నిరంతర వార్తా స్రవంతి

Saturday, March 1, 2008

తప్పులకు కూడా మనదే బాధ్యత

మంచి జరిగితే అంతా మా గొప్పలేనని చెప్పుకునే మనం తప్పు జరిగితే మాత్రం దాంతో తమకేమీ సంబంధం లేనట్టు తప్పించుకుంటుంటాం. సహజంగా ఆ తప్పులను ఇతరులపైకి నెట్టేసి, తమకేమీ తెలియనట్టు వ్యవహరిస్తుంటాం. అయితే ఏది జరిగినా పూర్తిగా తమదే బాధ్యత అని అంగీకరించిన నాడు మనలోని వ్యక్తిత్వం పరిపూర్ణం కాగలదన్న విషయాన్ని అందరూ ఒప్పుకుని తీరాల్సిందే. మనలోని అహం అందుకు కొంత అడ్డు తగులుతున్నప్పటికీ, వ్యక్తిత్వాన్ని నిరూపించుకునేందుకై దానిని సైతం అధిగమించాల్సి ఉంది. దీనికి ఓ కథను కూడా ఉదాహరణగా చెబుతున్నారు. పూర్వం విఠలాపురంలో రామలింగం నివసిస్తుండే వాడు. మహా పిసినారి అయిన అతను తన వద్దకు సాయం కోసం ఎవరొచ్చినా నిర్దయతో తిప్పిపంపే వాడు. అయితే అదే సమయంలో డబ్బు అంటే మహా పిచ్చి కలిగిన అతను అన్నిరకాల సంపాదన మార్గాల్ని వెతుకుతూ వచ్చాడు. అందులో భాగంగా తమ ఇంటి ముందు ఉన్న కొద్ది పాటి ఖాళీ స్థలంలో ఓ అందమైన పూల తోట వేశాడు. అతని అదృష్టం కొద్దీ ఆ తోట మంచి ఫలితాన్ని ఇవ్వడం ప్రారంభించింది. అయితే అనుకోకుండా ఓ రోజు అటువైపుగా వచ్చిన ఓ పశువు ఆ తోటలోకి అనుకోకుండా వెళ్లి కొన్ని మొక్కలను నాశనం చేసింది. వెంటనే కోపం కట్టలు తెంచుకున్న రామలింగయ్య దానిపై దాడి చేసి, కొట్టసాగాడు. అతని దెబ్బలు భరించలేక ఆ పశువు అక్కడే చనిపోగా, అతనికి గో హత్యా పాపం చుట్టుకుంది. అక్కడి నుంచి వరుసగా నష్టాలు రావడం ప్రారంభించడంతో చేసేది లేక దేవాలయాల చుట్టూ తిరగసాగాడు. ఓ రోజు పరమేశ్వరుడు అతని భక్తికి మెచ్చి కలలోకి వచ్చాడు. గో హత్యా పాపం నుంచి విముక్తి కోసం వంద పశువులను నెలరోజుల పాటు పోషించాలని సూచించాడు. అయితే మహా పిసిని గొట్టు అయిన రామలింగయ్యకు అదేదీ నచ్చలేదు. తానే తప్పు చేయకనే తనకెందుకు ఈ శిక్ష అని భగవంతుని కోరాడు. పశువును తాను చేతితో కూడా తాకలేదని, అసలు పాపమంతా దానికి దెబ్బతగిలేలా చేసిన కర్రదేనని వాదించాడు. దీనిని అతనికి సరైన పద్దతిలో వివరించాలనుకున్న పరమేశ్వరుడు అప్పటికి మౌనంగా ఊరుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత రామలింగయ్య ఇంటికి ఓ సాధ్వి వచ్చాడు. దోష నివారణ మార్గం అన్వేషిస్తున్న రామలింగయ్య ఆయనను సాదరంగా ఆహ్వానించాడు. ఇంటి ముందున్న పూదోటను చూడగానే ఆ సాధ్వి మొహంలో కొంత తేజస్సు కనిపించింది. ఎవరయ్యా ఇంత అందమైన తోటను ఏర్పాటు చేసింది అని రామలింగయ్యను ప్రశ్నించాడు. ఆయన వద్ద మెప్పు పొందాలనుకున్న రామలింగయ్య అంతా తన కృషేనని గొప్పగా చెప్పుకొచ్చాడు. ఇదే సమయమునుకున్న సాధ్వి ఇంత అందమైన తోట ఏర్పాటు పూర్తిగా నీ కృషి ఫలితమేనని చెప్పుకుంటున్న నీవు ఆ రోజు పశువుపై దాడికి మాత్రం కారణం కాదని ఎందుకు వాదిస్తున్నావు. సాధ్వి నుంచి ఈ ప్రశ్నను ఊహించని రామలింగయ్య తర్వాత తన వద్దకు స్వయంగా పరమేశ్వరుడే వచ్చి ఉపదేశించాడని తెలుసుకుని, తన పద్ధతులు మార్చుకున్నాడు. కాబట్టి గొప్పలు చెప్పుకుంటూ తప్పులను మాత్రమే ఇతరులపైకి నెట్టే పద్ధతి మానుకుంటే మనలోని వ్యక్తిత్వానికి పరిపూర్ణత చేకూరగలదు.

No comments: