నిరంతర వార్తా స్రవంతి

Thursday, February 21, 2008

చినుకు కోసం ఎదురుచూపు!

డా। జోగధేను స్వరూప్ కృష్ణ
ఒక్క చుక్క నీళ్ళు లేకపాయె
కన్నీటి చుక్కకానకట్ట లేకపాయె
యేడ్చి యేడ్చి గొంతుకెండి పాయె
దప్పిక్కి యెండిపోయిన నాలిక లెక్కన
సీలికలైన భూమి
బక్క సిక్కి పోయిన భూమి
యాడికి పోయి సెప్పాలీ గోడు
యెవరికి సెప్పాలీ గోడు

రేతిరి మబ్బు పట్టిందిలే
ఇంక ఆకాశం చిల్లుల్లోంచి
నీటి సుక్కలు కార్తాయి లెమ్మని
ఆశతో కన్నుమూస్తే
తెల్లారి లేస్తే
ఏముంది ఒక్క తడి బొట్టు లేదు
ఊరికే ఉరవడం తప్ప….
అరచడమే తప్ప ఆదుకోవడం తెలీని వాళ్ళే సుట్టు పక్కల
సినుకు ఊసే లేదనే నిజం కల అయితే ఎంత బాగుండేది

కలలు కనడానికే ఉన్న కళ్ళు
నీళ్ళతో తడిసిపోయిన కళ్ళు
ఆశ నిరాశల మధ్య టపటపమని కొట్టుకునే కళ్ళు
వానకోసం చూసిచూసి విసిగి వేసారిన కళ్ళు

చల్లగాలి వత్తే చాలు మట్టి వాసన
మట్టి వాసనొస్తే చాలు పడింది సినుకని ఓ సంబడం
ఎంతో సేపు లేదు సంతోషం
సినుకు కెంత కోపమని…
పడదు… పడదు…
ఏంపాపం చేసినామని, ఏం నేరం చేసినామని
మబ్బులన్నీ యాడ దాక్కున్నాయో
కప్పలమ్మ నీకెమైనా తెలుసా

నాసిన్నపుడు
కుండపొతగా వర్షంకురిస్తే
మా ఊరి అయ్యోరు కట్టిచ్చిన కాగితప్పడవలు
ఈదిగుండ పారే నీళ్ళలో ఇడిసి ఆడుకునే రోజులు
నా పిల్లలకు సెప్తే….
నాయన అబాద్దాలడతాండాడని నగుకున్నపుడు
మా ఆడదాని కండ్లలో జాలి సూపులు
ఆ చణాన నేను సచ్చినా బాగుండేది.
కలం కాగితప్పడవల్లో ఒడ్డు దాటడానికి
ఆశ తెడ్డు ఆధారం..
నిరాశ తుఫానులో చిక్కుకున్న పడవ గట్టెక్కేదానికి
ఆకాశం తప్ప దిక్కెవరు..
ఇట్లా ఎందుకు జరుగుతాండాదో నీకేమైనా తెలుసా కప్పలమ్మ…

అప్పట్లో కుండపోతలుగా వాన పడేది
వద్దంటే వాన
కళకళలాడే చెరువులు
ఎగసిపడే కాలువలు
ఆకాశానికి భూమికి తాకుతూ ఏసిన పందిరిలా వాన
ఆకాశాన్ని లాగేసి తనతో కలుపుకునేకి
భూమి పేనిన నీటి చుక్కల తాడులా వాన
బయటకు రానిచ్చేది కాదు
మట్టి మిద్దెలు గదా కొంపంతా నీళ్ళే
బొటుకు బొటుకు పడతాంటే సత్తు గిన్నెలు ఇంటినిండా పరిచి
బొటుకు బొటుకు పడతాంటే గిన్నెల్లో సంగీతం టప్ టప్ అని….
ఆడదానికి ఒకటే పని
అంత వాన
మట్టి నీళ్ళ చారికలు చారికలు
ఇళ్ళంతా తడిసిపోయి ఇంట్లో ఆడది విసుక్కునేంత వాన
భూమికి బొక్కలు పెట్టేకి ఆకాశం ఏసిన బాణాల్లెక్కన
వాన…..అంత వాన…
తూముల్లోంచి జోరున వాన నీళ్ళు
చించెరువు కట్టకాడ బాయికి పోయి
నీళ్ళు ఏంతెత్తావ్ లెమ్మని
ఇంటి తూము నీళ్ళు కడవలకెత్తుకుపోయే రోజులు
గోనె సంచి నెత్తినేసుకుని చేని కాడికి పోయి చూత్తే..

వానకు నాని అప్పుడే తానమాడిన పడుచుపిల్ల మాదిరిగా ఉండేది భూమి
పచ్చగా సెట్లన్ని చిన్న గాలికి ఊగుతాంటే తడిసిపోయి
జోలెలో పడుకొని నవ్వుకునే సంటోడి లెక్కన ఉండేది భూమి
వద్దంటే వాన
వాన వెలిసినంక నీటి సుక్కల్తో నిండిన అద్దం మాదిరిగ ఆకాశం
పసుపు పూసి నీళ్ళు పోసుకున్నట్లు పచ్చగా భూమి
యావైపు చూసిన పచ్చ పచ్చనే
పండు ముత్తైదువు అప్పుడు భూమి
ఎంతమందికి అన్నం పెట్టేది
ఎంతమందిని అక్కున చేర్చుకునేది
ఎంతమందిని ఓదార్చేది
అన్నపూర్ణమ్మ తల్లి అప్పుడు భూమి
పచ్చని చీర కట్టుకుని గాలికి రెపరెపలాడే పైట చెరగు
మాదిరిగా పైర్లు ఊగుతాంటే
చేనిగట్టు మీద కూకుని చూడబుద్దయ్యేది ఎంత సేపైన
ఇసుమంతైన ఇసుగేసేది కాదు
కంటికింపుగా ఉండేది

ఊరికే కూకోక పోతే
వచ్చి పని చేయరాదు అంటూ
చేతులూపి పిలిచినట్లు ఊగే పైర్లు
గుంపులు కట్టి ఆడుకునే పిళ్ళోల్ల మాదిరి ఊగే పైర్లు
పిచ్చికలు, పక్షులు
తనని పట్టుకునేకి వస్తాంటే
తప్పిచ్చుకునే మాదిరి అటు ఇటు ఊగే పైర్లు
దోబూచులాడే పైర్లు
దాగుడుమూతలాడే పైర్లు
సేని గట్టున కూకుని చూత్తాంటే
ఎంతసెపైనా చూడబుద్దయ్యేది
ఇసుమంతైన ఇసుగేసేది కాదు
కంటికింపుగా ఉండేది…

అప్పట్లో ఎంత పని!
చేతి నిండా పని
నాట్లు వేసేది మొదలుకుని కలుపు తీసే దాకా
కోతలు మొదలు కొని ఊర్పుల దంకా
తూర్పార పట్టే దాకా
పని.. పని.. పని…
కట్టం తెలీకుండా పనిలో పాటలు
పాటలే పాటలు.. ఎన్ని పాటలు
నవ్వుతూ పనిలో మునిగి కట్టం తెలీకుండా
పని.. పని.. పని..

పురిటి నొప్పుల్తో విలవిలలాడే భూమి
పండిన పంట ఇంటి నిండా
గాదెలనిండా
పొంగుతున్న పాలగిన్నెల్లా నిండుగా
ఇంటినిండా బస్తాలు
నిడుగా ముస్తాబయ్యి ఉండే ఇండ్లు
ఏం బెంగలేకుండా
ఇంటి కాడ కట్ట మీద కూకుని
యేదాంతం మాట్లాడుకునేంత సుకం
కడుపునిండా ఇంత తిని, కంటినిండా ఇంత నిదర ….

ఇదంతా కల అయిపాయే
బతుకు కలవరం అయి పాయే
సెబితే నమ్మవుగాని
-ఆ కలకలం లేదు
-ఆ నిండుదనం లేదు
-ఆ ఆనందం లేదు
యాడ సూసినా దరిద్రమే
నవ్వంటే యెట్లా ఉంటుందో మరిచిపోయి చాన్నాళ్ళయింది
ఇట్లా ఎందుకైందో నీ కేమైన తెలుసా కప్పలమ్మా !
నీకు పెళ్ళి సేత్తే వాన కురుత్తదని సెప్తే..
బిడ్డ పెండ్లి ఎట్లా చెయ్యలేనని
గుండెల కుంపటి ఆర్పలేనని
కట్టం కాడ గబుక్కున రాలిపోతానని
తెలుసుకొని
నీకు పెండ్లి సేత్తే వానా కురుత్తే
ఇంత ఎనకేసుకుని ఇంటికి మామిడాకులు కడదామనుకుని
ఆశతో నీకు పెండ్లి సేత్తే
ఆశ అంతకంతకూ పెరిగిపాయే
గాలి ఊదిన బుడగమాదిరి
ఆశ అంతకంతకూ పెరిగిపాయే
ఎంత సేపు బుడగ నిలుత్తాది
వాన సినుకు లేకపాయే
బిడ్డ పెండ్లి ఎట్లా సెయ్యలేను
నీ పెండ్లైనా చేసిన తృప్తి మిగిలింది..
నమ్మకాలే జీవితాన్ని వమ్ము సేత్తండాయి
నమ్మకం సాలెగూడు మాదిరి
దూరానికి అందంగా కనిపించి చిక్కించుకుంటుంది
వమ్మయిందో.. చిక్కి శల్యం సేస్తుంది

అయ్యోరు బారతంలో విరాట పర్వం చదివితే
వానొత్తదంటే ఊరంతా కలిసి చందాలేసుకుని
బాపనయ్యతో మాట్లాడి
బారతం చదివిత్తే
వాన సినుకేమో గాని
బాపనయ్య సంబరాలకు అప్పులో అప్పు పెరిగిపాయే
పూజలో కర్పూరంలా కాలం కరిగిపాయే గాని
వాన మాత్రం రాక పాయే
బారత బాగోతాలకు కాలం సెల్లిపోయే రోజులు
ఇలువల్లేని రోజులు,
దరమం కుంటుతాంటే వానలొత్తాయా
అంతా బ్రమ
మంత్రాలకు సింతకాయలు రాల్తాయేమో గాని
మబ్బు రాతిగుండె మాత్రం కన్నీళ్ళు కార్చదు…

గంగమ్మ కనికరిత్తది జాతర సేస్తే అని
అయిన కాడికి
బందువులందరిని పిలిచి ఇంటినిండుగా సంబరం….
ఊరుఊరంతా సంబరం..
అమ్మతల్లికి కోటి దండాలు
తప్పెట్లు తాళాలు
తందనాలు, ఊరేగింపులు
నూటొక్క బిందెల నీళ్ళు గుమ్మరించి
గంగమ్మకు తానం పోత్తె….
దున్నలు, జీవాలు, కోళ్ళు
బలిచ్చి రగత దాహం తీర్చినా
మాదాహం తీరక పాయే
బాయి ఎండిపాయే
వాన సినుకు లేకపాయే
శివుని కొప్పులో గంగమ్మ కులుకుతానే ఉండాది..
రకతంతో భూమి యెర్ర బారింది కాదాని
ఇన్ని నీళ్ళు కొట్టి భూమిని కడుగుదామని
ఆకాశానికి ఆలోచన రాదు.
భూమి వాడిపోయి పగుల్లు పోతానే ఉంది..
మా గొంతులు ఎండుతానే ఉండాయి
దప్పిక నోళ్ళు తెరిచినట్టు పగుల్లు పోయిన భూమి
నాలుక యెండి పోతాంటే బయటికి సాపి..
-నీళ్ళ కోసం తపించే భూమి
-తడి కోసం తపించే భూమి
-ఒక్క సుక్క నీటి బొట్టుకు ముకం వాచి పోయిన భూమి
-గొంతెండిపోతాంటే
గుక్కెడు నీళ్ళు పొయ్యలేని
నీ బతుకు ఓ బతుకేనా
అని నిలదీసి అడిగే భూమి!
-గట్టు మీద కూకొనేకి మనసొప్పక
దూరంగా నిలబడి సూత్తాంటే
ముండమోపి లాగా ఎండిపోయిన భూమి!
-సూడ బుద్ది కాక తలపక్కకు తిప్పుకుంటే
యేరు దాటింతరువాత తెప్ప తగలేసే రకమని
అనుకుంటాదేమోనని బెంగ
యెండిపోయి కండలేక జీవం పోయి
గుండెనిండుగా బాదతో
బరువుగా తలవంచుకున్నట్టున్న భూమి!
సూడబుద్దేయ్యక తలపక్కకు తిప్పుదామంటే
మనసొప్పదు గదా!

వానల్లేకపోతే పాయే
భూమిలో నీళ్ళు యెలికి తీత్తామని
నీటికోసం జూదం..
అయ్యోరు వాస్తు చూసి ఈడ తవ్వుకోమంటే
నూరడుగులు అమ్మ గుండెలో లోతుగా గునపాలు
బోరు బాయికి…
అడుగు అడుక్కి తవ్వుతాంటే
తల్లి రొమ్ము గుద్దుతాండావని
భూమి బాద పడతాదేమోనని బెంగ
తల తాకట్టు పెట్టి తెచ్చిన సొమ్ముతో
నూరు అడుగులు తవ్వినా..
ఇన్నూరు అడుగులు తవ్వినా…
అడుగు అడుక్కి ఉన్న ఆశ పోయింది
నీళ్ళు ముకానికి చిమ్ముతాయనుకుంటే
సెమట తుడిచి ఇంత సల్లదనం కురిపిత్తాయనుకుంటే
సివరికి ఇంత పెద్ద బండ
గుండె గుబేలు మనేలా
నెత్తిన ఇంత పెద్ద బండ
చెంప చెళ్ళుమనిపించింది
వాస్తూ లేదు అయ్యోరు లేడు…
ఇదేందయ్యో అని అడిగితే
నీ పేరు మీద బలం లేదని మళ్ళ బుకాయింపు
యాడికని నమ్మేది..
మడుసుల్ని నమ్మేకంటే మాను న్నమ్మేది మేలని
ఊరికే అన్నారా ..!
నమ్మ బలికినోడు నట్టేట ముంచేత్తాంటే
బతుకునిచ్చే తల్లి రొమ్ము ఎండిపోతాంటే
ఎవర్నేమని లాబం
భూమినండా బోరు బాయిలే, నీళ్ళు లేని బోరు బాయిలే!
ఈడ పడతాది తవ్వు
అదిగో ఆడపడతాది తవ్వు
ఇంకొంచెం ముందు పడతాది తవ్వు
ఆశ…ఆశ… మినుకుమినుకుమనే ఆశ…
జూదం…ఆశ..
ఆశ..జూదం…

మళ్ళీ మట్టి వాసన
గమనించావా కప్పలమ్మా
ఆశ.. పైనుండి ఓ చినుకు
మళ్ళీ ఓ చినుకు
తేనే తుట్టెలోంచి తేనె బొట్టులా
ఒక్కో చినుకు
వరుసగ చినుకులు, చినుకులు, చినుకులు
వాన…వానా… ఆశ…

అరువుకు తెచ్చిన విత్తనాలు
భూమి తల్లికి గోరు ముద్దల్లా అందించి
పంట కోసం యెదురు చూస్తూ
ఆశగా.. ఆశగా…
ఆకాశం కనికరించినా
అవకాశం కలిసిరావద్దు…
కల్తీ విత్తనాలు, కల్తీ యెరువులు…
ఒక్కసారిగా మనసు కుదేలుమంది
గుండె గుబేలుమంది…
భూమికి పచ్చ చీర కప్పుదామనుకున్న ఆశ….
నిరాశ అయితే ఒక్కసారిగా జీవితం కూలిపోతుంది..
మనిషి కల్తీ, మనసు కల్తీ, బతుకు కల్తీ…
మనిషే ప్రకృతిని పొట్టన పెట్టుకుని
భస్మాసుర హస్తం ….
తన నెత్తి మీద తానే నిప్పు పెట్టుకుంటూ…
యెదుటి వాడి గుండెల్లో గునపాలు కుచ్చుతూ
బతుకంతా ఇంతే…
కొన ఊపిరి ఆగిపోతూ
ఇప్పటికి చాలు…
గాలిలో కలిసిపోయి,
ఇప్పటికి చాలు…
మళ్ళి పుడతాను,
సినుకై మళ్ళి పుట్టి భూమికి పచ్చచీర కప్పుతాను...

No comments: