నిరంతర వార్తా స్రవంతి

Friday, March 14, 2008

సరికొత్త సినిమా పేర్లు!

నేటి సినిమా పేర్లు చూస్తుంటే నవ్వాలో, ఏడవాలో తెలియని పరిస్థితి.

కాస్తోకూస్తో "చెడు" లక్షణాలు సినిమా పేర్లలో కనిపించటం ఎప్పటి నుంచో ఉంది. ఉదాహరణకి దొంగరాముడు, కిలాడి, మోసగాళ్లకు మోసగాడు, గూండా, రౌడీ వగైరా. ఎక్కడో చదివిన గుర్తు. "మంచి" అనేది తెలుపు రంగులాంటిది. నిర్మలంగా ఉంటుంది. కాని "చెడు" అనేది రకరకాల రంగులలో ఉంటుంది. అందుకే, మనం చెడ్డవాటికి ఆకర్షితులైనంతగా మంచి వాటికి కాలేము. మనవాళ్లు ఈ సూత్రాని ఎప్పుడో పట్టేసారు. ఒక్క "దొంగ" అనే విషయం తీసుకొని దొంగరాముడు, దొంగ, అడవిదొంగ, కొండవీటి దొంగ, టక్కరి దొంగ, అమ్మ దొంగ, దొంగాదొంగ, దొంగా దొంగది, దొంగ రాముడు అండ్ పార్టీ వగైరా వగైరా సినిమాలు తీసారంటే అర్థం చేసుకోవచ్చు. ఒక మూల పదం తీసుకొని దాన్ని అట్నుంచి ఇట్నుంచి చితక్కొట్టి కొత్త పేర్లు సృష్టించడం మన ఆనవాయితీ!

ఈ మధ్య "చెడు" కాకుండా "అసహ్యం" వేసే పదాలను సినిమా పేర్లగా పెట్టటం పరిపాటి అయ్యింది. పోకిరి, దేశముదురు వగైరా. ఈ సినిమాలు సూపర్ హిట్టని వేరే చెప్పక్కరలేదు కదా. ఎంత అసహ్యమైన పేరు పెడితే అంత హిట్టవుతుంది అనే భావన కనిపిస్తోంది. భవిష్యత్తులో ముదురు పోకిరి, ముదుర్లకు ముదురు వంటివి వచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదు.

నేనుకూడా కొన్ని సూపర్ హిట్టు సినిమా పేర్లు ఆలోచించాను. నా మూల పదం బేవార్స్. ఈ క్రింది పేరు పెట్టి ఏ సినిమా తీసినా సూపరు డూపరు హిట్టే!
1) బేవార్స్ (టాగ్ లైన్ - ఎంత బేవార్సో వీడికే తెలీదు)
2) నువ్వు బేవార్స్ - నేను బేవార్స్
3) బేవార్సులకి బేవార్స్
4) నేనే బేవార్స్
5) మా ఆవిడ మీదొట్టు మీ ఆవిడ బేవార్స్ (గొప్ప మహిళా చిత్రం)
6) ఒకే బేవార్స్ (అనువాద చిత్రం)
7) బేవార్సులౌదాం రా! (ప్రేమ కథా చిత్రం)
8) బేవార్స్ రాముడు (టాగ్ లైన్ - గొప్ప బేవార్సని వీడి ఫీలింగ్)

శెలవ్, ఇట్లు మీ బేవార్స్.

No comments: