నిరంతర వార్తా స్రవంతి
Saturday, March 1, 2008
జనన, మరణ ధ్రువపత్రాల జారీ ఇక వేగవంతం
హైదరాబాద్ మహానగరంగా (గ్రేటర్‌గా)విస్తరించిన నేపథ్యంలో ఇప్పటివరకు ఏఎంఓహెచ్‌ల పరిధిలో ఉన్న జనన మరణ ధ్రువపత్రాల జారీ అధికారాలను సర్కిళ్ల ఉప కమిషనర్ల (డిప్యూటీ కమిషనర్స్)కు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజా ఉత్తర్వులను జారీ చేసింది.జనన మరణాల ధ్రువీకరణ పత్రాలను జారీ చేసే అధికారం ఇప్పటివరకు సహాయ వైద్యారోగ్య అధికారులకు(ఎఎంవోహెచ్) మాత్రమే ఉంది. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉపకమిషనర్లకూ ఆ అధికారులు సంక్రమించాయి.గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు నేపథ్యంలో నగరాన్ని 18 సర్కిళ్లుగా విభజించారు. ఒక్కో సర్కిల్‌కు ఒక డిప్యూటీ కమిషనర్‌ను నియమించారు. అలాగే ఇన్నాళ్లు హైదరాబాద్ నగర అభివృద్ధి సంస్థ(హుడా) చేతుల్లో ఉన్న శివారు ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణ అనుమతులు ఇటీవలే గ్రేటర్‌కు ప్రభుత్వం బదలాయించిన సంగతి విదితమే.గ్రేటర్ హైదరాబాద్ అంతటికీ ఇకపై జనన మరణాల రిజిస్ట్రార్ ఒక్కరే ఉంటారు.ఇప్పటి వరకు రంగారెడ్డి,హైదరాబాద్ జిల్లాలకు వేర్వేరు రిజిస్ట్రార్లు ఉన్న సంగతి తెలిసిందే. శివారునున్న 12 మున్సిపాలిటీలు గ్రేటర్‌లో విలీనమైన నేపథ్యంలో ఆ ప్రాంతాలను కలుపుకొని మొత్తానికి ఇకపై ఒకే రిజిస్ట్రార్ ఉంటారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment