నిరంతర వార్తా స్రవంతి

Thursday, March 13, 2008

చిరంజీవి అంతగా ఉత్సాహంగా లేకపోయినా, ఆయన బావమరిది అల్లు అరవింద్, అయన సోదరులు నాగబాబు , పవన్ కళ్యాణ్ లకు కొత్త రాజకీయ పార్టీ మీద తీవ్రమైన మోజు ఉంది. నాగబాబు, అల్లు అరవింద్ లు ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు. చిరంజీవి కొత్త పార్టీని నమోదు చేయించడానికే వారు ఢిల్లీ వెళ్ళినట్టు తెలుస్తోంది. చిరంజీవికి ఇన్ని కోట్ల మంది ఆదరణ ఉన్నా తాము ఏదైనా పని పడితే మంత్రులను ఎందుకు ఆశ్రయించాల్సి వస్తోందన్న ప్రాధమిక ప్రశ్న చిరంజీవి రాజకీయాలకు అంకురం వంటిది. సినిమా రంగంలో నెంబర్ వన్ నుంచి నెంబర్ టెన్ వరకు చిరంజీవే అయిన సంవత్సరాలు ఎన్నో ఉన్నాయి.

రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన చిరంజీవికి 1991 లోనే వచ్చింది. అవి ఆయన చెన్నై నుంచి హైదరాబాద్ లో స్ధిరపడిన తొలి దినాలు. ఆయన అప్పుడు వెండితెర మీద పసిడి పంట పండిస్తూ వెలిగిపోతున్నారు. హైదరాబాద్ లో పిల్లలను మంచి స్కూళ్ళలో చేర్పించవలసి వచ్చింది. కానీ ఆయన ఆ మంచి స్కూళ్ళకు ఫోన్ చేసి, తన పిల్లలకు సీట్లు ఇవ్వవలసిందిగా కోరే పరిస్ధితి తలెత్తదు. ఆయనకు అభ్యర్ధించుకునే అలవాటు అప్పటికే పోయింది. ఆయన కాల్షీటు ఇస్తే చాలు నిర్మాతలకు ముందే కోట్లాది రూపాయలు వచ్చే స్ధితికి ఆయన వచ్చి అప్పటికే చాలా కాలమై పోయింది. రాజకీయాల్లో ఉంటే ఇలా అడుక్కోవడం ఉండదని, రాష్ట్రాన్ని శాసించవచ్చని చిరంజీవి పదహారేళ్ళ క్రితమే అనుకున్నారు.

ఏడాదికి కొన్ని కోట్ల రూపాయలు వచ్చే కెరీర్ ను వదులుకుని రాజకీయాల్లో రిస్క్ చేయడానికి చిరంజీవి అప్పట్లో సాహసించలేకపోయారు. ఇప్పుడైనా ఆయనకు రిటైర్మెంట్ వయసు రానప్పటికీ తమ్ముడు పవన్, మేనల్లుడు అల్లు అర్జున్, కొడుకు రామ్ చరణ్ ల సినిమాలతో తన సినిమాలు క్లాష్ కాకూడదని అనుకున్న ఆయన ఎన్టీఆర్ పంథాలో రాజకీయాలోకి వచ్చి ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తున్నారు. మొత్తానికి ఆయన రాజకీయ పార్టీకి గ్రౌండ్ వర్క్ ముమ్మరంగా జరుగుతోంది. కార్యకర్తలకు రాజకీయాల్లో శిక్షణ ఇస్తున్నారు. చిరంజీవి ప్రతిపాదిత రాజకీయ పార్టీ కాంగ్రెస్ , తెలుగుదేశం పార్టీల్లో గుబులు పుట్టిస్తోంది.

No comments: