నిరంతర వార్తా స్రవంతి

Saturday, March 1, 2008

ఆంధ్రుల మధ్య వారధిగా తానా సేవలు

ఆంధ్రుల మధ్య వారధిగా తానా అవసరమైన వారికి సాయం, సేవలు కోరుకునే వారికి సహకారం, సహ సంస్థలతో భాగస్వామ్యంతో ముందుకు సాగే ప్రాతిపదికన ఉత్తర అమెరికాలోనూ, తమ మాతృభూమి ఆంధ్రలో అవసరమైన వారికి చేయూత అందించేలా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా సంస్థ ఏర్పాటైంది.ఉత్తర అమెరికాలో నివసించే తెలుగు సంతతి ప్రజలచే తెలుగు సంస్కృతి పరిరక్షణతో పాటు తెలుగు వారికి గుర్తింపు తీసుకువచ్చేలా లాభాపేక్ష రహితంగా ముప్పైయేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఈ సంఘం తానాగా ప్రాచుర్యం పొందింది.తెలుగు సాహిత్యం, విద్య, సామాజిక, ధర్మ నిరతి కార్యక్రమాల్లో ప్రవాసాంధ్రులు పాలు పంచుకునేలా ఈ సంఘం పలు వేదికలను నిర్వహిస్తోంది. సుమారు పదివేల మంది సభ్యులు కలిగిన ఈ సంఘం అమెరికాలోని అతి పెద్ద భారతీయ సంతతి సంఘాలలో ఒకటిగా గుర్తింపు పొందింది.తానా పత్రిక పేరిట ఈ సంఘంలో సభ్యులకోసం ఓ పక్షం పత్రికను కూడా ప్రచురిస్తోంది. తెలుగు మాట్లాడే వారు అధికంగా నివసిస్తున్న ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడంతో పాటు తుపాను, వరద భీభత్సం వంటి ప్రకృతి వైపరీత్య సమయాల్లో సహాయ చర్యలు చేపట్టేలా తానా ఫౌండేషన్‌ను ఈ సంఘం తరపున పూర్తి స్వయం ప్రతిపత్తితో ఏర్పాటు చేశారు.ప్రతి రెండేళ్లకోసారి జులై నాలుగో వారం చివర్లో నిర్వహించే ఉత్తర అమెరికా తెలుగు మహాసభలు, తానా యువజన మహా సభలు మంచి ప్రాచుర్యం పొందాయి. వీటికి ఆంధ్రనుంచి సైతం పెద్ద సంఖ్యలో ప్రముఖులు హాజరవుతున్నారు. ఆహార, ఆరోగ్య, నివాస సదుపాయాలు లేని వారికి సాయపడటం, తెలుగు విద్యార్థులు, ఏకాకిగా వస్తున్న తెలుగు సందర్శకులకు సాయం అందించడం, వృద్ధులు, వికలాంగులకోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం, తెలుగు సంస్కృతిని పరిరక్షించేలా యువతను ప్రోత్సహించడం చేస్తోంది.బాగా వెనుకబడిన, మారుమూల గ్రామాలకు సురక్షిత మంచినీరు, పారిశుద్ధ్య, రహదారి వసతులు కల్పించడం, వికలాంగులకు సాయం అందించడం, వారి వారి గ్రామాలకు సేవలు అందించేలా స్పాన్సర్లను ప్రోత్సహించడం, ఉత్తర అమెరికాలో చదివేలా పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించడం కూడా సంస్థ ముఖ్య కార్యకలాపాలుగా ఉన్నాయి.గ్రాడ్యుయేట్ స్కాలర్ షిప్పుల కింద ఆంధ్రలో నివసిస్తూ, త్వరలో అమెరికా రావాలనుకుంటున్న ఏడుగురు విద్యార్థులకు రెండు వేల డాలర్ల చొప్పున అందిస్తోంది. అలాగే యూత్ స్కాలర్ షిప్‌ల కింద ఉత్తర అమెరికాలో ఉన్నత కళాశాల విద్యను అభ్యసించగోరే ముగ్గురు విద్యార్థులకు 2వేల డాలర్ల చొప్పున అందించనుంది.ఈ సంఘంలో ప్రత్యక్షంగా తమకు లేక తమ కుటుంబానికి సభ్యత్వం కోరుకునే వారు జీవిత కాల రుసుంగా 125 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఏడాది కాలానికైతే 30 డాలర్లు చెల్లిస్తే సరిపోతుంది. అలా లేకుంటే దీనికి అనుబంధంగా ఉన్న స్థానిక సంఘాల ద్వారా సభ్యత్వం పొందవచ్చు.ఈ సంఘానికి సంబంధించిన వివరాల కోసం...ది ప్రెసిడెంట్, 17707, హిడన్ ట్రయల్ కోర్టు, స్ప్రింగ్, టెక్సాస్ 77378‌ను స్వయంగా కానీ లేక (713) 443 4047లో ఫోన్ ద్వారా కానీ president@tana.orgలో ఇమెయిల్ ద్వారా కానీ సంప్రదించ వచ్చు. ఇతర వివరాలను http://www.tana.org వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.

No comments: