నిరంతర వార్తా స్రవంతి

Friday, March 14, 2008

అనుభూతి - విభూతి

అద్భుతమైన విషయాలని, సృష్టి రహస్యాలని దాచిపెట్టడం, అర్హులైన వారికి అందించడం మన భారతీయులకి సాధారణమైన విషయం. మంత్ర శాస్త్రంలో ఈ రహస్యాలు, సాధనా పద్ధతులు గోప్యంగా ఈనాటికి గురువులనుండి శిష్యులకి, వారినుండి వారి శిష్యులకి అందుతూనే వున్నాయి. కాసేపు నమ్మడం, నమ్మకపోవడం పక్కన పెట్టి ఈ ఆధ్యాత్మిక రంగంలో ధ్యాన జ్యొతిర్మంత్ర తంత్ర యంత్ర రంగాలలో కొన్ని నమ్మకాలని, పుకార్లని ఇంకా కధలని చూద్దాం.

సుమారు ఐదు దశాబ్దాల క్రిందనించి నేటికి ఉజా బోర్డు పాశ్చాత్య ప్రపంచాన్ని ఉర్రూతలూగించింది. ఆంగ్లంలో అక్షరాలని వర్తులాకారంగా వ్రాసి మధ్యలో ఒక గ్లాసు కాని లేక నాణెం కాని వుంచుతారు. దాని మీద కనీసం నలుగురు వ్యక్తులు చుట్టూ కూచుని తేలికగా వేళ్ళు పెడతారు. దీని ద్వారా లోకాతీతమైన వ్యక్తులతో సంభాషించ వచ్చునని కొందరి నమ్మకం. ఇది భారతదేశాన్ని, మారు మూల గ్రామాలని కూడా చేరింది. ఒక చిన్న సంఘటన ఇలా వుంటుంది. ఫలితాలు, నిజానిజాలు దైవాధీనాలు.

అక్కడ, తెలంగాణాలో ఒక చిన్న పల్లెటూరు. రాత్రి 9 గంటల సమయం. ఆ గదిలో సుమారు ఓ పది మంది దాకా వున్నారు - గుండ్రంగా కూచుని. వారిమధ్యలో ఒక పెద్ద చెక్క బల్ల దానిమీద అక్షరాలు వున్నాయి. అవును, కాదు అని రాసి వున్నాయి. అంకెలు కూడా రాసివున్నాయి. మధ్యలొ ఆ బల్లకి దగ్గరగా నలుగురు కూచుని వున్నారు. అందరు పెద్దలే వున్నారు పిల్లలెవరిని అక్కడికి రానివ్వరు. నెమ్మదిగా కార్యక్రమం మొదలైంది. మధ్యలో వున్న పెద్దామె కల్లు మూసుకుని ధ్యానం చేసింది. ఆమె, పక్కనే వున్న ఇంకో నలుగురు ఆ చక్క మధ్యలో ఉన్న గ్లాసు మీద వేళ్ళు సున్నితంగా వుంచారు. ఆ పెద్దామె నెమ్మదిగా పిలిచింది - మనుషులని పిలచినట్లు - "స్వామీ! రండి. నేను పిలుస్తున్నాను. ఈ గ్లాసులోకి వచ్చి మా ప్రశ్నలకి సమాధానాలు చెప్పండి. మిమ్మల్ని నమ్మి వీళ్ళంతా ఎక్కడెక్కడినించో వచ్చారు". అందరు ఆసక్తిగా చూస్తున్నారు. ఆమె ఆ చుట్టుపక్కల పేరెన్నికగన్న ఉపాసకురాలు. ఉజాబోర్డు వుపయోగించి ఆ పల్లెవారికి సలహాలని 'దేవతల ద్వారా ' తెలుసుకుని సహాయం చేస్తుంది. ఉచితంగాను, నిస్వార్ధంగాను సహాయం చేయటం వల్ల అందరికి గౌరవంకూడా వుంది. మొగుడుపెళ్ళాల గొడవలనించి, పరిక్షఫలితాల దాకా అందరు అడుగుతారు. ఐతే ఆమె ఎవరి దగ్గరా ఏమి తీసుకోదు. కొందరు ఈ బోర్డు మీదకి చనిపోయినవారిని కూడా పిలుస్తారు. అది ప్రకృతి విరుద్ధం అని, మంచిది కాదని ఆమె నమ్మకం. ఆమే కేవలం తను నమ్మిన భగవంతుడినే పిలుస్తుంది.

"స్వామీ ఎక్కడున్నారు? త్వరగా రండి. వస్తే యస్ చూపించండి" అంది ఆర్తిగా. గ్లాసు నెమ్మదిగా కదలడం మొదలుపెట్టింది - దానంతట అదే! అక్కడికి మొదటి సారి వచ్చిన వారు ఆశ్చర్యం దాచుకోలేక "ఓ !" అని అరిచారు. కొందరు దండం పెట్టుకుంటే కొందరు లెంపలు వేసుకున్నారు. అంతలో గ్లాసు 'యస్ ' అన్న పదం మీదకి వెల్లి మళ్ళీ వెనక్కి వచ్చింది. చూస్తున్నవారిలో కొందరికి అనుమానం లేకపోలేదు - వేలుపెట్టిన నలుగురిలో ఎవరో అది కదుపుతున్నారేమోనని!

"స్వామీ ఇక్కడికి వచ్చిన ఈ దంపతుల ఇంట్లో కొంత ధనం పోయింది. ఎవరు తీసారో చెప్పండి" అని ఆమె అడిగింది. గ్లాసు కదలడం మొదలైంది - కొందరికి ఒళ్ళు గగుర్పొడిచింది. ఒక్కొక్క అక్షరం మీదకి వెడుతూ పదాలూ, వాక్యాలు ఇంగ్లీషులో రావడం మొదలయ్యాయి. వూళ్ళో లెక్కల మాష్టారు అందరి సౌకర్యార్ధం తెనుగించారు. "ఈయన భార్యే ఆ డబ్బు తీసుకుంది" అని. ఆ వచ్చిన ఆసామి భార్య వేపుచూసాడు - నిజమా అన్నట్లు. ఆమె తలవూపింది, అంగీకారంగా. ఇంతలో గ్లాసు మళ్ళీ పరుగు పెట్టింది. ఈ సారి అందరూ ఊపిరిబిగబట్టి చూస్తున్నారు.మల్లీ తెలుగు అనువాదం - "ఆమె ఆ డబ్బు దుర్వినియోగం చెయలేదు, తల్లి ఆరోగ్యానికి వాడింది. భర్త తిడతారని చెప్పలేదు అంతే!".

"ఇది నిజమా అమ్మా? " అని అడిగారు ఉపాసకురాలు. ఆమే అవునని, ఇది నిజమేనని అంగీకరించింది. వచ్హినాయన కూడా ఆనందంతో నవ్వేసాడు. తర్వాతి వ్యక్తి వెళ్ళిపోయిన దూడ గురించి అడగడానికి ముందుకి జరిగాడు.

కొన్ని నమ్మకాలో మరి అద్భుత శక్తులో తెలియదు కాని చూడ్డానికి చాలా బాగుంటాయి. ఏ శక్తి ఐనా లోకోపకారం జరిగితే ఇంకా బాగుంటుంది.

ఉపాసకులకి, ధ్యానం చేసేవారికి చిత్రమైన అనుభవాలు కలుగుతుంటాయి. యోగవాసిష్టం, పతంజలి యోగసూత్రాలనించి నేటి దాకా అనేకమంది సద్గురువులు వీటిని గురించి మనకి చెప్పారు. సాధనలో ముందడుగు వేసేకొద్దీ ఈ అనుభవాలు చక్కగా వుంటాయిట. ఒకాయన రోజూ పతంజలి యోగ సూత్రాలలో "మైత్రి" అనే సిద్ధిమీద ధ్యానం చేసేవారుట. కొన్నాళ్ళకి ఆయనకి ఒక చిత్రమైన అనుభూతి మొదలైంది - ధ్యానం చేస్తున్నప్పుడల్లా ఎవరో భుజం మీద చెయ్యి వేస్తున్నట్లు. వారి గురువు గారిదగ్గరకు వెళ్ళి అడిగారు, ఏమిటీ ఈ వింతా అని. ఆయన చెప్పారుట, "నువ్వు చెట్టుకింద కూచుని 'స్నేహం' అనే సిద్ధి మీద ఏకాగ్రత చేస్తున్నావు. కనుక ఆ సర్వ వ్యాప్త శక్తి నీ భుజం మీద చెయ్యి వేసి పలకరిస్తోంది అని.
సాధన ప్రారంభించాక సాధకుడు తానున్న స్థితినించి ఎలా ప్రయానిస్తాడో ఏ అనుభవాలని పొందుతాడో అతని కుండలిని శక్తి స్థితి తెలియజేస్తుందని శాస్త్రాలు చెపుతున్నాయి. కుండలిని గురించి చెప్పాలంటే అదొక సముద్రమే అవుతుంది. యోగ శస్త్రం కుండలిని గురించే చెప్పే విషయాలని ఇలా క్లుప్తంగా చెప్పొచ్చు. ప్రతి జీవ రాసిలోనూ ఒక నిక్షిప్త ప్రాణ శక్తి వుంటుంది. అది వెన్నెముక మొదట మూలాధార చక్రంలో నిద్రాణమై వుంటుంది. జీవి వున్నత స్తితిని చేరే కొద్దీ ఒక్కొక్క చక్రాన్ని దాటుకుని కుండలిని పైనున్న చక్రాలలోకి చేరుతుందిట. మూలాధారం నించి బయలుదేరిన జీవన ప్రయాణం సహస్రారం దగ్గర అంతమవుతుంది, మనిషి మనీషిగా అవుతాడు అంటున్నాయి వేదాలు. అధర్వణ వేదంలో ఎన్నో కుండలిని రహస్యాలు సాధనలు కూడా వున్నాయిట. కుండలిని అనేది ఒక సహజ శక్తి అని యోగులు చెపుతున్నారు. ప్రతి మనిషిలోనూ, ప్రతి జీవిలోనూ ఇది వుంటుందిట. హఠ యోగ మార్గమైన ప్రాణాయామం, ఆసనాల ద్వారా కానీ లేక మనో యోగమైన ధ్యానం వల్లకానీ లేకపోతే మంత్రోపాసన ద్వారా దివ్యశక్తి అనుగ్రహాన్ని పొందికాని ఉన్నతమైన కుండలిని స్థితులని చేరవచ్చునట. అందుకే లలితాసహస్ర నామంలో చెపుతారు, "ఆజ్ఞా చక్రాంతరాళస్థా రుద్రగ్రంధి విభేదిని..."అని. లలితా మహాదేవి శ్రీ చక్రరాజ నిలయగా, సాధకుని కుండలిని శక్తిని పైకి తీసుకెళ్ళమని ప్రార్ధిస్తున్నరన్నమాట. నవావరణ నిర్మితమైన శ్రీ చక్రం కుండలిని చక్రభరితమైన మానవ దేహానికి, సూక్ష్మంగా, చిన్న రూపంలో విశ్వవ్యాప్త పరబ్రహ్మ శక్తికి చిహ్నంట. పురుష సూక్తం అంటే "మొగవారి" సూక్తముకానీ, పొగడ్డంకానీ కాదు. పురు+ష=హృదయంలో నివశించేవాడు, అంటే అందరి హృదయాలలో కుల,మత,ప్రాంత,వయో,లింగ భేదం లేకుండా వుండే వొక శక్తి. దాన్నే మంత్రం పుష్పంలో, "నీలతో యద మధ్యస్థా....విద్యుల్లేఖేవ భాస్వరా..." అంటూ వర్ణించారు. క్రైస్తవులు కూడా జీసస్ ను హృదయభాగంతో వెలుగుతోనూ చిత్రీకరించడం అక్కడక్కడా కనిపిస్తుంది. హృదయం దగ్గర చెయ్యి పెట్టుకుని "నేను నేను " అంటుంటాం. ఈ నేనుగా చెప్పబుడుతున్నది ఎవరు? చెపుతున్నది ఎవరు? అసలు నేను ఎవరు? తెలుసుకోమన్నారు రమణ మహర్షి. ఆ నేనుని అన్వేషిస్తే నీలోనే అన్నీ దర్శనమౌతాయి, నీ భావాల బింబం సృష్టిలోనూ, సృష్టి ప్రతిబింబం నీలోనూ కనిపిస్తుంది అని ఉపనిషత్తులు కూడా చెపుతున్నాయి.

"విశ్వం దర్పణస్యమాన నగరీ తుల్యం ..నిజాంతర్గతాం..." అన్న దక్షిణామూర్తి స్తోత్రం అంతరార్ధం ఇదేనట. అద్దంలో నగరం అంతా ఎలా కనిపిస్తుందో, అలాగే సకల చరాచర జగత్తూ దక్షిణామూర్తిగా ప్రభవిస్తున్న శివునిలో కనిపిస్తున్నదిట.ఇక్కడ ఇంకో రహస్యం కూడావుందని యోగులు చెప్పారు. దక్షిణం అంటే కుడి వైపు. మానవ దేహంలో నేను అని మనం గుండెల మీద ఎడం వైపు చెయ్యి వేసుకుని చెపుతామే ఆ ఆత్మతత్వం కేంద్రంగా వుంటే, కుడి వైపు పరమాత్మ నిలయం గా దక్షిణామూర్తిగా వుంటాడుట. అందుకే ఆ పరమాత్మ అనుగ్రహం పొందటం కోసం దక్షిణావృత శంఖాన్ని అభిషేకానికి వాడతారు.

కుండలిని శక్తిని సర్పంగా చిత్రీకరించడం, చిహ్నాలుగా వాడ్డం ఆనవాయితి। శివునిమెళ్ళోనూ వున్నదీ, విష్ణువు తలకింది ఆదిశేషువు కుండలినియేనని చెపుతున్నారు. చివరి బైబిల్ లో కూడా ఆడం, ఈవ్ ల వద్ద కనిపిస్తుంది ఒక పాము. అది కుండలినియే అని కొందరు 'న్యూ ఏజ్ ' సాధకుల అభిప్రాయం. ఆధునిక వైద్యరంగం కూడా దీన్నే చిహ్నంగా వాడుతోంది. ఈ చిత్రం విచిత్రం చూడంది. ఇలా సృష్టిలో ఎన్ని చిత్రాలున్నాయో అని పిస్తుంది. మరిన్ని విశేషాలు వివరాలూ వచ్చే సంచికల్లో చూద్దాం.


శ్రీ గురుభ్యో నమః

No comments: