నిరంతర వార్తా స్రవంతి

Saturday, March 1, 2008

భగవంతుని అనుగ్రహంలో హారతి ప్రత్యేకతలు

భగవంతుడి అనుగ్రహం కోసం ఎదురు చూస్తున్న భక్తులు ఆయనకు అందించే పదహారు రకాల ఉపచారాలలో హారతి అతి ముఖ్యమైంది. దీపారాధనగా కూడా పిలిచే ఈ హారతి లేకుండా ఏ పూజ కూడా పూర్తయినట్టు అన్పించదు. అయితే ఇందులోనూ ఎన్నో పద్ధతులున్నాయన్న విషయం చాలా మందికి తెలియదు.గుడిలో పూజారి దేవుడికి అందించే హారతిని పరిశీలిస్తే ఒక్కో సమయంలో ఒక్కో రీతిలో ఉండటాన్ని తెలుసుకోవచ్చు. సందర్భోచితంగా వారు ఆ హారతిని సంప్రదాయ బద్ధంగా అందిస్తారు. వీటిని పూర్తిగా కాకున్నా కొంతమేరకైనా మనం తెలుసుకోగలిగితే భగవంతుని ప్రసన్నానికి మరింత చేరువ కాగలం.నక్షత్ర దీప హారతి అందిస్తే నక్షత్రాలు దైవ ప్రార్థనతో కాంతివంతమవుతాయని అర్థం. తొమ్మిది జ్యోతులతో కూడిన హారతి నవశక్తులను సూచిస్తుంది. ఏడు జ్యోతులతో కూడిన హారతి సప్త మాతలను తెలుపుతుంది.ఐదు జ్యోతులతో కూడిన హారతి నివార్తి కళ, విద్యా కళ, ప్రతిష్ఠ కళ, శాంతి కళ, శాంతి అతీత కళలనే పంచ కళలను సూచిస్తుంది. మూడు జ్యోతులతో కూడిన హారతి సూర్య, చంద్ర, అగ్ని దేవులను, ఏక జ్యోతి హారతి సరస్వతీ దేవిని సూచిస్తాయి.హారతి ఇచ్చే సమయంలో చివరగా అందించే కుంభ హారతి సదాశివ తత్వాన్ని సూచిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. సాధారణంగా దీప హారతిని మూడు సార్లు తిప్పుతుంటారు.మొదటి పర్యాయం ప్రపంచ శాంతి కోసం, రెండో పర్యాయం గ్రామ ప్రజల శ్రేయస్సు కోసం, మూడో పర్యాయం పంచభూతాలతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి జరగాలని కోరుతూ ఈ హారతులిస్తుంటారు.

No comments: