నిరంతర వార్తా స్రవంతి

Thursday, March 6, 2008

ఘనంగా శివరాత్రి మహోత్సవాలు

శివరాత్రి పర్వదినం సందర్భంగా గురువారం ఉదయం నుంచే రాష్ట్రంలోని ప్రముఖ శివాలయాలన్నీ భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రాలైన శ్రీశైలం, వేములవాడ, శ్రీకాళహస్తి తదితర పుణ్యక్షేత్రాల్లో బ్రహ్మోత్సవ శోభతో ఆలయ పురవీధులన్నీ శోభాయమానంగా దర్శనమిస్తున్నాయి. గత వారం రోజులుగా ఈ పుణ్యక్షేత్రాల్లో వాహన సేవలు, స్వామివారి నిత్య ఊరేగింపులు తదితర కార్యక్రమాలతో భక్త జనం పోటెత్తుతోంది. విజయవాడ దుర్గగుడి భక్త కోటితో పోటెత్తింది. భక్తుల రద్దీతో తొక్కిసలాట చోటుచేసుకుంది. పోలీసులు స్వల్పంగా లాఠీచార్జీ చేశారు. పంచారామ క్షేత్రాలు భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి.శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీశైలంలోని భ్రమారాంబికా సమేతుడైన శ్రీ మల్లికార్జున స్వామి వారిని బుధవారం పురవీధుల్లో విశేష అలంకరణలతో ఊరేగింపు నిర్వహించారు. అలాగే గురువారం శివరాత్రి సందర్భంగా స్వామివారికి కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. మరోవైపు దక్షిణ కాశిగా పేరొందిన శ్రీకాళహస్తి క్షేత్రంలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి సమేతుడైన స్వామివారికి హంస వాహన సేవ నిర్వహించారు. అలాగే మరో శైవ క్షేత్రమైన వేములవాడలోను శివారాత్రి సందర్భంగా శ్రీరాజరాజేశ్వర స్వామి వారికి విశేష పూజలు నిర్వహిస్తున్నారు. ఈ ఆలయానికి 5 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. అలాగే కాళేశ్వరాలయం కూడా భక్తులతో కిటకిటలాడుతోంది. మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు పెద్ద యెత్తున వస్తున్నారు.

No comments: