోహన్‌బాబు తన సొంత బ్యానర్‌లో కాకుండా బయట బ్యానర్‌లలో హీరోగా నటిస్తున్న చిత్రమిదే. త్వరలో మోహన్ బాబు కాంగ్రెస్లో చేరనున్నారన్న ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో బెల్లంకొండ ఏ తరహా కథతో ఆయన్ని తెరపై చూపనున్నారో అన్న ఆసక్తి ఇటు ప్రేక్షకుల్లోను, అటు రాజకీయ వర్గాల్లోనూ నెలకొంది.

కాంగ్రెస్ తీర్ధంపుచ్చుకోనున్న "కలెక్షన్ కింగ్"?

చిరంజీవి పెట్టబోయే కొత్త పార్టీ పుట్టకముందే రాష్ట్ర రాజకీయాల్లో అనేక మార్పులకు తెరతీస్తోంది. సినిమా పరిశ్రమలో చిరంజీవికి వ్యతిరేకి అయిన మోహన్ బాబు కాంగ్రెస్ పార్టీలో చేరి చిరంజీవికి వ్యతిరేకంగా ప్రచారం చేయనున్నట్టు సమాచారం.ఎన్టీఆర్ వీరాభిమాని అయిన మోహన్ బాబు ఆయన హయాంలో తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉండి, రాజ్యసభ వరకు వెళ్ళారు. చంద్రబాబు నాయుడితో పొసగక ఆయన కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. ఆ తర్వాత బిజెపిలో చేరినా అక్కడ ఎక్కువ కాలం ఉండలేకపోయారు.సినిమా పరిశ్రమకు సంబంధించి చిరంజీవి వర్గంతో మోహన్ బాబుకు అనేక విభేదాలు ఉన్నాయి. కేంద్రమంత్రి, దర్శకుడు దాసరి నారాయణరావు మోహన్ బాబుకు గురుతుల్యుడు.చిరంజీవికి, దాసరికి సంబంధాలు చెడిపోయిన తర్వాత మోహన్ బాబు మరింతగా చిరంజీవి మీద పరోక్షంగా దాడి చేస్తున్నాడు. చిరంజీవి మీద మరింత వత్తిడి పెంచేందుకే దాసరి మోహన్ బాబును కాంగ్రెస్ లోకి తీసుకొస్తున్నట్టు ఫిలిం నగర్ సమాచారం.

అంతర్జాల పత్రికలు!

అంతర్జాలంలో అనేక తెలుగు పత్రికలు వెలుగు చూస్తున్నాయి, విజయవంతంగా నడుస్తున్నాయి. తొలినాళ్ళలో అంతర్జాల పత్రికలు సాహిత్య ప్రధానంగా ఉండేవి. సాహిత్య వ్యాసాలు, కథలు, పాత గ్రంథాల సమీక్షలు, పద్యాలు మొదలైనవి ప్రధానంగా ఈ పత్రికల వస్తువులు. పాఠకుల అభిప్రాయాలను ప్రచురించాలంటే పత్రిక తరువాతి సంచిక వరకు ఆగవలసి వచ్చేది. యూనికోడు ప్రాచుర్యం పొందని ఆ రోజుల్లో అంతర్జాల పత్రికలన్నీ బొమ్మలూ. PDFల రూపంలోనే ఉండేవి. మామూలు అచ్చు పత్రికనే కంప్యూటర్లో చూస్తున్నట్లుండేది.
వెబ్2.0 వచ్చాక, బ్లాగులూ, వికీలూ వెల్లువెత్తాక, అంతర్జాల పత్రికల ధోరణి మారిపోయింది. అభివృద్ధి చెందిన సాంకేతిక సౌలభ్యాలు, తగ్గిపోయిన ఖర్చులు, పత్రికలకు చోదకాలయ్యాయి. ముఖ్యంగా, కంటెంటు మేనేజిమెంటు విషయంలో జరిగిన సాంకేతిక పురోగతి కారణంగా అంతర్జాల ప్రచురణ చిటికెల మీద పని అయిపోయింది. బ్లాగుల కారణంగా వెలికివచ్చిన కొత్త తరపు నెజ్జనుల ప్రతిభ ఈ పత్రికలకు ముడిసరుకయింది. అచ్చు పత్రికలకు అలవాటు పడిన పాత తరం రచయితలు అంతర్జాలంలో చురుగ్గా రాయడం ఇంకా మొదలు కాలేదు. అయితే, అంతర్జాల పత్రికల ప్రగతి గమనిస్తూ ఉంటే వాళ్ళూ జాలంలో చిక్కుకునే రోజు ఎంతో దూరంలో లేదనిపిస్తోంది.
వెబ్ పత్రికలకు, అచ్చు పత్రికలకూ ముఖ్యంగా రెండే తేడాలు.
1. ఫోటోలు బొమ్మలు లేకపోవడం: ఔత్సాహిక రచయితలున్నారు గానీ, ఔత్సాహిక చిత్రకారులూ, పొటిగరాపు పంతుళ్ళు లేకపోవడము, వీటి కోసం డబ్బులు ఖర్చు పెట్టవలసి రావటం, వెబ్ పత్రికలన్నీ కూడా ధనాపేక్ష లేనివే కావడం దీనికి ప్రధాన కారణం.
2. ప్రకటనలు లేకపోవడం: దీనికి ప్రధాన కారణం ప్రకటనలిచ్చేవారు లేకపోవడం (అసలిదే కారణమని కొందరంటారు)
మరో రెండు తేడాలు :3. ప్రసిద్ధులైన రచయితలు అచ్చు పత్రికలకు అందుబాటులో ఉన్నంతగా వెబ్ పత్రికలకు ఉండరు.
4. వెబ్ పత్రికల పాఠకులు అచ్చు పత్రికల కంటే తక్కువ.
*** *** *** *** ***
ఈమాట!
వస్తునాణ్యత పరంగా వెబ్ పత్రికలు అచ్చు పత్రికలకు తీసిపోయినవేమీ కాదు. కొండొకచో వెబ్ పత్రికలే ముందంజలో ఉన్నాయి. అలాంటి పత్రికల్లో పేరెన్నికగన్నది ఈమాట! తెలుగు వెబ్ పత్రికల్లో వయసు రీత్యానూ, పరిణతి రీత్యానూ పెద్దది - ఈమాట. ఎప్పుడో యూనికోడు ప్రాచుర్యంలోకి రాకముందే పుట్టిన ఈ పత్రిక కాలంతో పాటు రూపునూ, సాంకేతికతనూ మార్చుకుంటూ, మెరుగుపరచుకుంటూ, అదే సమయంలో తన రచనల స్థాయిని కాపాడుకుంటూ వస్తోంది.


ఈమాట ద్వైమాసిక సాహితీ పత్రిక. చాలా స్పష్టమైన ఆశయాలు కలిగినది.
సంపాదకవర్గం:వేలూరి వేంకటేశ్వరరావు, కె.వి.ఎస్. రామారావు, సురేశ్‌ కొలిచాల, శంఖవరం పాణిని, పద్మ ఇంద్రగంటి ఈమాటను నిర్వహిస్తున్నారు.
“అంతర్జాలంలో తెలుగు వ్యాప్తికి తోడ్పడింది” అనే మాట ఈమాటకు చెందినంతగా మరో పత్రికకు చెందదు. తెలుగు సాహిత్యానికి నెట్లో ఉన్న ప్రధాన వనరుల్లో ఈమాట ఒకటి. ఈమాట కూడబెట్టినంత సాహితీ సంపద అంతర్జాలంలో మరో తెలుగు పత్రిక చెయ్యలేదు. ఇప్పటి వరకూ వచ్చిన యాభై పైచిలుకు సంచికలను ముందేసుకుని కూచ్చుంటే సాహిత్య భోజనులకు అజీర్తి చెయ్యడం ఖాయం! ఈమాట గ్రంథాలయంలో తెలుగు పుస్తకాలు డౌనులోడు చేసుకునేందుకు అందుబాటులో ఉన్నాయి.
కళ్ళకింపైన చక్కని మూసను ఈమాటకు వాడుతారు. పత్రిక వెనుక గట్టి సాంకేతిక వర్గం కూడా ఉన్నట్టుంది.., ఈ వర్డ్ ప్రెస్ మూసకు మార్పుచేర్పులు చేసి చాలావరకు తమకనుగుణంగా తీర్చిదిద్దుకున్నారు. యూనికోడులోనే కాక, మూడు ఇతర రూపాల్లోనూ ఈమాట లభిస్తుంది.
ఇందులో వచ్చినన్ని పరిశోధనాత్మక వ్యాసాలు ఇంకెక్కడా రాలేదేమో. ఆంగ్లంలో ఎకడెమిక్ జర్నల్ తరహాలో ఈ పత్రికని నడుపుతున్నారు. ప్రతి రచనా, ముందుగా ముగ్గురు సమీక్షకులు పరిశీలిస్తారు, అవసరమైన చోట్ల మార్పుచేర్పులకు సూచనలు ఇస్తారు.
ఎప్పుడో ఎనిమిదేళ్ళ కిందటే ఆడియో వ్యాసాలను అందించిన ఘనత ఈమాటది. ఈమాట అచ్చులోనూ వస్తే, మరింత మంది పాఠకులకు చేరువయ్యే అవకాశం ఉంది.
*** *** *** *** ***
సుజనరంజని
కాలిఫోర్నియా బే ఏరియా తెలుగువారి సాంస్కృతిక సంస్థ, సిలికానాంధ్ర వారి పత్రిక ఇది. మాసపత్రిక. 2004 జనవరి నుండి ప్రచురితమౌతోంది. ప్రతి నెలా ఒక ముఖచిత్రాన్ని ప్రచురిస్తారు. మామూలు అచ్చు పత్రిక భావన కలుగజేస్తుంది. తెలుగు సాహిత్యమే ప్రధానంగా నడిచే పత్రిక ఇది.

పద్య సమస్యలిస్తూ పాఠకుల నుండి పూరణలను కోరే “పద్యం హృద్యం” శీర్షిక సుజనరంజని ప్రత్యేకత! మరే పత్రికలోనూ లేని శీర్షిక ఇది. గళ్ళ నుడికట్టును కూడా ఇస్తారు కానీ, దాన్ని డౌనులోడు చేసుకుని ప్రింటు తీసి, ఆపై పూర్తి చెయ్యాల్సి ఉంటుంది. సుజనరంజని యూనికోడులోనే కాక, పీడీయెఫ్ గా కూడా లభిస్తుంది.
సంపాదకబృంద సభ్యులు: తాటిపాముల మృత్యుంజయుడుతల్లాప్రగడ రావుప్రఖ్య వంశీకృష్ణతమిరిశ జానకికూచిభొట్ల ఆనంద్డా.జుర్రు చెన్నయ్య
శీర్షికా నిర్వాహకులు: కాకుళవరపు రమ, పసుమర్తి బాలసుబ్రహ్మణ్యం
తాము స్వయంగా తయారుచేసుకున్న సాఫ్టువేరును, మూసను వాడుతున్నారు. సైటు మిగతా పత్రికలతో పోలిస్తే నిదానంగా లోడవుతుంది. బహుశా బొమ్మలు ఒక కారణం కావచ్చు. పత్రికలో అచ్చుతప్పులు పంటికింద రాళ్ళలాగా తగులుతూ ఉంటాయి. పాఠకులు తమ అభిప్రాయాలను తెలియజెప్పేందుకు సరైన వీలు లేదు. ఈ మధ్య ఈ అంశాన్ని ప్రవేశపెట్టారు కానీ పాఠకుల స్పందన తరువాతి సంచికలోనే వస్తుంది. అంతర్జాల పత్రికల్లో ఇది లేకపోవడం లోటే గాక, చిత్రం గానూ అనిపిస్తుంది.
*** *** *** *** ***
ప్రజాకళ
ప్రజాకళ అక్టోబరు 2006 లో మొదలైంది. దీన్నొక మాస పత్రికగా తీసుకురావాలనేది పత్రిక పెట్టిన కొత్తలో వారి ప్రయత్నం. ఈ మధ్య కాలంలో తమ ఉద్దేశ్యాన్ని మార్చుకుని ప్రతి వారం ఏదో ఒక కొత్త రచనతో సైటుని అప్ డేట్ చేస్తూ తాజాగా వుంచాలనేది తమ కోర్కె అని చెప్పారు. అయితే ఆ ప్రయత్నాలు ఇంకా కార్యరూపానికి రాలేదు. కవిత్వం, కథ, నవల, సాహిత్య వ్యాసాలు, సాహిత్య విమర్శ తదితర రచనలను పరిచయం చేస్తారు.. “ప్రత్యామ్నాయ ప్రజాస్వామిక సాహిత్యాన్ని తెలుగు సాహిత్యాభిమానులకు పరిచయం చేయాలనేది” కూడ వారి కోర్కె.

సాజీ గోపాల్ నేతృత్వంలో ప్రజాకళ వస్తూంది. అయితే పత్రికలో ఆ వివరాలను ప్రచురించలేదు. “అందుచేత తెలుగులో ప్రజాస్వామిక సాహిత్యం పట్ల ఆసక్తీ, ప్రేమా వున్న కొంతమందిమి మేము ఈ వెబ్ సైటు ప్రారంభిద్దాం అని అనుకున్నాము.” అని మాత్రం రాసారు. ఈ విషయమై ఒక ప్రముఖ పాఠకుడు అడిగిన ప్రశ్నకు సమాధానమూ ఇవ్వలేదు. బహుశా ఆ ప్రశ్నకు అక్కడే సమాధానం ఇవ్వకపోవడంలో తమ ఉద్దేశ్యాన్ని స్పష్టం చేసేందుకే ఆ ప్రశ్నని తీసెయ్యకుండా, అలాగే ఉంచేసినట్టున్నారు. (ఆయనకు సమాధానాన్ని నేరుగా ఈమెయిలుకు పంపి ఉండవచ్చు.)
ప్రజాకళ వర్డ్‌ప్రెస్ సాఫ్టువేరును వాడుతున్నది. ఉచితంగా దొరికే మూసను వాడుతున్నారు. మొదటినుండీ ఒకే మూసను వాడుతూ వస్తున్నారు. పీడీయెఫ్ రూపంలో కూడా దొరుకుతుంది.
*** *** *** *** ***
ప్రాణహిత
ప్రాణహిత 2007 జూలైలో మొదలైంది. “ప్రధానంగా, విభిన్న గొంతుకల సమ్మేళనమై వినబడే ప్రత్యామ్నాయ ప్రజాస్వామిక సాహిత్యానికి క్రియాశీల వేదిక కావడమే ప్రాణహిత లక్ష్యం.” అని చెబుతూ.., “ప్రపంచవ్యాప్తంగా, దేశ దేశాల్లో ప్రజల పక్షం నిలబడ్డ సాహిత్యాన్ని తెలుగు చేసి మీకందించే ప్రయత్నం చేస్తాం.” అని తమ సంకల్పాన్ని చెప్పుకున్నారు. ఎక్కడా స్ఫుటంగా ప్రస్తావించనప్పటికీ ప్రాణహిత ప్రధానంగా తెలంగాణా ప్రాంత అంశాలకు ప్రాధాన్యత నిస్తున్నట్లుగా కనిపిస్తుంది.

ప్రాణహిత సంపాదకవర్గం: నారాయణ స్వామి, హిమబిందు, మమత, జయప్రకాశ్, చైతన్య, జి. ఎస్. రాంమోహన్ (హైదరాబాద్)
ప్రాణహితది ఆహ్లాదకరమైన రూపం. వర్డ్‌ప్రెస్ సాఫ్టువేరులో, ఒక చక్కటి మూసను కొని, వాడుతున్నారు. మొదటి నుండీ దాన్నే వాడుతున్నారు. పత్రిక పీడీయెఫ్ రూపంలో కూడా దొరుకుతుంది
పాఠకులకు ప్రజాకళ, ప్రాణహిత పత్రికలలో దగ్గరి పోలికలు కనిపిస్తాయి. వారి సాహితీ దృక్పథం, ప్రచురిస్తున్న వస్తువుల్లో ఉన్న సారూప్యత అందుకు కారణంగా చెప్పుకోవచ్చు. రెండు పత్రికల్లోనూ ఉన్నత విలువలతో కూడిన వ్యాసాలు వస్తున్నప్పటికీ, తమకో ప్రత్యేక గుర్తింపును, ఒక బ్రాండును స్థాపించుకోవడంలో ఇదొక అడ్డంకి. ఈ రెండు పత్రికల గురించిన పేజీలను చూస్తే వీటి సామ్యం అవగతమౌతుంది.
*** *** *** *** ***
కౌముది
వెబ్‌లో ప్రచురితమౌతున్న మరో మాస పత్రిక కౌముది. ప్రముఖ రచయిత, కిరణ్ ప్రభ (పాతూరి ప్రభాకరరావు), ఆయన భార్య కాంతి ఈ పత్రికకు నిర్వాహకులు. గతంలో సుజనరంజని పత్రికను నిర్వహించిన కిరణ్ ప్రభ 2007 జనవరిలో కౌముదిని ప్రారంభించారు.

యూనికోడు యుగంలో మొదలైనప్పటికీ, కౌముదిని పీడీయెఫ్, బొమ్మల రూపాల్లోనే ప్రచురిస్తున్నారు. పాఠకుల స్పందన వెంటనే కనిపించదు.
*** *** *** *** ***
భూమిక
భూమిక స్త్రీవాద పత్రిక. అచ్చు పత్రికగా మొదలై, 2006 నవంబరులో అంతర్జాలానికెక్కింది. “తెలుగులోనే కాక యావత్ దక్షిణ భారతంలోనే వస్తున్న ఏకైక స్త్రీవాద పత్రికగా” భూమిక గురించిన పేజీలో రాసారు. కొండవీటి సత్యవతి ఈ పత్రిక సంపాదకురాలు. భూమికలో పనిచేసే వారంతా స్త్రీలే! ప్రసిద్ధులైన స్త్రీలు భూమికలో ముఖ్య భూమికలు నిర్వహిస్తున్నారు.

భూమికలో రచనలు ఎక్కువగా స్త్రీకి సంబంధించినవే. కాల్పనిక రచనలు తక్కువగానూ, వాస్తవ విషయాలకు సంబంధించిన రచనలు ఎక్కువగాను ఉంటాయి.
కేవలం రచనలతోటి సరిపెట్టడమే కాకుండా, స్త్రీలకు మాటసాయం చేసే ఉద్దేశ్యంతో భూమిక ఒక హెల్ప్‌లైన్ ను కూడా నిర్వహిస్తోంది.
*** *** *** *** ***
నవతరంగం
తెలుగు పత్రికలలో పసి కూన ఇది. పొద్దు లాగానే ఒక వేళాపాళా లేకుండా వచ్చే పత్రిక. సినిమా కోసమే ప్రత్యేకించిన పత్రిక. సినిమా విమర్శకుడిగా పేరొందిన వెంకట్ సిద్ధారెడ్డి మరి కొందరు ఔత్సాహికులతో కలిసి స్థాపించిన పత్రిక. రాకేశ్వరరావు, మంజుల, దేవరపల్లి రాజేంద్ర కుమార్, సౌమ్య, ప్రసాద్, శ్రీరామ్ మొదలైనవారు ఇతర రచయితలు. నిష్పాక్షిక సినిమా సమీక్షలకు నెలవుగా నవతరంగం పేరు పొందుతోంది. నవతరంగం అనే పేరుతో తమ సైటు కొత్త ఆలోచనలను, కొత్త భావాలను తెస్తుంది అని చెప్పదలచినట్టున్నారు. బహుశా వెంకట్ కు న్యూవేవ్ సినిమా పట్ల ఉన్న అభిమానం ఆయనచేత ఈ పేరు పెట్టించి ఉండవచ్చు.

ఇది కూడా వర్డ్‌ప్రెస్ సాఫ్టువేరు ఆధారంగా నడిచే పత్రికే! మామూలుగా ఉచితంగా దొరికే మూసల జోలికి పోకుండా, నవతరంగం తన మూసను కొని మరీ వాడుతోంది. ఆ విధంలో ఒక అసౌకర్యానికి గురౌతోంది. పదే పదే రూపును మార్చుకోవడానికీ, ప్రయోగాలకూ ఖర్చు పెరిగిపోతోంది. (తమరి విధేయ పత్రిక ఈ ప్రయోగాలకు పెట్టింది పేరని పాఠకులకు తెలియంది కాదు). సైటు చాలా త్వరగా లోడవుతుంది.
పత్రికలో బాగా కనిపించే తేడా.. దానికున్న పోర్టల్ రూపమే! ఇటీవలి వ్యాసాల సంక్షిప్త పరిచయం మొదటి పేజీలో కనిపిస్తాయి. ఎంచుకున్న శీర్షికలలోని సరికొత్త వ్యాసాల మొదటి వాక్యాలు మొదటి పేజీ అంతా పరుచుకుని ఉంటాయి.
ఫోకస్, భారతీయ సినిమా, ప్రపంచ సినిమా, విశ్లేషణ, సమీక్ష మొదలైన వర్గాలున్నాయి. ఇవి వర్గాలు.. శీర్షికలు కావు. ఒక్కో వ్యాసమూ ఒకటి కంటే ఎక్కువ వర్గాలోకి చేర్చారు. అది సహజమే. కానీ ఆ వర్గాలనే పైనున్న లింకులుగా పెట్టడంతో ఒకే వ్యాసం ఒకటి కంటే ఎక్కువ లింకుల్లో ఉంటోంది. పైనున్న లింకులు ఆ లింకులకే ప్రత్యేకమైన వ్యాసాలను చూపిస్తే బావుంటుంది. వర్గాలను పేజీలో మరోచోట పెట్టొచ్చనుకుంటాము.
ఇకపోతే… నవతరంగంలో ఉండాల్సినవీ, అక్కడ లేనివీ - ఫోటోలు. ఒక సినిమా పత్రికలో పాఠకులెక్కువగా ఆశించేది ఫోటోలను. నవతరంగం, నవతరపు సినిమా పత్రికైనప్పటికీ అది అవసరమే! పత్రిక మరింత పుంజుకునేటప్పటికి ఆ లోటూ తీరవచ్చు.
నవతరంగం, అంతర్జాలంలో వస్తున్న మార్పులని తనకనుగుణంగా మార్చుకొన్న మొదటి పత్రిక. ఇక్కడ, సాంప్రదాయక పద్ధతిలో సంపాదక వర్గం పని చెయ్యదు. సినిమా పట్ల ఉత్సాహం, అవగాహన, రాయగల నేర్పు ఉన్న రచయితలకి, నవతరంగం నేరుగా - తమ రచనలని, ప్రచురించుకొనే సౌకర్యం కలిగిస్తోంది. ఇది ఓ కొత్త ప్రయోగం.
సాటి ఉత్సాహవంతులను కలుపుకుని వెంకట్ సిద్ధారెడ్డి చేసిన ఈ ప్రయత్నం విజయవంతమైనట్టే! పాఠకుల స్పందన కూడా బావుంది. తెలుగు సినిమాపై నిజాయితీతో కూడిన విమర్శ కరువైన ఈ రోజుల్లో ఇది అవసరమైన ప్రయోగం. ఉత్సాహవంతులు, కార్యకుశలురూ అయిన నవతరంగ చోదకులు మరిన్ని కొత్త శీర్షికలతో పత్రికను నిత్యనూతనంగా ఉంచుతారని ఆశించవచ్చు.
*** *** *** *** ***
చాలా వరకూ వెబ్-పత్రికలన్నీ - సాహిత్యానికి, లేదా ఏవో కొన్ని సామాజికాంశాలకీ పరిమితమైపోయాయి. ఎంతో మంది తెలుగు వాళ్ళు, ప్రపంచం నలుమూలలా - ఎన్నో రంగాలలో నిష్ణాతులుగా పని చేస్తున్నారు. ఇప్పుడు, తెలుగులో రాయటం చాలా తేలికైపోయింది. పత్రిక పెట్టడానికి కాని ఖర్చు కూడా లేదు, ఉత్సాహం, రాయాలనే పట్టుదలా, ఏదో ఒక రంగంలో నైపుణ్యం ఉంటే చాలు. కాబట్టి, రాబోయే కాలంలో - ఎకనామిక్సు, పొలిటికల్ సైన్సు, సైన్సులు, సోషియాలజీ మొదలైన రంగాలలో - నైపుణ్యం ఉన్నవారు కొంతమంది - నవతరంగం తరహాలో ఒక చోట చేరి, ఆయా అంశాలలో తెలుగులో రాస్తే బావుటుంది. ఇప్పటికే, కొంతమంది - భాషా శాస్త్రం, కంప్యూటర్ సైన్సు, టెక్నాలజీ, సైన్సు మొదలైన విషయాలలో, ఉన్నత స్థాయి రచనలు చేస్తూ ఉన్నారు. ఈ ట్రెండు ఇలాగే కొనసాగితే, తెలుగు అంతర్జాలం, వెబ్-పత్రికలు - ప్రింటు మాధ్యమాలకి ప్రత్యామ్నాయంగా ఎదగటం, తమ ఉనికిని స్థిర పరుచుకోవటం ఖాయం.

రాఘవ పద్యానుబంధం!

(ముక్కు రాఘవ కిరణ్)
పద్యాల గురించి చెప్పేముందు పద్యాలకీ నాకూ ఉన్నట్టి అనుబంధమేమిటో, చెప్పటానికి నాకు అర్హత ఉందో లేదో తేల్చే ప్రయత్నమే ఈ పరిచయం. సాధ్యమైనంతవరకూ అందరికీ అర్థమయ్యేలా నేడు వాడుకలో ఉన్న వ్యావహారికభాషలోనే రాయడానికి ప్రయత్నిస్తాను, అవసరమైతే వ్యాకరణాన్ని (ప్రస్తుతానికి) పక్కన పెట్టి.
నాకు గుర్తున్నంతవరకూ నాకు అసలు పద్యం రాద్దామనిపించింది నేను ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు. అప్పుడు మతిహీనుడు అని ఒక పాఠం ఉండేది. అందులో “గర్గుఁడను విప్రుఁడొకరుడు దుర్గారాధనముఁ బెక్కు దొసగులబడచున్…” అని ఒక కంద పద్యం ఉంది. అది చూసి ఎందుకోగానీ నాకు కూడా ఒక పద్యం రాయాలనిపించింది. బహుశా నేను మా నాన్నగారి వద్ద చిన్నప్పటినుంచీ విన్న అనేక చాటువులదో లేదా పోతన భాగవత పద్యాలదో ప్రభావం కావచ్చు. మొత్తానికి ఎలా రాయాలో అప్పటివరకూ ఎక్కడా చదవలేదు. అప్పుడు నా బుర్రకి తోచినట్టుగా అదే పాఠంలో ఉన్న ఏదో రెండు మూడు కందపద్యాలు గమనించాను. ఏదో లీలగా అర్థమైంది. ఏమని? మొదటి పాదం చిన్నది, రెండోది పెద్దది. మళ్లీ మూడోది చిన్నది, నాల్గోది పెద్దది అని. ఒక పద్యం తీసుకుని ఒక్కో పాదంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో లెక్కపెట్టాను. ప్రతీ పాదానికీ అన్నే అక్షరాలు వచ్చేలా ఒక కందపద్యం రాసేశాను, ఏకలవ్యుడి మీద. ఎందుకో అప్పట్లో ఏకలవ్యుడిమీద బాగా గురి ఉండేది (ఇప్పుడు లేదని కాదు). అన్నట్టు మరో విషయం. ఇంకా చిన్నప్పుడు, అంటే ఎనిమిదో తరగతిలోకి రాకముందే, బహుశా నాల్గో తరగతిలో అనుకుంటాను, అప్పట్లో పద్యాలు బట్టీ పట్టి రాయాల్సి వచ్చేది పరీక్షల్లో. పద్యం మొత్తం బట్టీ కొట్టేసినా మళ్ళీ దాన్ని పాదాలకింద విడగొట్టి రాయాలి కదా, అసలే చిన్నతనమేమో అక్కడ వచ్చేది చిక్కంతా. పైగా క్లాసులో ఫస్ట్ రావాలి, మనని టీచరు మెచ్చుకోవాలి అన్న ధ్యాస తప్పితే వేరే ఆలోచనే ఉండేది కాదు.
యతి, గణాలు గట్రా లేవు కాబట్టి ఒక ముప్పావుగంటలో పద్యం రాసేశాను. అలా రాసిన పద్యాన్ని మా తెలుగు టీచరమ్మ విజయగార్కి చూపించాను. ఆవిడ తెగ సంబరపడిపోయి భలే రాసావురా నాన్నా అని మెచ్చేసుకుని మా హెడ్మేష్టారిక్కూడా చూపించారు. ఇంక ఆవేళ నాకు నేలమీద కాళ్ళు నిలవలేదు ఇంటికి వెళ్ళి మా నాన్నారికి దాన్ని చూపించేవరకూ.
అలా ఒకసారి క్వార్టర్లీ పరీక్షలకి చదువుతూంటే ఎందుకో ఎలానో స్ఫురించింది పాదాలుగా విడగొట్టడానికి ఒక టెక్నిక్. ప్రతీ పాదానికీ రెండో అక్షరం ఒకే గుణింతంలోంచి వస్తోంది. దొరికిందిరా జుట్టు అనుకున్నాను. కానీ కొన్ని పద్యాలకి ఇలా కుదరట్లేదు. కుదరకపోతేనేం? భలే భలే, నాకు తెలియదేంటి? పరీక్షల్లో అలాంటి పద్యాలు అడిగేవారేకాదు. ఏవో కొండపల్లి చేంతాడంత పద్యాలే అడిగేవారు. మీకూ గుర్తుండే ఉంటుంది, ఉదాహరణకి “పెంపునఁ దల్లివై … … … … దాశరథీ కరుణాపయోనిధీ” అని ఇచ్చి పూరించమనేవారు. అలా దానిని ప్రాస అని పిలుస్తారని తెలియకపోయినా ప్రాస గురించి ముందే తెలియడం వలన నేను ఏకలవ్యుడిమీద రాసిన పద్యంలో ప్రాస ఉండేలానే రాసాను. ఇంకో విషయం. మా చిన్నప్పుడు (నేను ఏడో తరగతి చదవడం అయ్యింతర్వాతనుంచీ) మా ఊళ్ళో — అన్నట్టు చెప్పనే లేదు కదూ మాది అమలాపురంలెండి — భారతీయ శిక్షణా మండలి వాళ్ళు వేసవి శిక్షణా తరగతులు నిర్వహించేవారు. వాళ్ళు కూడా పద్యాలు పాటలూ నేర్పేవారు. ఆ పద్యాల్లో ఎక్కువ సుమతీ శతకం లోవి.
అప్పుడు వాళ్ళు నేర్పిన పద్యాలు గుర్తుపెట్టుకోవడానికి కూడా ఒక టెక్నిక్ స్ఫురించిందండోయ్. ఒక ఉదాహరణ చెప్తాను. “ఇచ్చునదె విద్య … వచ్చునదే కీడు సుమ్ము వసుధను సుమతీ”, “ఎప్పుడు సంపద కలిగిన … గప్పలు పదివేలు జేరుఁ గదరా సుమతీ” లాంటి పద్యాల్లో సుమతీ అన్న పదానికి ముందు కదరా, వసుధను, నిక్కము లాంటి పదాలు వాడినప్పుడు మాత్రం పెద్ద తికమకగా ఉండేది ఏది ఎక్కడ వస్తుందో గుర్తుంచుకోడానికి. అప్పుడు గమనించిన విషయం — గప్పలు వస్తే గదరా అని వచ్చింది, వచ్చునదే వస్తే వసుధను వచ్చింది అని. బద్దెనగారు నాలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోడానికి వీజీగా ఉంటుందని అలా రాసారేమో అనుకున్నాను. అందువల్ల ప్రాసకుదిరేలా రాయడమైతే రాసాను గానీ యతిని గాలికొదిలేశాను. దానిని యతి అంటారని ఒక సంవత్సరన్నర పోయినతర్వాతగానీ తెలియలేదు నాకు. యతి, గణాలు గట్రా లేవు కాబట్టి ఒక ముప్పావుగంటలో పద్యం రాసేశాను. అలా రాసిన పద్యాన్ని మా తెలుగు టీచరమ్మ విజయగార్కి చూపించాను. ఆవిడ తెగ సంబరపడిపోయి భలే రాసావురా నాన్నా అని మెచ్చేసుకుని మా హెడ్మేష్టారిక్కూడా చూపించారు. ఇంక ఆవేళ నాకు నేలమీద కాళ్ళు నిలవలేదు ఇంటికి వెళ్ళి మా నాన్నారికి దాన్ని చూపించేవరకూ.
సాయంత్రం నాన్నగారు ఆఫీసునుంచి వచ్చాక ఎగురుకుంటూ వెళ్ళి “నాన్నోయ్ నేనొక పద్యాన్ని రాశ్శాను” అని చూపించాను. అది చూసి, అప్పుడు ఆయన చలపతిరావుగారి సులభవ్యాకరణం తెచ్చి చూపించారు. అందులో చందస్సు విభాగాన్ని తీసి, అసలు గణాలు అంటే ఏమిటో కందపద్యం అంటే ఎలా ఉంటుందో చెప్పారు. భరనభభరవ ఉత్పలమాల, నజభజజజర చంపకమాల అని ఆయన అప్పుడు చెప్పినవి ఇప్పటికీ నాకు బాగా గుర్తే. అప్పుడు అర్థమైంది నేను రాసినదాన్ని పద్యం అనరని. తర్వాతరోజునుంచీ స్కూల్లో నేను పద్యం రాసిన ఊసెత్తితే ఒట్టు. అలా పద్యాలు రాయడం తాత్కాలికంగా పక్కనపెట్టినా ఎప్పటికైనా అన్నీ నేర్చేసుకుని నాన్న మెచ్చుకునేలా పద్యం రాసెయ్యాలని మాత్రం మనసులో ఉండిపోయింది.
తర్వాత తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు మా తెలుగు మేష్టారు రామకృష్ణగారు. ఆయన దగ్గర ఉన్న చనువుకొద్దీ ఆయన తెచ్చుకున్న పుస్తకాలు కెలికే మంచి అలవాటొకటి ఉండేది నాకు. అలా ఒకరోజు పదోతరగతి పాఠ్యపుస్తకం చూసాను. అందులో ఎక్కడో కందపద్యం గురించి ఉందని చూశాను. ఇంకేం? కోతికి మళ్ళీ కొబ్బరికాయ దొరికింది. మొత్తం చదివేశాను. నాకు పూర్తిగా అర్థంకాలేదు. అందువల్ల దీనికన్నా ముందు ఏమేం చెప్పారా అని చూసాను. గణాలు విభజన ఆటవెలది తేటగీతి ఇంకా ఏవేవో ఉన్నాయ్. ఓపిగ్గా కూర్చుని అన్నీ చదివేశాను. ఇంక ఏదో ఒక పద్యం రాయడమే తరువాయి. సందర్భమో? అప్పుడు వచ్చింది ఆగష్టు పదిహేను. వారంరోజులు కుస్తీపట్టి చత్రపతి శివాజీ నేతాజీ గాంధీ లాంటివాళ్ళ పేర్లు వచ్చేలా ఛచ్ఛీచెడీ ఒక ఆటవెలది రాసాను భారతదేశంమీద (నాకా పద్యం ఇప్పుడు గుర్తులేదు). దాన్ని మా క్లాసులో డెకరేట్ చేసాను కూడా. అలా ఆటవెలదితో ప్రారంభం. తర్వాత అష్టదిగ్గజాలమీద ఒకటి రాసాను. ఈ రెండూ ఏదో తవికల్లా వచ్చాయి. అందం లేదు, పలుకుతుంటే ఒక పొందిక లేదు, సొగసు సంగతి సరేసరి. పదాలకి నడ్డి విరగ్గొట్టి బలవంతాన ఒక మూలన ఇరికించినట్టుగా అనిపించేది. అప్పుడు చిన్నప్పట్నుంచీ నేర్చుకున్న ఆటవెలదులన్నీ చదివాను. ఒక నడక బోధపడింది. ఇక మొదలు ఏ పండగ వచ్చినా సరే పద్యం రాసెయ్యాల్సిందే. పైగా మా రామకృష్ణగారు కూడా ఆ పద్యాన్ని క్లాసులో పైకి చదివి నా చేత అర్థం చెప్పించి చప్పట్లు కొట్టించేవారు. అది చాలదూ అప్పట్లో మళ్ళీ మళ్ళీ రాయాలని అనిపించడానికి?
నేను ఇంటర్లో ఉన్నప్పుడే రామ్మోహన్ గారితో పరిచయం అయ్యింది. ఆయనకి చూపించేవాడిని నేను రాసిన పద్యాలన్నీ. ఆయన ఒకసారి నా పద్యాలు చూసి “పద్యం నడకను మిక్కిలి హృద్యంగా పట్టినావు యిట్టే బాగా సద్యస్ఫూర్తికి నెలవే విద్యార్థివి నీకు రాని విద్యలు కలవే” అని నాకో కందం రాసిచ్చి ఆశీర్వదించారు.
ఆటవెలదులైపోయిన తర్వాత నేను డైరెక్టుగా దూకింది మళ్ళీ కందం మీదకే. ఆ విధంగా చందోబద్ధంగా నేను రాసిన మొదటి కందం — “అందరి పూజలు పొందుచు కొందరికే నీదియైన కరుణను వొసగన్, నీదయ నాపై కలుగగ వందన మిదియే రఘువర వందన మిదియే” అని. హమ్మయ్య. ఈసారి నాన్న ఈ పద్యాన్ని చూసి (ఒక్క చిన్నదోషం మినహాయించి) బాగుందిరా అన్నారు. ఇంకేం ఏనుగెక్కేసినంత సంబడం. ఆ తర్వాత ఒక సీసపద్యం, రెండో మూడో ఉత్పలమాలలు, మరో రెండు ద్విపదలూ రాసాను. ఇదంతా నేను స్కూల్లో ఉన్నప్పటి మాట.
స్కూల్లో ఉన్నప్పుడే కొత్తగా పదమేదైనా తెలిస్తే దాన్ని గుర్తుంచుకోవడానికని పద్యాలు రాసేయడం ఒకటి మొదలైంది. ఒకసారి అలాగే పదో తరగతిలో ఉండగా “ఆపగ” అన్నది కూలంకషకి పర్యాయపదమని చదివాక “ఉ. ఆపగ పారినట్లు మది నా హరి మీదనె కల్గు భక్తియూ ఏ పగ కల్గకుండ ఇల ప్రేమను పంచెడిదైన స్నేహమూ మాపుచు అంధకారమును మానవు మార్చెడిదైన విద్యయూ ఆపదనుండినా విడువరానివిరా మనసైన నేస్తమా” అని పద్యం రాసి మా మిత్రుడు బందా కార్తికేయకి ఇచ్చాను.
నాకు మొదటి నుంచీ కందాలంటే అభిమానమెక్కువ. రెండో క్లాసులో ఉండగా రాగయుక్తంగా కందాలని వప్పజెప్పానని మా టీచరమ్మ క్లాసులో నాచేత మిగతా వాళ్ళకి చెప్పించేది కూడా. కందాలమీదున్న ఆ అనుబంధంవల్ల నేను ఇంటర్లో ఉన్నప్పుడు అన్నీ కందాలే రాసాను. నేను ఇంటర్లో ఉన్నప్పుడే రామ్మోహన్ గారితో పరిచయం అయ్యింది. ఆయనకి చూపించేవాడిని నేను రాసిన పద్యాలన్నీ. ఆయన ఒకసారి నా పద్యాలు చూసి “పద్యం నడకను మిక్కిలి హృద్యంగా పట్టినావు యిట్టే బాగా సద్యస్ఫూర్తికి నెలవే విద్యార్థివి నీకు రాని విద్యలు కలవే” అని నాకో కందం రాసిచ్చి ఆశీర్వదించారు. మీరు నమ్ముతారో నమ్మరో నాకు కందాలంటే ఉన్న అభిమానం ఎంత ఎక్కువంటే గత మూడేళ్ళ క్రితం వరకూ నేను ఎప్పుడూ ఒక్క తేటగీతి కూడా రాసి ఎరుగను.
అలానే నేను ఇంటర్లో ఉన్నపుడు ఒకసారి మాడగుల నాగఫణిశర్మగారు ఇచ్చిన ఒక కందపద్య సమస్యని కూడా పూరించి దూరదర్శన్ కి పంపించాను (అదేమిటోగానీ నేను వీక్షించిన మొదటి, చివరి సమస్యాపూరణం కార్యక్రమం అదే). ఇప్పటికీ నన్ను బాధపెట్టే విషయం ఏమిటంటే నేను అప్పుడు పూరించిన పూరణగానీ, పోనీ ఆ సమస్యగానీ ఇప్పుడు నాకు గుర్తులేవు. అంతకు ముందు రాసిన చాలా పద్యాలు కూడా ఎక్కడ రాసానో గుర్తులేదు, ఏమైపోయాయో తెలియదు. సరీగ్ఘా అలాంటి పరిస్థితి మళ్ళీ ఎదురవ్వకూడదనే ఈ మధ్యన నేను రాసిన పద్యాలని వాగ్విలాసమనే నా బ్లాగులో ప్రచురించడం మొదలుపెట్టాను (కొన్ని ప్రచురించకుండా కేవలం సేవ్ చేసిన పద్యాలు కూడా ఉన్నాయి, అది వేరే విషయం).
నేను చదివిన పుస్తకాలా? నేను చాలా బద్ధకిష్టుని. నేను పాఠ్యపుస్తకాలలో తప్పితే ఎక్కడా పద్యాలు చదివే వాడినేకాదు. ఏదో ఈ మధ్యనే మా సగోత్రీకుడైన పోతనగారి భాగవతంతో శ్రీకారంచుట్టి పూర్వకవులు రాసిన కావ్యాలు చూడడం మొదలుపెట్టాను. అందులో మొదటి స్కంధమే పూర్తికాలేదనుకోండి ఇంతవరకూ.
ఇక మా కుటుంబ నేపథ్యమంటారా? మా తాతగారైన ముక్కు శ్రీరామచంద్రమూర్తి గారికి తెలుగు సంస్కృతాలు చక్కగా వచ్చును. మా పెదతాతలు ఇద్దరూ ఉభయభాషాప్రవీణలేనట. మా పెదనాన్నగారు కూడా బోలెడు పద్యాలు రాసేవారట ఆయన చిన్నతనంలో. నా ప్రథమగురువైన మా నాన్నగారికి పద్యాలన్నా సంగీతమన్నా ఆసక్తి మెండు. నాకు తెలిసి ఆయన పద్యాలు రాద్దామని ఎప్పుడూ ప్రయత్నించనే లేదు. ఏవో కొన్ని కవితలు మాత్రం రాసారు.
ఈ మధ్య నేను రాసినవాటిలో నాకు సంతృప్తినిచ్చినవి అర్థనారీశ్వర పంచాక్షర స్తోత్రాల ఆంధ్రీకరణలూ, అవి కాక కొన్ని పద్యాలూను.
మరో విషయం ఏంటంటే నాకు సరైన సమయంలో తగిన ప్రోత్సాహం లభించింది కాబట్టిగానీ లేకపోతేనా అసలు నాకు పద్యాలు రాయగలిగే శక్తెక్కడిది? నాకు ప్రోత్సాహాన్నందించిన వారికందరికీ ముఖ్యంగా మా నాన్నగారైన త్రినాథశర్మగారికీ, విజయ మేడమ్‌కి, రామకృష్ణ మేష్టారికి, రామ్మోహన్ మేష్టారికి, మా తాతగారైన బ్రహ్మశ్రీ మంగళంపల్లి రామనరసింహమూర్తిగారికీ నేను ఎప్పుడూ కృతజ్ఞుడనై ఉంటాను.

మంత్రి ధర్మాన ఫొటో పోజులు!


ఇది కచ్చితంగా ఫొటో పోజే।వసతి గృహాల పరిశీలన పేరిట అధికార పార్టీ ప్రజాప్రతినిధులు చేపట్టిన హాస్టళ్ల తనిఖీ కార్యక్రమం కేవలం ప్రచార ఆర్భాటంగానే మిగులుతుందన్న విమర్శలకు బలం చేకూర్చేలా శ్రీకాకుళం జిల్లాలో మంత్రి ధర్మాన ప్రసాదరావు పర్యటన సాగింది. మందీమార్బలంతో కలిసి మంత్రి నిర్వహించిన హాస్టళ్ల తనిఖీ పలు విమర్శలకు వేదికైంది. నిర్వహణ నిధులను మింగేస్తున్న తమ పార్టీ వాళ్లను వెనకేసుకుని చేసే పర్యటన ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో అంచనా వేయవచ్చని ప్రతిపక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి. సమీపిస్తున్న ఎన్నికలకు సమాయాత్తమయ్యామన్న సంకేతాన్ని ఇస్తూ సాగిస్తున్న ప్రచార కార్యక్రమం సత్ఫలితం కన్నా దిష్ఫలితాన్నే ఎక్కువగా ఇచ్చేలా ఉందన్న విమర్శా వినిపిస్తోంది.