నిరంతర వార్తా స్రవంతి

Thursday, March 27, 2008

ప్రగతిపథంలో ఇస్రో

ఇస్రో లోగోలో పైకి గురిఓట్టిన బాణం గుర్తు రాకెట్టును, అటూ ఇటూ ఉన్న సోలార్ సెయిల్స్ ఉపగ్రహాన్నీ సూచిస్తాయి.

ఇస్రో లోగోలో పైకి గురిఓట్టిన బాణం గుర్తు రాకెట్టును, అటూ ఇటూ ఉన్న సోలార్ సెయిల్స్ ఉపగ్రహాన్నీ సూచిస్తాయి.

భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ అంతరిక్ష పరిశోధనల కోసం భారత ప్రభుత్వం నెలకొల్పిన సంస్థ. ఇస్రో గా ప్రసిద్ధమైన ఈ సంస్థ దేశాభివృద్ధి లక్ష్యంగా అంతరిక్ష విజ్ఞాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశ్యంతో ఏర్పాటై, ప్రస్తుతం ప్రపంచంలోని ప్రముఖ అంతరిక్ష రంగ సంస్థల్లో ఒకటిగా ప్రసిద్ధి పొందింది. బెంగుళూరు కేంద్రంగా ఏర్పాటైన ఇస్రో, దేశంలోని వివిధ ప్రదేశాల్లో పరిశోధన, అభివృద్ధి సౌకర్యాలు కలిగి ఉంది.

చరిత్ర

చరిత్రలో మొదటిసారి బ్రిటీషు సైన్యంపైన టిప్పు సుల్తాన్ రాకెట్లను ప్రయోగించాడు. అది చూసిన బ్రిటీష్ శాస్త్రవేత్తలు అంతరిక్షంలోకి ప్రయోగించే రాకెట్ల నిర్మాణానానికి అంకురార్పణ చేసారు. 1947లో స్వాతంత్ర్యం వచ్చినపుడు భౌగోళికంగా చాలా పెద్దదయిన భారదేశానికి రక్షణ అవసరాలు, అభివృద్దికి అంతరిక్ష పరిజ్ఞానం యొక్క అవసరాన్ని గ్రహించి భారత ప్రభుత్వం అంతరిక్ష పరిశోధనా వ్యవస్థను ఏర్పరుచుటకు సన్నాహాలు మొదలు పెట్టింది.

విక్రం సారాభాయ్ ని భారత అంతరిక్ష పరిశోధనా వ్యవస్థకు పితామహుడిగా అభివర్ణిస్తారు. 1957లో రష్యా మొట్టమొదటి శాటిలైట్ అయిన స్పుత్నిక్‌ను ప్రయోగించినపుడు శాటిలైట్ యొక్క ఆవశ్యకతను అప్పటి ప్రధాన మంత్రి అయిన నెహ్రూకు వివరించి, 1962లో భారత అణు శక్తి వ్యవస్థ పితామహుడయిన హోమీ బాబా పర్యవేక్షణలో Indian National Committee for Space Research (INCOSPAR) ఏర్పరిచాడు.

1960-1970

ఆదినుండి ఉపగ్రహాల నిర్మాణాన్నే దృష్టిలో పెట్టుకొని దానికి అవసరమయిన భూఉపరితల లక్షణాలను అధ్యయనం చేయుటకొరకు కేరళలో త్రివేండ్రం వద్ద Thumba Equatorial Rocket Launching Station (TERLS) నెలకొల్పి అమెరికా, రష్యా నుండి దిగుమతి చేసుకున్న రాకెట్లను ప్రయోగిస్తూ ఉపరితలాన్ని అధ్యయం చేయడం మొదలు పెట్టారు. అనతికాలంలోనే భారత దేశం స్వదేశీయంగా పూర్తి స్థాయి రాకెట్లను తయారు చేసి ఉపరితల అధ్యయంలో పురోగతి సాధించింది.భవిష్యత్తులో ఇతర దేశాలు ఉపగ్రహానికి అవసరమయిన అన్ని పరికరాలు సమకూర్చకపోవడాన్ని గ్రహించిన విక్రం సారాభాయ్ పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో శాటిలైట్‌కు అవసరమయిన అన్నీ విడిభాగాలు మనదేశంలోనే తయారు చేసే దిశగా తన బృందాన్ని నడిపించాడు. 1969లో ఇస్రో, అనగా Indian Space Research Organisation (ISRO), 1972లో ప్రత్యేక అంతరిక్ష విభాగం ఏర్పడ్డాయి.

శ్రీహరి కోటలోని PSLV లాంచ్ ప్యాడ్

శ్రీహరి కోటలోని PSLV లాంచ్ ప్యాడ్

1970-1980

నాసాతో చర్చలు జరిపిన అనంతరం కేవలం శాటిలైట్లను తయారు చేయడమే కాకుండా వాటిని ప్రయోగించే సౌకర్యాన్ని కలిగిఉండడం ఆవశ్యకతను గుర్తించిన సారాభాయ్, ఇస్రోతో కలసి ఉపగ్రహాలను ప్రయోగించే వేదిక అయిన లాంచింగ్ ప్యాడ్ రూపకల్పన మొదలు పెట్టారు. దానిపేరే Satellite Launch Vehicle (SLV). మరొక వైపు ఇస్రో పూర్తిస్థాయి ఉపగ్రహాన్ని తయారు చేయగా, దానికి భారత గణిత మరియు ఖగోళ శాస్త్రవేత్త అయిన ఆర్యభట్ట పేరు పెట్టబడింది. భారతదేశపు మొట్టమొదటి ఉపగ్రహమయిన ఆర్యభట్టను ఏప్రిల్ 19, 1975న అప్పటి సోవియట్ యూనియన్ నుండి విజయవంతంగా ప్రయోగించారు. 1979 నాటికి శ్రీహరి కోటలో SLV లాంచ్ ప్యాడ్ సిద్దమవడంతో ప్రయోగించిన ఉపగ్రహం రెండవ దశలో ఎదురయిన సమస్య వల్ల విజయవంతం కాలేదు. లోపాలను సరిదిద్ది 1980లో విజయవంతంగా ప్రయోగించిన రోహిణి -1 భారతదేశంలో ప్రయోగింపబడిన మొదటి ఉపగ్రహంగా చరిత్రలో నిలిచిపోయింది.

1980-1990

SLV విజయంతో శాస్త్రవేత్తలు రాబోవు దశాబ్దాలలో ఉపయోగించుటకు వీలుగా Polar Satellite Launch Vehicle (PSLV) నిర్మాణాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా పరీక్షలను నిర్వహించుటకు Augmented Satellite Launch Vehicle (ASLV) నిర్మించారు. 1987లొ మరియు 1988లో చేసిన ASLV ప్రయోగాలు రెండూ విఫలమయినప్పటికీ PSLVకి ఉపయోగపడు ఎన్నో విషయాలు శాస్త్రవేత్తలు తెలుసుకొన్నారు.

1990-2000

చివరకు 1992లో ASLV ప్రయోగం విజయవంతమయింది. కానీ అప్పటికి తక్కువ బరువు ఉన్న ఉపగ్రహాలను మాత్రమే ప్రయోగించగలిగారు. 1993లో PSLV ప్రయోగం విఫలమయింది. తిరిగి 1994లో చేసిన PSLV ప్రయోగం విజయవంతమయింది. అప్పటినుండి భారత ఉపగ్రహాలకు PSLV స్థిరమయిన వేదికగా నిలిచి ప్రపంచంలోనే అతి పెద్ద ఉపగ్రహాల సమూహానికి మూలమయినదిగా, రక్షణ, విద్యా, వ్యవసాయాలకు అవసరమయిన ఎంతో పరిజ్ఞానానికి ఆధారంగా నిలిచింది.

2000 తర్వాత

2001లో మరింత శక్తి సామర్థ్యాలు కలిగిన Geosynchronous Satellite Launch Vehicle (GSLV) నిర్మాణానికి ఇస్రో శ్రీకారం చుట్టింది. దీనివల్ల 5000 కిలోగ్రాముల బరువున్న ఉపగ్రహాలను కూడా భూమి ఉపరితల కక్ష్యలోకి ప్రవేశపెట్టవచ్చు. చంద్రుడి పైకి మనిషిని పంపే దిశగా కూడా ప్రయోగాలు జరుగుతున్నాయి.

శాటిలైట్లు

ఇన్‌శాట్ - INSAT లేదా Indian National Satellite System అనునది టెలీకమ్యూనికేషన్లు, వాతావరణం, ప్రసారాలు మొదలయిన బహుళప్రయోజనాలకు ఇస్రో తయారు చేసిన ఉపగ్రహాల క్రమ సమూహం. 1983లో మొదలయిన ఇన్‌శాట్ ఆసియా-పసిఫిక్ దేశాల్లో అతిపెద్ద ఉపగ్రహాల వ్యవస్థ. ప్రస్తుతం 199 ట్రాన్స్‌పాండర్లతో భారతదేశంలోని దాదాపు అన్ని టెలివిజన్ మరియు రేడియోలకు మాధ్యమంగా ఉన్న ఈ ఉపగ్రహాలను కర్నాటకలోని హస్సన్ మరియు భోపాల్ లలో అనుక్షణం పర్యవేక్షిస్తుంటారు. ఇవి కాక IRS, అనగా Indian Remote Sensing satellites మరియు METSAT అనగా Meteorological Satellite ఉపగ్రహాలు కూడా ప్రయోగించారు. కొన్ని ఉపగ్రహాల వివరాలు:

నింగికి ఎగస్తున్నPSLV ఉపగ్రహ వాహకం

నింగికి ఎగస్తున్నPSLV ఉపగ్రహ వాహకం
క్రమ సంఖ్య శాటిలైట్ ప్రయోగించిన తేది
1 INSAT-1A 10 ఏప్రిల్,1982
2 INSAT-1B 30 ఆగష్టు,1983
3 INSAT-1C 22 జూలై,1988
4 INSAT-1D 12 జూన్,1990
5 INSAT-2A 10 జూలై,1992
6 INSAT-2B 23 జూలై,1993
7 INSAT-2C 7 డిసెంబర్,1997
8 INSAT-2D 4 జూన్,1997
9 INSAT-2DT అంతరిక్షంలో కొనుగోలు చేయబడినది
10 INSAT-2E 3 ఏప్రిల్,1999
11 INSAT-3A 10 ఏప్రిల్,2003
12 INSAT-3B 22 మే,2000
13 INSAT-3C 24 జనవరి,2002
14 KALPANA-1 12 సెప్టెంబర్,2002
15 GSAT-2 8 మే,2003
16 INSAT-3E 28 సెప్టెంబర్,2003
17 EDUSAT 20 సెప్టెంబర్,2004
18 INSAT-4A 22 డిసెంబర్,2005
19 INSAT-4C 10 జూలై,2006
20 INSAT-4B 12 మార్చి,2007
21 INSAT-4CR 2 సెప్టెంబర్,2007

ప్రయోగ కేంద్రాలు

తుంబా

కేరళలో తిరువనంతపురం సమీపాన భూ అయస్కాంత రేఖకు దగ్గరలో ఉన్న తుంబాలో 1962లో మొదటి రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని నిర్మించారు. అప్పటి శాస్త్రవేత్తలలో అబ్దుల్ కలాం ఒకరు. మొదట కేవలం రాకెట్ల ప్రయోగకేంద్రముగా ఉన్న తుంబా నెమ్మదిగా రాకెట్లకు అవసరమయిన ప్రొపెల్లర్లు, ఇంజన్లు తయారు చేసి అమర్చగలిగి పూర్తిస్థాయి రాకెట్ నిర్మాణ కేంద్రంగా తయారయింది.

శ్రీహరి కోట

భారతదేశంలో ఉపగ్రహాల ప్రయోగానికి అత్యంత అనువయిన ప్రదేశమయిన శ్రీహరి కోట నెల్లూరు జిల్లాలో సూళ్ళూరుపేట దగ్గర ఉన్నది. ఈ అంతరిక్ష కేంద్రం పేరు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, దీనినే షార్ అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలోని ఏకైక ఉపగ్రహ ప్రయోగ కేంద్రం. ఇక్కడనుండి ఎన్నో PSLV మరియు GSLV ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించారు. ప్రస్తుతం ఇక్కడ రెండు లాంచ్ ప్యాడ్‌లు ఉన్నాయి. ఈ రెండిటివల్ల ప్రతి ఏడాది 6 శాటిలైట్లను ప్రయోగించే వీలు ఉన్నది.

బలేశ్వర్

ఇది ఒరిస్సాలో ఉన్నది. శ్రీహరి కోటలో ఉన్నట్లు ఇక్కడ శాటిలైట్ల ప్రయోగానికి సౌకర్యాలు లేకున్నా,దీనిని ప్రధానంగా రాకెట్లను ప్రయోగించుటకు ఉపయోగిస్తారు.

విశిష్ట వ్యక్తులు

విక్రం సారాభాయ్

విక్రం సారాభాయ్

విక్రం సారాభాయ్

విక్రం సారాభాయ్ ఆగస్టు 12, 1919న అహ్మదాబాద్ నగరంలో ధనవంతుల కుటుంబంలో జన్మించాడు. మెట్రిక్యులేషన్ పూర్తి చేసిన తరువాత 1940లో కాలేజీ చదువుల కోసం కేంబ్రిడ్జ్ వెళ్ళిన సారాభాయ్ రెండవ ప్రపంచ యుద్ద కారణంగా భారతదేశం తిరిగి వచ్చాడు. కొద్ది రోజుల్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగుళూరులో ప్రొఫెసరుగా పనిచేస్తున్న సర్ సి.వి.రామన్ దగ్గర రీసెర్చి స్కాలరుగా చేరి అనతి కాలంలో భౌతిక శాస్త్రాన్ని, విశ్వకిరణాలను అధ్యయం చేసి తిరిగి 1945లో కేంబ్రిడ్జ్ వెళ్ళి పీహెచ్.డీ పూర్తి చేసి 1947 లో భారతదేశానికి వచ్చాడు.

1947 నవంబర్లో అహ్మదాబాదులో భౌతిక శాస్త్ర పరిశోధనాలయం ఏర్పాటు చేయడంలో సారాభాయ్ ముఖ్యపాత్ర వహించాడు. తన పరిశోధనలతో గొప్ప శాస్త్రవేత్తగా పేరు పొందిన సారాభాయ్ 1957 లో ప్రపంచంలో మొట్టమొదటి శాటిలైట్ అయిన స్పుత్నిక్ ప్రయోగం గురించి తెలుసుకొని భారత భవిష్యత్ అవసరాలకు శాటిలైట్ల అవసరం గురించి ఎంతో విషయ సేకరణ చేసి అప్పటి ప్రధానమంత్రి నెహ్రూను ఒప్పించి అంతరిక్ష పరిశోధనా విభాగాన్ని ఏర్పాటు చేయించాడు. సాంకేతిక పరిజ్ఞాన ఉపయోగాన్ని సామాన్యులకు అందుబాటులోకి తీసుకొని రావాలని, అప్పుడే మన దేశంలోని ఎన్నో సమస్యలను పరిష్కరించవచ్చని సారాభాయ్ తోటి శాస్త్రవేత్తలను ప్రొత్సహించేవాడు.

ఆయన ఆదర్శాలకు అనుగుణంగా ఇస్రో ఎన్నో విజయాలను సాధించి భారతదేశ ఖ్యాతిని ఇనుమడింపచేసింది. 'భారత అంతరిక్ష రంగ పితామహుడు ' అయిన విక్రం సారాభాయ్ సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయనను 1962లో శాంతి స్వరూప్ భట్నగర్ అవార్డుతో, 1966లో పద్మ భూషణ్ అవార్డుతో సత్కరించింది. సారాభాయ్ డిసెంబరు 30, 1971న మరణించాడు.

సతీష్ ధావన్

సతీష్ ధావన్ 25 సెప్టెంబర్, 1920న శ్రీనగర్లో జన్మించాడు. పంజాబ్ యూనివర్సిటీలో చదువుపూర్తి చేసిన తర్వాత సతీష్ ధావన్, 1947లో మిన్నియాపోలిస్‌లోని యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటాలో మరియు 1949లో కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసించాడు. భారతదేశం తిరిగి వచ్చిన అనంతరం బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో వివిధ పదవులు చేపట్టి, 1972లో విక్రం సారాభాయ్ అనంతరం ఇస్రో ఛైర్మెన్ పదవిని అలంకరించాడు. ఆ తరువాతి కాలంలో భారత అంతరిక్ష చరిత్రలో ఎన్నో గొప్ప విజయాలకు మూలకారకుడు అయ్యాడు.

సతీష్ ధావన్ సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1981లో పద్మ భూషణ్ అవార్డు ప్రదానం చేసింది. జనవరి 3, 2002న మరణించిన ఆయన స్మృత్యర్థం శ్రీహరి కోటలోని అంతరిక్ష కేంద్రానికి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అని పేరు పెట్టారు.

మాధవన్ నాయర్

మాధవన్ నాయర్ అక్టోబర్ 31, 1943లో కేరళలొని తిరువనంతపురంలో జన్మించాడు. 1966లో కేరళ యూనివర్సిటీ నుండి ఎలక్ట్రానిక్స్ విభాగంలో పట్టభద్రుడయిన మాధవన్ నాయర్ ఆ తరువాత ముంబైలోని ప్రతిష్టాత్మక భాభా అటమిక్ రీసెర్చ్ సెంటర్ (BARC) లో శిక్షణ పొందాడు.1967లో తుంబాలో చేరిన పిమ్మట SLV నిర్మాణంలో పనిచేసాడు. తరువాత PSLV ప్రాజెక్టు డైరక్టరుగా భారతదేశపు మొదటి ఉపగ్రహ ప్రయోగ వాహన నిర్మాణంలో కీలక పాత్ర వహించాడు.

1998లో ఆయనకు పద్మ భూషణ్ అవార్డు లభించింది. సెప్టెంబరు 2003 లో మాధవన్ నాయర్ ఇస్రో ఛైర్మెన్ పదవి చేపట్టినుండి ఇస్రో మరెన్నో ఉపగ్రహలను విజయవంతంగా ప్రయోగించి విజయ పరంపరను కొనసాగిస్తున్నది.

No comments: