నిరంతర వార్తా స్రవంతి

Wednesday, February 27, 2008

అయ్యన్నపాత్రుడు వ్యవహారంపై అట్టుడికిన అసెంబ్లీ

తమ పార్టీ శాసనసభ్యుడు చింతకాయల అయ్యన్న పాత్రుడు రాజీనామాపై తక్షణ చర్చకు బుధవారం శాసనసభలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు పట్టుబట్టారు. దీంతో సభలో గందరగోళం చెలరేగింది. అయ్యన్నపాత్రుడిపై దాడి, ఆయన రాజీనామాపై చర్చించాలని తెలుగుదేశం సభ్యులు ప్రశ్నోత్తరాల సమయాన్ని అడ్డుకుంటూ పట్టుబట్టారు. అయ్యన్నపాత్రుడి రాజీనామాను తాను ఆమోదించలేదని, అయ్యన్నపాత్రుడితో చర్చించిన తర్వాత చర్యలు తీసుకుంటానని స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డి చెప్పారు. అయినా తెలుగుదేశం సభ్యులు వినలేదు. దీంతో సభను స్పీకర్ 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. తిరిగి సమావేశమైన తర్వాత కూడా తెలుగుదేశం సభ్యులు తమ పట్టును వీడలేదు. బడ్జెట్ పై చర్చ సందర్భంగా అందుకు అవకాశం ఇస్తానని స్పీకర్ చెప్పడంతో వారు తమ పట్టు వీడారు.తమ శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర్ రావుపై శుక్రవారం వరకు విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేయాలని తెలుగుదేశం సభ్యులు కోరారు. తెలుగుదేశం పశ్చాత్తాపం వ్యక్తం చేస్తే సస్పెన్షన్ ను ఎత్తివేయడానికి సిద్ధమేనని శాసనసభా వ్యవహారాల మంత్రి కె. రోశయ్య చెప్పారు. పశ్చాత్తాపం వ్యక్తం చేసే ప్రసక్తే లేదని, నిరసన వ్యక్తం చేయడం తమ హక్కు అని తెలుగుదేశం శాసనసభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. బిసి సంక్షేమంపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలుగుదేశం సభ్యులు సభనుంచి వాకౌట్ చేశారు.

No comments: