నిరంతర వార్తా స్రవంతి

Friday, March 14, 2008

ఠాగూరు గారి ఒక గీతానికి స్వేఛ్చానువాదం!

దుమ్ము కొట్టుకుపోయిన బట్టలతో

గోడ వారగా నేలపై
నిద్రతో వొరిగి వున్నాడో యువ యోగి.
ఆరిపోయిన దీపాలు ,
మూసేసిన నగరపు గేట్లు,
నక్షత్రాలన్నీ నల్లని మేఘాలతో
కప్పిన ఆ రాత్రిలో...

హఠాత్తుగా అతని హృదయం వొణికింది.
అడుగులు ఘల్లుమంటో దగ్గిరవతోన్న చప్పుడు.
కలవరంగా కళ్లు తెరిచాడతడు.
ఆమె పట్టుకున్న దీపపు కాంతిలో అతని దయాపూరితమైన కళ్లు మెరిశాయి.
ఆ యువతి నాట్యకత్తె. ఆమె కళ్లు యవ్వనోత్సాహం నింపుకున్నాయి.
దీపపు కాంతిని చిన్నగా చేసి అంది.
' మీ క్షమను కోరుతున్నాను.
యిహ లోకపు సుఖాలన్నింటినీ త్యజించిన యువకుడా!
ధూళి నిండిన యీ పానుపు వీడి అందమైన నా మహలుకు రండి'.
'జవ్వనీ నీ దార్లో వెళ్లిపో .
సమయమొచ్చినపుడు నేను రాకుండా వుండను '.

*

ఆ నగరంపై చంద్రుడు అంతులేని ఆశలను
వెన్నెల్లో గుప్పించి కురిపిస్తున్నాడు.
దారికిరువైపులా చెట్లు తలలూపుతున్నాయి.
యెక్కణ్నించో సన్నని మురళీగానం గాల్లో తేలుతో.
ఆ దేవదారు చెట్ల మీంచి యేవో విషాద పాటలు ప్రవహిస్తున్నాయి.
అందరూ వొదిలేసిన ఆ వొంటరి వీధి వెంబడి
ఆ నగరపు గేట్లను దాటాడు ఆ యువ యోగి.
ఆ నగరపు గోడ నీడలో ఓ స్త్రీ , శరీరంపై మచ్చలతో .
యువకుడు కూచుని ఆమె తలని వొడిలోకి తీసుకున్నాడు.
ఆమె అంది 'దయను కురిపించే మీరు ధన్యులు.
యింతకీ యెవరు మీరు?'

'నీకిచ్చిన మాట ప్రకారం నేను వచ్చాను. '

No comments: