నిరంతర వార్తా స్రవంతి

Thursday, March 6, 2008

జగన్ ముందుచూపు!

ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి కుమారుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ముందు చూపు బాగానే ఉంది. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆయన తన కార్యకలాపాలను సాగిస్తున్నట్లు అర్థమవుతోంది. కడపలో ఆయన ప్రతినెలా దర్బార్ నిర్వహిస్తున్నారు. ఈ దర్బార్ ద్వారా ప్రజాసమస్యలను పరిష్కరిస్తున్నారు. అడిగిన వారికి సాయం అందిస్తున్నారు. ఉద్యోగాలు ఇప్పించడం వంటి సాయాలతో పాటు ఇతర సమస్యలతో ముందుకు వచ్చిన వారికి తగిన సాయాలు ఆయన అందిస్తున్నారు. ఆయన దర్బార్ ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడానికి భారీగానే జనాలు వస్తున్నారు.జగన్ వ్యాపారాలు చాలా వరకు కర్ణాటక రాష్ట్రంలోని బెంగూళూర్ లో ఉన్నాయి. ఈ వ్యాపారాల ద్వారా వచ్చిన డబ్బును ప్రజలకు సాయంగా అందిస్తున్నారట. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి, తండ్రి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వైయస్ జగన్మోహన్ రెడ్డి కార్యకలాపాలు విస్తరించిన విషయం తెలియంది కాదు. అందుకు అనుగుణంగా ఆయనపై తెలుగుదేశం పార్టీ నాయకుల విమర్శలు కూడా పెరిగాయి. జగన్ ను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కూడా వదిలిపెట్టలేదు. వారి విమర్శలకు జగన్ తనదైన శైలిలో తిప్పికొట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.జగన్ సాక్షి పేరు మీద పెద్ద యెత్తున ఒక దినపత్రికను తేవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్న విషయం కూడా అందరికీ తెలిసిందే. ఈ పత్రికలో ఉద్యోగాలు కూడా నమ్మకమైనవారికే దక్కుతున్నాయనే మాట వినిపిస్తోంది. తెలుగుదేశం చేస్తున్న విమర్శలు, పత్రిక స్థాపన ప్రయత్నాలు జగన్ రాజకీయంగా పెరిగేందుకు తోడ్పడుతున్నాయని అంటున్నారు. నిజానికి జగన్ ఇది వరకే పార్లమెంటులో అడుగు పెట్టాల్సింది. జగన్ పార్లమెంటుకు వెళ్లడానికి వీలుగా లోక్ సభ సీటుకు రాజీనామా చేయడానికి చిన్నాన్న వైయస్ వివేకానంద రెడ్డి సిద్ధపడ్డారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానవర్గం అందుకు సిద్ధపడలేదు. దాంతో జగన్ ప్రయత్నం ఫలించలేదు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం ఖాయమనే చెప్పవచ్చు.

No comments: