నిరంతర వార్తా స్రవంతి
Saturday, March 22, 2008
"సాక్షి"తో పోటీకి "ఆంధ్రజ్యోతి" సిద్ధం!
తెలుగులో మీడియా యుద్ధం పతాకస్ధాయికి చేరుకుంది. ఒకరి ప్లగ్ ను ఒకరు లాక్కోవడానికి ప్రయత్నించడం గతంలో కూడా జరిగినా ఇప్పుడు తీవ్ర యుద్ధం జరుగనుంది. సోమవారం ఉదయం వైఎస్ రాజశేఖరెడ్డి తనయుడు వైఎస్ జగన్ ప్రియ పత్రిక "సాక్షి" భారీ ఎత్తు న ప్రారంభం కానుంది. సోమవారం ఉదయం సాక్షి తెలుగు పాఠకుల ముందు సాక్షాత్కరించనుంది.ఏ దినపత్రికైనా ప్రాంరంభ దినాన మాల్ మసాలా సిద్ధం చేసుకోవడం సహజం. గతంలో అంటే 1983లో డెక్కన్ క్రానికల్ ను ఢీకొట్టే రీతిలో రామోజీరావు న్యూస్ టైమ్ అనే ఆంగ్ల పత్రికను ప్రారంభించారు. అప్పటికే హైదరాబాదీలతో మమేకమై, ఇరానీ చాయ్ లో భాగమైన డెక్కన్ క్రానికల్ ను తన మార్కెటింగ్ సిల్స్ తో చిత్తు చేయగలనని రామోజీరావు అనుకున్నారు. రామోజీరావు నుంచి గట్టి పోటీ ఉంటుండని డెక్కన్ క్రానికల్ యాజమాన్యం కూడా ఊహించింది. న్యూస్ టైం విడుదలకు ముందు రోజున డెక్కన్ క్రానికల్ టీం ఒక మంచి బ్రేకింగ్ స్టోరీని సిద్ధం చేసుకుంది. న్యూస్ టైం చక్కటి డిజైన్ తో విడుదలైనా మంచి న్యూస్ స్టోరీలు లేకపోవడం వల్ల మొదటి రోజే మార్కెట్ లో వెలా తెలా పోయింది.ఇప్పుడు ఆంధ్రజ్యోతి దినపత్రిక కూడా కొత్త పత్రిక నుంచి పోటీని తట్టుకోడానికి ఒక పకడ్బందీ వ్యూహాన్ని రూపొందించుకున్నట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ "జల్సా" విడుదల రోజునే తన రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేస్తారని, వివరాలకు రేపటి సంచిక చదవాలంటూ ఆంధ్రజ్యోతి నేడు మొదటి పేజీలో ఒక ప్రకటన లాంటి వార్తను ప్రచురించింది. లక్షల సంఖ్యలో ఉన్న పవన్ , చిరు అభిమానులు రేపు ఆదివారం ఆంధ్రజ్యోతిని కొని చదవడం ఖాయం. సోమవారం ఉదయం చిరంజీవి రాజకీయాల మేనిఫెస్టోపై భారీ కథనాలను ఆంధ్రజ్యోతి ప్రచురించనుంది.కేవలం ధన బలంతో రంగుల హంగులతో "సాక్షి" పత్రిక వస్తోంది కానీ, దానిలో ఇన్వెస్టిగేటివ్ స్పిరిట్ గానీ, విశ్లేషణా సామర్ధ్యం గానీ ఉండదని ప్రాక్టికల్ గా చెప్పడానికి ఆంధ్రజ్యోతి సిద్ధమవుతోంది. రంగులు మాత్రమే సరిపోవని, కాస్తంత ఉప్పూ కారాన్ని తెలుగు ప్రజలు ఆశిస్తారని బాగా గ్రహించిన ఆంధ్రజ్యోతి ఈ విధంగా తన మార్కెట్ షేర్ ను కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకుంది.అంతర్జాతీయ స్ధాయి లే అవుట్, అన్ని రంగుల పేజీలు, కొంతకాలం ఉచిత సరఫరా వంటి ప్లస్ పాయింట్లతో వస్తున్న "సాక్షి" మసాలా లేకుండా మనుగడ సాగించడం కష్టమే. హిందూ దినపత్రికలాగా మడి కట్టుకుని వందేళ్ళు జీవించడం సందేహమే. ఎన్ని రంగుల హంగులున్నా గరం మసాలా లేని ప్రొడక్ట్ ను తెలుగువారు ఆదరించిన సందర్భాలు దాదాపు లేవు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment