నిరంతర వార్తా స్రవంతి
Saturday, March 1, 2008
హద్దులు దాటే డేటింగ్‌తో తస్మాత్ జాగ్రత్త
కాలానుగుణంగా వస్తున్న మార్పులకు తగ్గట్టు మనల్ని మనం మార్చుకోకుంటే సమాజంలో బాగా వెనుకబడిపోతామన్నది అంగీకరించదగ్గ విషయమే. అయినప్పటికీ దానికీ కొన్ని హద్దులు ఉంటాయని తెలుసుకోకుంటే మాత్రం ప్రమాదంలో పడకతప్పదు.పాశ్చాత్య దేశాలకు సరిపోతున్న కొన్ని సంప్రదాయాలు భారతీయ సంస్కృతి విలువల పరిరక్షణకు ఏమాత్రం తగదనే విషయాన్ని పిల్లలే కాక వారి తల్లి దండ్రులు కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం భారతీయ నగర ప్రాంతాల్లో ఈ సంస్కృతి రోజురోజుకూ విస్తరిస్తుండటం ప్రమాదకర సంకేతాల్నిఇస్తోంది.పెళ్లికి ముందు వధూవరులు ఒకరిపై ఒకరు పరస్పర అవగాహన తెచ్చుకునేందుకోస మని పాశ్చాత్య దేశాల్లో ప్రారంభమైన ఈ సంస్కృతి క్రమంగా అడ్డ దారులు తొక్కుతోంది. యువతీ, యువకులు ఒకే బైక్‌లో కలసి తిరగడం, సినిమాలు, షికార్లకు వెళ్లడం, ఒంటరిగా బస చేయడం వంటివన్నీ షరా మామూలై పోతున్నాయి.సినిమాల ప్రభావం కూడా దీనిపై కొంత ఉన్నప్పటికీ, సినిమాలలో చేసేవన్నీ నిజ జీవితానికి సరిపోవన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితి యువకుల కన్నా యువతులకే అధిక ప్రమాదకరమన్న విషయాన్ని కూడా తెలుసుకోవాలి.ఇప్పటివరకు కళాశాలల స్థాయిలో కొనసాగిన ఈ సంస్కృతి ప్రస్తుతం పాఠశాల స్థాయికి కూడా పాకిందంటే ఎంతటి స్థాయిలో అది విస్తరిస్తోందే అర్థం చేసుకోవచ్చు. కొందరికే ఈ డేటింగ్ సంస్కృతి పరిమితమైనప్పటికీ దీని ప్రభావం అందరిపైనా పడగలదు. ఈ కారణంగా చదువుకున్న అమ్మాయిలపై విశ్వాసం సన్నగిల్లే ప్రమాదముంది.ఇప్పటివరకు చదువుకున్న యువతులను పెళ్లాడేందుకు మొగ్గు చూపుతున్న యువకులు భవిష్యత్తులో ఈ డేటింగ్ సంప్రదాయానికి భయపడి నిరక్షరాస్యులే కావాలనుకునే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. వారి స్వీయానుభవాలు, చుట్టూ కన్పించే పరిస్థితులు వారిని ఈ పరిస్థితుల్లోకి నెట్టవచ్చు.ఈ డేటింగ్ కారణంగా చదువుకునే సమయాన్ని వృథా చేసుకోవడంతో పాటు జీవిత గమనాన్ని కూడా సరైన రీతిలో నడిపించలేని పరిస్థితి ఏర్పడగలదు.యువతీ, యువకుల మధ్య స్నేహం తప్పు కాదు కానీ స్నేహం పేరుతో హద్దు మీరే డేటింగ్ కార్యకలాపాలు సాగించడం మాత్రం మంచిది కాదు.తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో తమను ఉన్నత చదువులకు పంపుతున్నారన్న విషయాన్ని గుర్తెరిగితే ఇలాంటి అడ్డదారులు కన్పించవు. ఈ విషయంలో తల్లిదండ్రులు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కాకా ఎప్పటికపుడు తమ పిల్లల ప్రవర్తనను ఓ కంట కనిపెడుతూ ఉండాలి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment