ఎక్కడికెళ్తున్నావన్న ప్రశ్నతోనే మొదలయింది!
ప్రియురాళ్ల కోసం కన్నీరయిన పాటల్ని ఎఱుపెక్కుతోన్న ప్రపంచోత్సవం కోసం వేడెక్కించాడు.
'నువ్వూ' 'నేననే' మహా రూపోత్సవపు దారుల్ని బద్దలు కొట్టి నేనుకి బహుంవచనాల్ని నేర్పి సెగలు పుడుతోన్న మహా సంగ్రామాల జ్వాలాముఖులవేపు కదం తొక్కించాడు.
ఆహ్లాదాన్ని పంచే కోయిలల గొంతుల్లో జీవితపు రణగొణధ్వనుల్ని వినిపించాడు.
ఇరు సంధ్యల వాకిట వాలిన ప్రియురాలి నల్లని మబ్బుల వాల్జడలో అరుణాశ్రువుల మంటల్ని సృష్టించాడు.
ఎక్కడికెళ్తున్నావన్న ప్రశ్నతోనేమొదలయింది. ఎన్నెన్ని కటువైన నిజాలని తోడాలన్న ప్రశ్నతోనే ప్రస్థానం మొదలయింది. నలుదిక్కుల కూడలిలో నుంచోబెట్టి మసకబారుతోన్న కళ్లలోకి అజ్ఙాతవాసాల వెలుగుల్ని చిమ్ముతున్నాడు.
మోహావేశాలన్నీ సొమ్మసిల్లేవేళ కడగండ్లకు కారణాలు వెతుకుతున్నాడు.
అతడి ఆయుధం ప్రశ్న.
సౌకుమార్యమైన అక్షరాలను దిగంబరం చేస్తున్నాడు.
వెలుగు అతడి ప్రకటన.
No comments:
Post a Comment