నిరంతర వార్తా స్రవంతి

Sunday, March 9, 2008

తెలంగాణపై వామపక్షాల వేరుదారులు!

ఉభయ కమ్యూనిస్టుల మధ్య తెలంగాణ చిచ్చు రగులుతోంది.తెలంగాణపై సిపిఐ, సిపియం మాటకు మాట అనుకుంటున్నాయి. మాటల యుద్ధం కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలంగా సిపిఐ నిర్ణయం తీసుకోవడంపై సిపియం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు మండిపోతున్నారు. తెలంగాణ విషయంలో తమ రెండు పార్టీల మధ్య విభేదం ఉందని ఆయన మరోసారి సోమవారంనాడు కూడా అన్నారు. తాము సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామని, తెలంగాణ విషయంలో తమ వైఖరిలో మార్పు లేదని ఆయన అంటున్నారు. పోలిట్ బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి తెలంగాణ విషయంలో కాస్తా మెతకగా మాట్లడుతున్నారు. తెలంగాణపై కాంగ్రెస్ తన వైఖరిని వెల్లడించకుండా సిపియం అడ్డుపడుతోందని చేస్తున్న విమర్శను ఆయన ఇటీవల తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ తన వైఖరిని ముందు ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. తాము తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు వ్యతిరేకమని చెబుతూనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు తాము అడ్డుపడబోమని సిపియం కేంద్ర కమిటీ చాలా కాలంగా సూచన చేస్తూ వస్తోంది. నిజానికి కాంగ్రెస్ కు తెలంగాణ ఏర్పాటు చేయడానికి సిపియం అడ్డు కాదనే విషయం స్పష్టంగానే బయట పడింది.రాష్ట్ర కార్యదర్శి రాఘవులు మాత్రం తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తామనే పద్ధతిలో వీరావేశంతో మాట్లాడుతున్నారు. సిపియం పార్లమెంటు సభ్యుడు పి. మధు మాటల తీరు మరింత శాసించే ధోరణిలో ఉంది. ఈ శాసించే ధోరణే సిపిఐకి మొదటి నుంచీ నచ్చడం లేదని చెప్పాలి. ఒక్క తెలంగాణ విషయంలోనే కాదు, మరిన్ని విషయాల్లోని సిపియంకు, తమకు మధ్య భిన్నాభిప్రాయాలున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్సి కె. నారాయణ తాజా సోమవారంనాడు అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని తాము తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నామని ఆయన చెబుతున్నారు. ప్రజల మనోభావాలను కాదని తమ తాము చెప్పేదే వినాలంటే మంచిది కాదని ఆయన సిపియం నాయకులకు హితవు చెబుతున్నారు.వచ్చే ఎన్నికల్లో వామపక్షాలు రెండు వేర్వేరు కూటముల్లో ఉండవచ్చునని తాజా పరిస్థితిని బట్టి అనిపిస్తోంది. చిరంజీవి రాజకీయాల్లోకి రావడం ఖాయమని ఇటు తెలంగాణ రాష్ట్ర సమితి, అటు సిపిఐ రెండు పార్టీలు భావిస్తున్నట్లే ఉన్నాయి. సిపిఐ, తెరాస వచ్చే ఎన్నికల్లో చిరంజీవి పార్టీతో పొత్తు పెట్టుకోవచ్చుననే మాట వినిపిస్తోంది. సిపియం మాత్రం తెలుగుదేశం పార్టీతో కలిసి సీట్ల సర్దుబాటు చేసుకోవచ్చునని భావిస్తున్నారు. ఏమైనా సిపియం పెద్దన్న పాత్రపై సిపిఐ తెలంగాణ అంశం ఆధారంగా ధిక్కార స్వరాన్ని ప్రకటించిందని భావించవచ్చు.

No comments: