నిరంతర వార్తా స్రవంతి

Friday, March 14, 2008

నిన్న పరిగెత్తాడు... ఇప్పుడు పరిగెత్తిస్తున్నాడు!!

నియమ నిబంధనలు తెలుసుకోకుండా అతిగా స్పందించడంలో అగ్రగణ్యులు మనవాళ్లేననడంలో సందేహం లేదని ఒరిస్సా వండర్‌కిడ్ బుధియా విషయంలో మరోమారు రుజువైంది. నాలుగేళ్ల ఈ బుడతడు 65 కిలోమీటర్ల దూరాన్ని ఆగకుండా 7 గంటల 2 నిముషాల్లో చేరుకొని ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించడం ఎలా ఉన్నా... ఈ విషయంపై మానవహక్కుల సంఘం ఇచ్చిన తాఖీదులు ఇప్పుడు అందరినీ పరుగెత్తిస్తున్నాయి. ఈ చిన్నారి ఆరోగ్యంపై ఈ సుదీర్ఘ పరుగు ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్న అంశాన్నిగాని, పరుగులో అనుభవజ్ఞులైన పెద్దలకే కష్టసాధ్యమైన ఇలాంటి కార్యక్రమానికి ఓ చిన్న పిల్లాణ్ణి ప్రోత్సహించే ముందు కనీసం గమనించాల్సిన విషయాలనుగాని పరిశీలించకుండా స్థానిక సిఆర్‌పిఎఫ్ ఈ పరుగుకు ప్రోత్సాహమివ్వడం, దీనిని రికార్డుగా నమోదు చేసేందుకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ సహా మీడియా కూడా అత్యుత్సాహం చూపడాన్ని ఇప్పుడు అంతర్జాతీయ మానవహక్కుల తప్పుపట్టింది. ఈ బాలుడు గతంలోనూ ఇలాంటి సుదీర్ఘ పరుగులు (ఇంత దూరం కాకున్నా...) తీసినవాడే అయినా అవన్నీ అనధికారికంగా వ్యక్తిగతంగా చేసినవి. కాగా బుధియా తాజా పరుగుకు నియమ నిబంధనలను పట్టించుకోకుండా, తగిన అనుమతులు లేకుండా ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలు ప్రోత్సాహమివ్వడం చూస్తే అతి ముందు పుట్టి తర్వాతే మనవాళ్లు పుట్టారనిపిస్తోంది. ఇక్కడ మరో విషయాన్ని గుర్తు చేయదలిచాను. మన భారతీయుల్లో చాలామంది అతి పిన్న వయసులోనే అత్యంత ప్రజ్ఞను కనబరచి వైద్యులు, శాస్త్రవేత్తలైన వాళ్లున్నారు. అయితే వారికి వయసుపరంగా తగిన అర్హత లేకున్నప్పటికీ, వివిధ స్థాయిల్లో ప్రభుత్వ అనుమతులు పొందిన తర్వాతే సంబంధింత పరీక్షలలో ఉత్తీర్ణులై పిన్న వయసుకే ఘనతర ప్రతిభను ప్రదర్శించిన ఖ్యాతి గడించారు. కాగా ఇక్కడ బుధియా విషయంలో ఈ సుదీర్ఘ పరుగుకు ముందు అలాంటి అనుమతులేవీ లేవు, ఆరోగ్య పరీక్షలు కూడా జరగలేదు. కోటానుకోట్ల ప్రజలను పాలించేందుకు మనం తయారు చేసుకున్న మన రాజకీయ నాయకుల విషయమే తీసుకోండి. లాభదాయక పదవుల నిర్వహణకు సంబంధించిన నియమ నిబంధనలు తెలుసుకోకుండా చట్టసభల్లో ప్రవేశించి తుదకు రాజీనామాలు సమర్పించి అబాసుపాలు కావాల్సి వచ్చింది. సంఘటనలు వేరైనా... మన దేశంలో దాదాపు ప్రతిచోటా ఇదే తంతు.

No comments: