నిరంతర వార్తా స్రవంతి

Thursday, March 13, 2008

తెల్లకాగితం... మనిషి జీవితం!

-కొల్లూరి సోమశంకర్


“బాబూ, అన్నం తిందూగాని రా”
అమ్మ పిలుస్తోంది. వంటిట్లోకి వెళ్ళాను. కంచంలో చూసాను. అది పేరుకే అన్నం. కానీ మేము తినేది ఉడికించిన నూకల ముద్ద. నెలాఖరు వచ్చేసరికి ఇంట్లో బియ్యం ఉండవు. కూరగాయలు కూడా రెండు వారాలకొకసారి కొంటాం. ఎక్కువగా ఆకుకూరలే తింటాం. రెండు రోజుల నుంచి అమ్మ ఆకుకూరలు కూడ కొనడం లేదు. నూకల జావలో ఉల్లిపాయ ముక్కలు నంచుకోడం.. లేదంటే నూకల ముద్దని పచ్చికారంతో తినడం. ఇదే మా భోజనం!

నాకేడుపొస్తోంది. ఓ పదిరోజుల నుంచి మా ఇంట్లో అందరం కలిసి తినడం లేదు. నాకు చెల్లికీ పెట్టాక, మమ్మల్ని పడుకోబెట్టి అప్పుడు తింటున్నారు అమ్మానాన్న…! నిజంగా తింటున్నారో లేదో నాకు తెలియదు. చెల్లి గబగబా తినేసి, గ్లాసుడు నీళ్ళు తాగేసింది. నేను కూడ అదే చేసాను. కారంగా ఉన్నా తప్ప లేదు.

స్కూలు తెరచి నెల రోజులవుతోంది. మేము ఇంకా పుస్తకాలు కొనుక్కోలేదు. టెక్స్ట్ బుక్స్ అయితే సెకండ్ హాండ్ వి కొంటాం. లేదంటే ఎవరైనా పై తరగతి కుర్రాడిని బతిమాలి తీసుకుంటాం. ఇప్పటికి ఒక్క లెక్కల పుస్తకం తప్ప, మిగిలినవన్నీ దొరికాయి. అయితే కొన్నింటికి ముందు పేజీలు, మరికొన్నింటికి వెనుక పేజీలు లేవు. టెక్స్ట్ బుక్స్ కొత్తగా కొనుక్కున వాళ్ళని అడిగి ఆ పేజీలు జిరాక్సు తీయించుకుందాంలే అని నాన్న అన్నాడు. ఇంక నోట్ బుక్స్ సంగతి చూడాలి.

నాకెప్పుడు కొత్త నోట్ బుక్స్ ఉండవు. నాన్న ట్రాన్స్ పోర్టు కంపెనీలో పని చేస్తాడు. వాళ్ళ ఆఫీసులో ప్రింటర్ కి కార్బన్ పెట్టి ఉపయోగిస్తారట. వాడి పాడేసిన ఆ కాగితాలను తెచ్చి పుస్తకంలా కుట్టి ఇచ్చాడు. ‘ప్రస్తుతానికి దీంట్లో రాసుకో. మెల్లిగా నోటుబుక్సు ఏర్పాటు చేస్తాను’ అని చెప్పాడు. నాన్న ఇంటికి వచ్చాక అడగాలి.

ఇంతలో యూనిఫాం సంగతి గుర్తొచ్చింది.
“అమ్మా… యూనిఫాం…”
“నాన్న వాళ్ళ ఫ్రెండు కొడుకు గిరి మీ స్కూల్లోనేగా చదివేది. ఆ అబ్బాయికి ఈ సారి కొత్త యూనిఫాం కుట్టిస్తున్నారట. పాత యూనిఫాంని నీకివ్వమని అడిగారు. వాళ్ళు ఒప్పుకున్నారట”
“అది కాదమ్మా… గిరన్నయ్య రెండేళ్ళు వాడాడు ఆ యూనిఫాంని….”
“అయితేనేం, ఎక్కడా కొంచెం కూడ చిరగలేదట. ప్రస్తుతానికి అది వాడుకో. పండగకి కొత్త యూనిఫాం తీసుకుందాం” అంటూ అమ్మ నన్ను బుజ్జగించింది.
ఇంతలో నాన్న రావడంతో, నన్ను పడుకోమని చెప్పి అమ్మ అక్కడ్నించి కదిలింది.

* * * * * *

ఓ వారం రోజులు గడిచాయి. లెక్కల టెక్స్ట్ బుక్ దొరకలేదు. యూనిఫాం మాత్రం వచ్చింది. అమ్మ దాన్ని శుభ్రంగా ఉతికిచ్చింది. నోట్ బుక్స్ కోసం నాన్న ఓ ఆలోచన చేసాడు. పరీక్షలు పాసయి, పై తరగతికి వెళ్ళిపోయిన పిల్లలు అమ్మేసిన నోట్సులలో మిగిలిపోయిన తెల్లని పేజీలన్నింటిని తిరిగి కొన్నాడు. వాటిని పుస్తకాలుగా కుట్టి అట్టలు వేసి ఇచ్చాడు. కొత్త పుస్తకాలు కొనుక్కోవాలన్న నా కోరిక తీరనే లేదు.
ఈ పూట స్కూలు ఆయిపోయి సాయంత్రం ఇంటికొచ్చాను. లెక్కల పుస్తకం ఎలా సంపాదించాలాని చూస్తున్నాను. అమ్మ తెలిసున్న వాళ్ళింట్లో అడిగిందట. అందరూ తమ చుట్టాల పిల్లలకి ఇచ్చేసామని చెప్పారుట. నాకేడుపొచ్చింది.
“అమ్మా, పుస్తకం తీసుకెళ్ళకపోతే మాస్టారు కొడతారేమో…” అన్నాను.
” ఏం కొట్టరులే. రేపు నేనొచ్చి చెబుతాను” అంది అమ్మ. కానీ నాకు భయం పోలేదు.
అప్పుడు అమ్మ నన్ను, చెల్లిని దగ్గరికి తీసుకుని, బోలెడు కథలు చెప్పింది. నాకు కాస్త ధైర్యం వచ్చింది. “మీకు ఓ పద్యం నేర్పుతాను” అంటూ అమ్మ ఈ పద్యం చెప్పింది.

ఆపదలందు ధైర్య గుణ, మంచిత సంపదలందుఁ దాల్మియున్,
భూప సభంతరాళమునఁ బుష్కల వాక్చతురత్వ, మాజి బా
హా పటు శక్తియున్, యశమునం దనురక్తియు, విద్య యందు వాం
ఛా పరివృద్ధియున్, బ్రకృతి సిద్ధ గుణంబులు సజ్జనాళికిన్

తర్వాత దాని అర్థం వివరించింది. ఇలా అమ్మ మాకు చాలా పద్యాలు నేర్పింది. వాటిల్లో నాకు చాలా వరకు కంఠతా వచ్చు.

* * * * * *

మర్నాడు లెక్కల పీరియడ్లో మాస్టారు పుస్తకం గురించి అడగనే అడిగారు. నేను భయం భయంగా అమ్మ వచ్చి మాట్లాడుతుందని చెప్పా. ఆయన నాకేసి ఉరిమి చూసి, ‘ ఏడిసావు లే పో’ అని అన్నారు. కాసేపటికి మా అమ్మ వచ్చింది. ఆయనతో మాట్లాడి, ఆయన చేతిలో ఉన్న కొత్త లెక్కల పుస్తకాన్ని తీసుకుని బయటకి వెళ్ళింది.

తర్వాత తెలుగు పీరియడ్. మాస్టారు పాఠం చెబుతుండగా ఓ నోటీసు వచ్చింది. అవతలెల్లుండి డి. ఇ. ఓ గారు బడికి ఇన్‌స్పెక్షన్ కి వస్తున్నారని, పిల్లలందరూ శుభ్రంగా ఉతికిన బట్టలు వేసుకుని, అన్ని పుస్తకాలు తీసుకుని స్కూలికి రావాలని సందేశం. తెలుగు మాస్టారు ఇవన్నీ మాకు చెప్పి, ” ఒరే పిల్లలూ, వచ్చే డి. ఇ. ఓ గారు మిమ్మల్ని ఏదైనా వ్యాసం రాయమని అడగొచ్చు. ఓ ఠావు తెల్లకాగితం తెచ్చుకోండి. గుండ్రటి దస్తూరితో చక్కగా రాయండి” అంటూ మమ్మల్ని హెచ్చరించారు. ఆ రోజు మిగతా మాస్టార్లందరూ కూడ ఇదే మాట చెప్పారు. ఏ పీరియడ్లోనైనా డి. ఇ. ఓ గారు రావచ్చని, కాబట్టి అప్పటివరకూ చెప్పిన పాఠాలన్నింటిని బాగా చదువుకుని రావాలని చెప్పారు. లెక్కల మాస్టారు నా టెక్స్ట్ బుక్ గురించి మళ్ళీ గుర్తు చేసారు.

ఇప్పుడు నా సమస్యలు రెండు. ఒకటి లెక్కల పుస్తకం, ఇంకోటి తెల్ల కాగితం…..
‘లెక్కల పుస్తకం సంగతి అమ్మ చూస్తానంది. ఠావు తెల్ల కాగితం నాన్నని అడగాలి’ అని అనుకుంటూ ఇల్లు చేరాను. రాత్రి నాన్న ఇంటికి వచ్చాక తెల్లకాగితం గురించి అడిగాను. గడువు చెప్పేసాను. ఆయన ‘చూద్దాంలే’ అని అన్నాడు. నేను హాయిగా నిద్రపోయాను. ఆ రాత్రి మధ్యలో మెలకువ వచ్చినప్పుడు చూస్తే, అమ్మ ఏదో రాస్తూ కూర్చుంది. తెల్లారింది. నేను స్కూలికి, నాన్న ఆఫీసుకి వెళ్ళిపోయాం. నేను సాయంత్రం ఇంటికి వచ్చేసరికి, అమ్మ ఇంకా రాస్తునే ఉంది. మమ్మల్ని చూసి, రాయడం ఆపి, పుస్తకాలు పక్కనబెట్టింది.
“కాళ్ళు చేతులు కడుక్కుని రండి, కాసిన్ని బఠానీలు తిని పాలు తాగుదురుగాని” అని అంది. అమ్మ కుడిచేతి వేలొకటి వాచిపోయి కనబడింది.
“ఏమైందమ్మా?” అని అడిగాను.
“ఏం లేదురా, చాలా సేపటినుంచి రాస్తున్నా కదా, అందుకే ఇలా అయ్యింది”
ఏం రాస్తోందో అని పరిగెత్తుకు వెళ్ళి గూట్లో పెట్టిన పుస్తకాన్ని చూసాను. నా లెక్కల టెక్స్ట్ బుక్ ని మక్కీకి మక్కీ తిరిగి నోట్సులో రాస్తోంది అమ్మ. దాదాపుగా అయిపోయింది. నేను అమ్మని చుట్టేసుకుని ఏడ్చేసాను.
“ఏడుపెందుకురా? డబ్బులు పెట్టి ఎలాగు పుస్తకం కొనలేకపోయాను. కనీసం చేత్తో అయినా రాసిద్దామని ఆనుకున్నాను….” అంటూ నన్ను ఓదార్చింది, తన కళ్ళ వెంట నీళ్ళు కారుతుండగా.
రాత్రి నాన్న వచ్చాక, తెల్ల కాగితం గురించి అడిగాను. ‘మర్చిపోయానురా, రేపు తెస్తాలే’ అని అన్నారు. నాకు నీరసం ముంచుకొచ్చింది. చెప్పిన గడువులోగా తెల్లకాగితాన్ని సంపాదించగలనో లేదో తెలియదు. ఇలాగే ఇంకో రోజు కూడ గడచిపోయింది. అమ్మ లెక్కల పుస్తకాన్ని పూర్తిగా రాసేసి, మాస్టారికి తిరిగిచ్చేసింది. అంత లావు పుస్తకాన్ని రెండు రోజులలో చేత్తో పూర్తిగా రాసేసినందుకు ఆయన ఆశ్చర్యపోయారు. అమ్మ ఆయనకి థాంక్స్ చెప్పి వెళ్ళిపోయింది.

మొత్తానికి నాన్న నాకీ పూట ఓ ఠావు తెల్లకాగితం తెచ్చిచ్చాడు. వాళ్ళ ఆఫీసునుంచి తెచ్చాడట. ఇలా కొత్త కాగితాన్ని ఆఫీసునుంచి తీసుకురావడం నాన్నకి అస్సలిష్టం లేదట! కానీ నా గోల భరించలేక తెచ్చానని అమ్మతో అంటుంటే విన్నాను.
ఏమైతేనేం, నేనిప్పుడు బడికి ధైర్యంగా వెళ్ళగలను.

* * * * * *

మర్నాడు ఉత్సాహంగా బడికి వెళ్ళాను. డి. ఇ. ఓ గారు వచ్చే రోజిది. ఆయన ఎప్పడొస్తారా అని అందరూ ఎదురుచూస్తున్నారు. తెలుగు పీరియడ్ మొదలైంది. మాస్టారు కంగారు పడిపోతున్నారు. పిల్లలందరినీ హెచ్చరిస్తున్నారు. ఉన్నట్లుండి ఆయనకేదో గుర్తొచ్చింది. “ఏమర్రా? తెల్ల కాగితం తెచ్చుకున్నారా?” అని అడిగారు.

నేను తప్ప మిగిలిన అందరూ ‘తెచ్చుకున్నాం సార్’ అంటూ అరిచారు. ” ఏరా నువ్వెందుకు తెచ్చుకోలేదు?” అని గద్దించారు మాస్టారు. నేను ఏదో చెప్పబోయేలోగా, నా దగ్గరికి వచ్చి, నా నడ్డి మీద ఒక దెబ్బ వేసారు. అప్పటి కాని ఆయన కోపం చల్లారలేదు.
తెల్ల కాగితం ఎందుకు తెచ్చుకోలేదని మళ్ళీ అడిగారు.

“తెచ్చుకున్నాను సార్! కాని ఇంటర్వెల్లో నాల్లో తరగతి చదువుతున్న శీను ఏడుస్తూ కనిపించాడు. ఎందుకేడుస్తున్నాడో అడిగాను. మీరు వాళ్ళ క్లాసులో కూడ చెప్పారట కదా సార్ - తెల్ల కాగితం తెచ్చుకోమని! ఎంత ప్రయత్నించినా వాడికి తెల్ల కాగితం దొరకలేదట. అందుకని నా తెల్లకాగితం వాడికిచ్చేసాను. నా దగ్గర కనీసం ఒక సైడు వాడిన కాయితాల పుస్తకం ఉంది. వాడికి అది కూడ లేదు సార్….” అని చెప్పాను.

మాస్టారు ఒక్క నిమిషం మౌనంగా ఉండిపోయారు. ఆయన ఏదో అనబోతుండగా హెడ్ మాస్టారు, డి. ఇ. ఓ గారు మా క్లాసులోకి వచ్చేసారు. పిల్లలందరూ ఆయనకి నమస్కరించి, తెల్ల కాగితాలు ముందేసుకుని ఆయన ఏదైనా చెబితే రాయడానికి సిద్ధమైపోయారు.
“పిల్లలూ, ఇది తెలుగు పీరియడ్ కదా, మీకెవరికైనా ‘ఏఱకుమీ కసుగాయలు’ అనే సుమతీ పద్యం వస్తే లేచి చెప్పండి. పద్యం చెప్పి అర్థం కూడ వివరించాలి…” అన్నారు డి. ఇ. ఓ గారు. నాకా పద్యం తెలుసు. అమ్మ ఎప్పుడో చెప్పింది. వెంటనే నేను లేచి ఆ పద్యం చదివి దాని అర్థం వివరించాను. వెంటనే ఆయన ‘శభాష్’ అని అన్నారు. హెడ్ మాస్టారు, తెలుగు మాస్టారు నాకేసి మెచ్చుకోలుగా చూసారు. కొన్ని క్షణాల తర్వాత డి. ఇ. ఓ గారు, హెడ్ మాస్టారు గారు మా గదిలోంచి వెళ్ళిపోడంతో వాన వెలసినట్లయ్యింది.

* * * * * *

ఇప్పుడు నా దగ్గర రెండు వందల పేజీల తెల్ల కాగితాల లాంగ్ నోట్ బుక్స్ ఆరు ఉన్నాయి. మా తెలుగు మాస్టారు నాకు వాటిని బహుమతిగా ఇచ్చారు.

No comments: